Updated : 11 Oct 2022 10:07 IST

Heart Disease: మాంసంతో గుండెజబ్బు ఎందుకొస్తుంది?

గుండె రక్తనాళాల్లో పూడికల ముప్పు తగ్గాలంటే మాంసం ఎక్కువగా తినొద్దని డాక్టర్లు చెబుతుండటం తెలిసిందే. ఇంతకీ మాంసంతో పూడికల ముప్పు ఎలా పెరుగుతుంది? పేగుల్లోని సూక్ష్మక్రిముల ద్వారా! ఆశ్చర్యంగా అనిపించినా కొంతవరకు ఇది నిజమేనని టఫ్ట్స్‌ యూనివర్సిటీ, క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. మాంసంలో ఎల్‌-కార్నిటైన్‌ రసాయనం, కోలిన్‌ పోషకం దండిగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు జీర్ణం చేసుకుంటాయి.

ఈ క్రమంలోనే ట్రైమిథైలమైన్‌-ఎన్‌-ఆక్సైడ్‌ (టీఎంఏఓ), అలాగే దీనికి సంబంధించిన వై-బుటీరోబెటైన్‌, క్రోటోనోబెటైయిన్‌ వంటి రసాయనాలు (మెటబాలైట్లు) పుట్టుకొస్తాయి. ఇవి పూడికలు ఏర్పడటంలో పాలు పంచుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ‘‘ఎల్‌-కార్నిటైన్‌, కోలిన్‌ నుంచి పుట్టుకొచ్చిన మెటబాలైట్లు గ్రంథుల మాదిరిగానే పనిచేస్తాయి. హార్మోన్ల మాదిరిగా రక్తం ద్వారా శరీరమంతటా ప్రయాణిస్తూ ప్రభావం చూపుతాయి’’ అని సహ అధ్యయన కర్త డాక్టర్‌ టాంగ్‌ చెబుతున్నారు.

ఇలా పూడికలు ఏర్పడటానికి, గుండె జబ్బుల ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కన్నా ఇవే ఎక్కువగా గుండెజబ్బు ముప్పును పెంచుతున్నాయని పేర్కొంటున్నారు. మనలో కొందరికి రక్తనాళాల్లో పూడికల ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటోందనే గుట్టును ఈ అధ్యయన ఫలితాలు కొంతవరకు ఛేదించినట్టయ్యింది. పేగుల్లోని బ్యాక్టీరియా పెద్దమొత్తంలో మెటబాలైట్లను ఉత్పత్తి చేసేవారికి పూడికల ముప్పు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మాంసాహారులు మితంగానే తినటం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు