Updated : 29 Nov 2022 11:41 IST

Sperm Count: వీర్యపుష్టి కోసం..

మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. గాలి కాలుష్యం, పాస్టిక్స్‌, ఆహారంలో పురుగు మందుల అవశేషాల వంటి పర్యావరణ ప్రభావాల దగ్గర్నుంచి బద్ధకం, పొగ తాగటం, మద్యం అలవాటు, పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌ వంటివేవైనా కారణం కావొచ్చు. పర్యావరణ ప్రభావాలు మన నియంత్రణలో ఉండేవి కావు గానీ ఆహార, విహారాల పరంగా జాగ్రత్తగా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు నియంత్రణలో ఉంచుకోవటం, తగినంత నిద్ర పోవటం, పొగ అలవాటు మానెయ్యటం, మద్యం పరిమితం చేసుకోవటం, సుఖవ్యాధుల బారిన పడకుండా చూసుకోవటం.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల నివారణ వంటివి ఎంతో మేలు చేస్తాయి. మానసిక ఒత్తిడీ శృంగార జీవితం మీద ప్రభావం చూపుతుంది. దీన్ని తగ్గించుకోవటమూ కీలకమే. అలాగే ఆహార పరంగానూ కొన్ని పదార్థాలను విధిగా తీసుకునేలా చూసుకోవాలి.

* గుడ్లు: వీటిల్లో ప్రొటీన్‌ దండిగా ఉంటుంది. విశృంఖల కణాల (ఫ్రీ రాడికల్స్‌) దాడి నుంచి వీర్యాన్ని కాపాడటానికి కూడా గుడ్లు తోడ్పడతాయి. వీర్య కణాలు చురుకుగా కదలటానికీ దోహదం చేస్తాయి.
* పాలకూర: ఇది ఫోలిక్‌ యాసిడ్‌ గని. వీర్యకణాలు సక్రమంగా ఎదగటానికి, దెబ్బతిన్న వీర్యకణాలు తగ్గటానికి ఫోలిక్‌ యాసిడ్‌ ఉపయోగపడుతుంది. ఇది పాలకూరతో పుష్కలంగా లభిస్తుంది.
* అరటిపండ్లు: ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి కావటానికి తోడ్పడే విటమిన్‌ ఎ, విటమిన్‌ బి1, విటమిన్‌ సి అరటిపండ్లలో ఉంటాయి. వీటిల్లో బ్రొమిలేన్‌ అనే అరుదైన ఎంజైమ్‌ కూడా ఉంటుంది. ఇది వాపుప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్‌)ను అడ్డు కోవటం ద్వారా వీర్యం నాణ్యతను, వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.
* అక్రోట్లు: వీర్యకణాల మీదుండే కణజాల పొర ఉత్పత్తికి మంచి కొవ్వు అత్యవసరం. అక్రోట్ల(వాల్‌నట్స్‌)లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇందుకు బాగా తోడ్పడతాయి. ఇవి వృషణాలకు రక్త సరఫరాను పెంచుతాయి మరి.
* గుమ్మడి పలుకులు: వీటిల్లో ఫైటోస్టెరాల్స్‌ ఉంటాయి. ఇవి టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పుంజుకునేలా చేస్తాయి. మరోవైపు వీటిల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపరచటంతో పాటు వీర్యం నాణ్యతనూ పెంచుతాయి.
* జింక్‌ పదార్థాలు: బార్లీ, చిక్కుళ్లు, మాంసం వంటి జింక్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు వీర్య కణాల సంఖ్య వృద్ధి కావటానికి తోడ్పడతాయి. శరీరంలో జింక్‌ లోపిస్తే వీర్య కణాల కదలికలూ తగ్గుముఖం పడతాయి.
* దానిమ్మ: ఇది వీర్య కణాల సంఖ్య, వీర్యం నాణ్యతను వృద్ధి చేస్తుంది. దానిమ్మగింజల్లోని యాంటీఆక్సిడెంట్స్‌ కణాలను దెబ్బతీసే విశృంఖల కణాలను సమర్థంగా అడ్డుకుంటాయి.
* టమోటాలు: వీటిల్లో విటమిన్‌ సితో పాటు లైకోపేన్‌ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మగవారిలో సంతాన సామర్థ్యం ఇనుమడించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
* డార్క్‌ చాక్లెట్‌: ఎల్‌-ఆర్గినైన్‌ హెచ్‌సీఎల్‌ అనే అమైనో ఆమ్లం డార్క్‌ చాక్లెట్‌తో లభిస్తుంది. ఇది వీర్యం మోతాదు, వీర్యకణాల సంఖ్య పెరగటానికి తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు