కృత్రిమ కొవ్వు ముప్పు

బజ్జీలు, పకోడీ, సమోసాలు, కారప్పూస, బూందీ, మిక్చర్‌ వంటివి లొట్టలేస్తూ తింటూనే ఉంటాం. అయితే వీటిని వంట నూనెలో వేయించారా? వనస్పతి వంటి ట్రాన్స్‌ ఫ్యాట్స్‌లో వేయించారా? అని ఎప్పుడైనా ఆలోచించారా? మామూలుగానే వేపుళ్లు గుండెకు హాని చేస్తాయి.

Published : 08 Feb 2023 00:03 IST

బజ్జీలు, పకోడీ, సమోసాలు, కారప్పూస, బూందీ, మిక్చర్‌ వంటివి లొట్టలేస్తూ తింటూనే ఉంటాం. అయితే వీటిని వంట నూనెలో వేయించారా? వనస్పతి వంటి ట్రాన్స్‌ ఫ్యాట్స్‌లో వేయించారా? అని ఎప్పుడైనా ఆలోచించారా? మామూలుగానే వేపుళ్లు గుండెకు హాని చేస్తాయి. ట్రాన్స్‌ ఫ్యాట్స్‌తో తయారైనవైతే మరింత ఎక్కువ ప్రమాదం ముంచుకొచ్చినట్టే.


సహజంగానూ..

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ సహజంగానూ లభిస్తాయి. నెమరు వేసే జంతువుల పేగుల్లో.. ఇలాంటి జంతువుల పాలు, మాంసం ఉత్పత్తుల్లో కొద్ది మోతాదుల్లో  ఉంటాయి. అయితే కృత్రిమ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ మాదిరిగానే కొలెస్ట్రాల్‌ మోతాదుల మీద దుష్ప్రభావాలు చూపుతాయా? అనే దానిపై తగినన్ని ఆధారాలు లేవు.


చవకైనది కావటంతో

ట్రాన్స్‌ ఫ్యాట్‌ వాడకం తేలిక. పైగా చవక. ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. పదార్థాలకు మంచి రుచిని, రూపాన్ని ఇస్తుంది. పదే పదే వాడుకోవటానికి వీలుగా ఉండటం వల్ల బజ్జీల వంటి వేపుళ్లకు దీన్ని ఎక్కువగా ఉపయోగి స్తుంటారు.


5 లక్షల అకాల మరణాలు

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌తో తలెత్తే గుండెజబ్బుల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది అకాల మృత్యువుకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా నివేదిక పేర్కొంటోంది. ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ వాడకాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాలు మంచి ఫలితమే ఇస్తున్నాయని.. వీటి దుష్ప్రభావాల బారినపడకుండా 280 కోట్ల మందిని కాపాడుకోగలిగామని చెబుతూనే ఇంకా 500 కోట్ల మంది ట్రాన్స్‌ ఫ్యాట్‌ అనర్థాలకు గురవుతున్నారని వెల్లడించటం గమనార్హం. వీటి వినియోగాన్ని 2023 వరకు పూర్తిగా ఆపేయాలన్న లక్ష్యం ఇప్పుడప్పుడే నెరవేరేలా కనిపించటం లేదనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ వినియోగాన్ని నిర్మూలించటం చవకైన, మంచి ఆరోగ్య సంరక్షణ మార్గమనీ చెబుతోంది.


ట్రాన్స్‌ ఫ్యాట్‌ అంటే?

మనం తినే పదార్థాల్లోని ట్రాన్స్‌ ఫ్యాట్‌ చాలావరకు కృత్రిమంగా ఉదజనీకరణ ప్రక్రియతో తయారైందే. వంటనూనెలకు ఉదజనిని (హైడ్రోజన్‌) జత చేయటం దీనిలోని కీలకాంశం. నూనెలకు ఉదజనిని కలిపినప్పుడు వీటిల్లోని ద్రవం కొవ్వుగా మారుతుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ముద్దలా ఉంటుంది. వేడిచేస్తే కరిగి, నూనెల మారుతుంది. దీనికి ఉదాహరణ: వనస్పతి.


గుండెకు ఎంతో హాని

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఆరోగ్యానికి ఎలా హాని చేస్తాయన్నది 1990కి ముందు అంతగా తెలియదు. 90ల్లో మొదలైన పరిశోధనలతో వీటి అనర్థాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) మోతాదులను పెంచుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. మధుమేహం ముప్పూ పెరగొచ్చు.


ఎలా తగ్గించుకోవాలి?

* ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ను తగ్గించుకోవటం.. అలాగే మొత్తం కేలరీల్లో సంతృప్త (సాచ్యురేటెడ్‌) కొవ్వులను 5 నుంచి 6 శాతానికి పరిమితం చేసుకోవటం ద్వారా చెడ్డ కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరగకుండా చూసుకోవచ్చన్నది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సిఫారసు. ఇందుకోసం.

* పొట్టు తీయని ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వెన్న తీసిన పాల పదార్థాలు, గింజపప్పులతో కూడిన ఆహార పద్ధతి పాటించాలి. చక్కెర తీపి పదార్థాలు, పానీయాలు పరిమితం చేసుకోవాలి. మాంసాహారులైతే మాంసం తగ్గించుకోవాలి.

* పొద్దు తిరుగుడు నూనె వంటి సహజ వంట నూనెలను వాడుకోవాలి.

* ప్యాకేజీ ఫుడ్స్‌ను కొనేటప్పుడు వాటిని మామూలు నూనెలతోనా? పాక్షికంగా ఉదజనీకరించిన లేదా ఉదజనీకరించిన నూనెలతోనా? సంతృప్త కొవ్వుతోనా? వేటితో తయారు చేశారో చూసుకోవాలి.

* బిస్కట్లు, కేక్‌లు, పాస్ట్రీలు, మఫిన్స్‌, పిజ్జా బేస్‌ వంటి అన్ని బేకరీ పదార్థాల్లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. వీటిని పరిమితం చేసుకోవాలి. మార్కెట్లలో అమ్మే వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని చాలావరకు ట్రాన్స్‌ ఫ్యాట్స్‌లోనే వేయిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని