ఆకలికి ఫోలిక్‌ యాసిడ్‌

ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను మహిళలకు.. ప్రత్యేకించి గర్భిణులకు సూచిస్తుండటం తెలిసిందే. ఇది పిండంలో అవకరాలు ఏర్పడకుండా కాపాడుతుంది మరి. పిండం తొలిదశలో న్యూరల్‌ ట్యూబ్‌ ఏర్పడుతుంది

Published : 29 Nov 2022 00:39 IST

ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను మహిళలకు.. ప్రత్యేకించి గర్భిణులకు సూచిస్తుండటం తెలిసిందే. ఇది పిండంలో అవకరాలు ఏర్పడకుండా కాపాడుతుంది మరి. పిండం తొలిదశలో న్యూరల్‌ ట్యూబ్‌ ఏర్పడుతుంది. దీన్నుంచే మెదడు, వెన్నుపాము పుట్టుకొస్తాయి. ఈ న్యూరల్‌ ట్యూబ్‌ ఏర్పడటానికి ఫోలిక్‌ యాసిడ్‌ తోడ్పడుతుంది. అందువల్ల మెదడు, వెన్ను లోపాల వంటి తీవ్ర అవకరాల నివారణకిది చాలా ముఖ్యం. నిజానికి ఫోలిక్‌ యాసిడ్‌ అనేది ఫోలేట్‌కు (విటమిన్‌ బి9) కృత్రిమ రూపం. మాత్రలు, సిరప్‌లలో ఉండేది ఇదే. బి విటమిన్లలో ఒకటైన ఇది కణాల వృద్ధికి, విభజనకూ సాయం చేస్తుంది. చర్మం, వెంట్రుకలు, గోళ్ల వంటి వాటిల్లో రోజూ కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి కదా. ఇవి సక్రమంగా వృద్ధి చెందటానికి ఫోలిక్‌ యాసిడ్‌ ఉపయోగపడుతుంది. అంతేకాదు.. విటమిన్‌ బి 12, విటమిన్‌ సితో కలిసి ప్రొటీన్లనూ విడగొడుతుంది, హిమోగ్లోబిన్‌ తయారీలోనూ పాలు పంచుకుంటుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం తయారయ్యేలా చేసి, ఆకలిని పెంచుతుంది కూడా. ఫోలిక్‌ యాసిడ్‌ కాలేయంలో నిల్వ ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లోని బ్యాక్టీరియా కూడా దీన్ని కొంతవరకు తయారుచేస్తుంది. ఇది లోపిస్తే ఎదుగుదల కుంటుపడుతుంది. వెంట్రుకలు తెల్లబడతాయి. నోరు, నాలుక పూయొచ్చు. విరేచనాలూ పట్టుకోవచ్చు. గర్భిణులకు, శిశువులకు దీని అవసరం మరింత ఎక్కువ. ఒత్తిడితో బాధపడేవారికీ అవసరమే. పాలకూర వంటి తాజా ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాల్లో.. మాంసాహారంలో కాలేయం, కిడ్నీల్లో ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని