ఫైన్‌ పండు

చూడటానికి పైకి గరుకుగా ఉంటుంది గానీ పైనాపిల్‌ సుగుణాల పుట్ట. రోగనిరోధక వ్యవస్థకూ ఎంతో మేలు చేస్తుంది. కణాల రక్షణ, కొలాజెన్‌ తయారీలో విటమిన్‌ సి పాత్ర చాలా కీలకం. ఇది పైనాపిల్‌లో దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలను తింటే చాలు.

Published : 23 Aug 2022 00:54 IST

చూడటానికి పైకి గరుకుగా ఉంటుంది గానీ పైనాపిల్‌ సుగుణాల పుట్ట. రోగనిరోధక వ్యవస్థకూ ఎంతో మేలు చేస్తుంది. కణాల రక్షణ, కొలాజెన్‌ తయారీలో విటమిన్‌ సి పాత్ర చాలా కీలకం. ఇది పైనాపిల్‌లో దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలను తింటే చాలు. మనకు ఒక రోజుకు అవసరమైన విటమిన్‌ సి మొత్తం కన్నా ఎక్కువే లభిస్తుంది. తిన్న ఆహారం శక్తిగా మారటం, ఎముకల ఆరోగ్యం కోసం తోడ్పడే మాంగనీస్‌ సైతం పైనాపిల్‌లో దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కల నుంచి ఆ రోజుకు అవసరమైన మాంగనీస్‌లో సగానికన్నా ఎక్కువ లభిస్తుంది. ఇవి మాత్రమే కాదు.. విటమిన్‌ బి6, రాగి, థయమిన్‌, ఫోలేట్‌, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్‌, రైబోఫ్లావిన్‌, ఐరన్‌ వంటి పోషకాలూ పైనాపిల్‌లో ఉంటాయి. ప్రొటీన్‌ జీర్ణం కావటానికి తోడ్పడే ఎంజైమ్‌ల మిశ్రమం బ్రొమెలేన్‌ లభించే ఏకైక ఆహారం పదార్థం ఇదే. అందుకే పైనాపిల్‌ను మాంసం త్వరగా ఉడకటానికి వాడుతుంటారు. ఇది ప్రొటీన్‌ను విడగొట్టి, మాంసాన్ని మృదువుగా చేస్తుంది. బ్రొమెలేన్‌ తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా, బాగా ఒంటపట్టేలా చేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కొన్ని విశృంఖల కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇవి దీర్ఘకాల జబ్బులకు దారితీస్తాయి. పైనాపిల్‌లోని ఫ్లేవనాయిడ్లు, ఫెనోలిక్‌ ఆమ్లాలు వీటిని అడ్డుకొని, కణాలను కాపాడతాయి. బ్రొమెలేన్‌కు క్యాన్సర్‌ ముప్పును తగ్గించే గుణముందనీ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి నొప్పిని తగ్గించే గుణమూ ఉంది. ఇది కీళ్ల నొప్పులనూ తగ్గిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత కండరాలు త్వరగా కోలుకోవటానికీ పైనాపిల్‌ తోడ్పడుతుంది. పైనాపిల్‌ ముక్కలను నోట్లో వేసుకున్నప్పుడు కాస్త చిమచిమలాడినట్టు అనిపిస్తుంటుంది కదా. దీనికి కారణం బ్రొమెలేన్‌ ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేయటమే. ఇది తాత్కాలికమే. తర్వాత అంతా కుదురుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని