మనసు మార్చే ఆహారం!

ఒత్తిడి, నిద్రలేమి, భావోద్వేగ సమస్యల వంటివన్నీ మానసిక స్థితి (మూడ్‌) మీద ప్రభావం చూపుతాయి. ఇందులో పోషకాహారం పాత్రా తక్కువదేమీ కాదు. తీపి పానీయాలు, వేపుళ్లు, మాంసం ఉత్పత్తులు, ఎక్కువ వెన్నతో కూడిన పాల పదార్థాలు, మిఠాయిల వంటి వాపును (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే ఆహారంతో కుంగుబాటు, మానసిక సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలూ పేర్కొంటున్నాయి.

Updated : 11 Oct 2022 02:53 IST

ఒత్తిడి, నిద్రలేమి, భావోద్వేగ సమస్యల వంటివన్నీ మానసిక స్థితి (మూడ్‌) మీద ప్రభావం చూపుతాయి. ఇందులో పోషకాహారం పాత్రా తక్కువదేమీ కాదు. తీపి పానీయాలు, వేపుళ్లు, మాంసం ఉత్పత్తులు, ఎక్కువ వెన్నతో కూడిన పాల పదార్థాలు, మిఠాయిల వంటి వాపును (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే ఆహారంతో కుంగుబాటు, మానసిక సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలూ పేర్కొంటున్నాయి. రక్తంలో గ్లూకోజు మోతాదుల హెచ్చుతగ్గులు, పోషకాల లోపం మూడ్‌ మారిపోవటానికి, భావోద్వేగాలు అదుపు తప్పటానికీ దారితీస్తాయి. కాబట్టి ఆహార అలవాట్లు, పదార్థాలు మన మూడ్‌, శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకొని ఉండటం మంచిది.

చెయ్యకూడనివి
భోజనం మానెయ్యటం: వేళకు ఆహారం తీసుకోవటం మనసు కుదురుగా ఉండటానికీ తోడ్పడుతుంది. భోజనం మానేస్తే.. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తినకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయి. ఫలితంగా నీరసం ఆవహిస్తుంది. ఉల్లాసం తగ్గుతుంది. ఏకంగా ఆలోచనా విధానమే మారిపోతుంది.
కొన్ని పదార్థాలు తినకపోవటం: మనకు అన్నిరకాల పోషకాలు అవసరం. వివిధ రకాల పదార్థాలు తింటేనే ఇవన్నీ లభిస్తాయి. కానీ కొందరు కొన్ని పదార్థాలు తినకుండా భీష్మించుకుంటారు. దీంతో శరీరానికి అత్యవసరమైన పోషకాలు లోపించే ప్రమాద ముంది. ముఖ్యంగా ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, విటమిన్‌ బి, విటమిన్‌ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లోపిస్తే మూడ్‌ దెబ్బతింటుంది. శక్తి సన్నగిల్లి మానసికంగా జావగారిపోవటం ఖాయం.
పాలిష్‌ పదార్థాలు ఎక్కువగా తినటం: బాగా పొట్టుతీసిన గోధుమలతో చేసిన బ్రెడ్డు, కేకుల వంటివి రక్తంలో వేగంగా గ్లూకోజు హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. ఫలితంగా మూడ్‌ మారిపోయి నీరసం, చిరాకు వంటివి తలెత్తుతాయి.

చేయాల్సినవి
కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి: గ్లూకోజు మోతాదులు తగ్గితే నీరసం, అలసట ముంచుకొస్తాయి. కాబట్టి రోజంతా తగినంత శక్తి అందేలా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు, గింజపప్పులు, విత్తనాల వంటివి తీసుకుంటే ఇంకా మంచిది.
ద్రవాలు తగినన్ని: ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. నీటి శాతం తగ్గితే ఏకాగ్రత దెబ్బతింటుంది. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం కుంటుపడుతుంది. కాబట్టి తగినన్ని ద్రవాలు.. ముఖ్యంగా నీరు తాగటం మంచిది.
కెఫీన్‌ మితంగానే: కెఫీన్‌ వెంటనే ఉత్సాహం కలిగిస్తుంది. కానీ దీని ప్రభావం తగ్గుతున్నకొద్దీ హుషారు తగ్గుతుంది. మరీ ఎక్కువగా తీసుకుంటే నిద్రకూ భంగం కలిగిస్తుంది. ఫలితంగా మూడ్‌ కూడా మారుతుంది. కాబట్టి టీ, కాఫీ వంటివి మితంగానే తీసుకోవటం మంచిది. చాక్లెట్లు, కూల్‌డ్రింకులు, శక్తి పానీయాల్లోనూ కెఫీన్‌ ఉంటుందనే సంగతి మరవరాదు.
మంచి కొవ్వులు తినటం: మన మెదడు సరిగా పనిచేయటానికి ఒమేగా 3, ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు అత్యవసరం. చేపలు, గింజపప్పులు, ఆలివ్‌ నూనె, పొద్దుతిరుగుడు నూనె, గుమ్మడి విత్తనాలు, అవకాడో, పాలు, పెరుగు, ఛీజ్‌, గుడ్ల వంటివాటితో ఇలాంటి మంచి కొవ్వులు లభిస్తాయి. అదే సమయంలో వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలి కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని