పొగ మానటంఎప్పుడైనా మంచిదే!

‘ఎప్పట్నుంచో సిగరెట్లు కాలుస్తున్నాం. ఇప్పుడు మానేస్తే ఎంత? మానెయ్యకపోతే ఎంత? ఏం ఒరుగుతుంది?’...

Published : 11 Feb 2020 00:45 IST

‘ఎప్పట్నుంచో సిగరెట్లు కాలుస్తున్నాం. ఇప్పుడు మానేస్తే ఎంత? మానెయ్యకపోతే ఎంత? ఏం ఒరుగుతుంది?’- చాలాకాలంగా పొగ అలవాటు గలవారు ఇలానే భావిస్తుంటారు. వృద్ధాప్యంలోకి చేరుకున్నా సరే. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం మానేస్తే దాని ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. దీర్ఘకాలంగా పొగ అలవాటు గలవారు మానేసినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బంది ఉండొచ్ఛు ముఖ్యంగా దగ్గు ఎక్కువ కావొచ్ఛు మన శ్వాసమార్గంలో సూక్ష్మ కేశాలు (సీలియా) ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిములు, దుమ్ము ధూళి వంటివి లోపట్నుంచి పైకి వచ్చేలా, బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి. సూక్ష్మకేశాల చుట్టూరా పరచుకునే గోబ్లెట్‌ కణాలు జిగురు ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది గాలిగొట్టాల గోడలను కాపాడుతుంది. సూక్ష్మక్రిములను పట్టేసుకొని లోనికి వెళ్లకుండా చేస్తుంది. పొగ అలవాటు గలవారిలో సూక్ష్మకేశాల పనితీరు మందగిస్తుంది. పొగ మానేసినప్పుడు ఇవి చురుకుదనం సంతరించుకోవటం వల్ల మొదట్లో జిగురు ద్రవం ఉత్పత్తి పెరిగి దగ్గు కాస్త ఎక్కువ కావొచ్ఛు కొద్దినెలల్లో ఇదంతా సర్దుకుంటుంది. శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. ఊపిరితిత్తుల్లో వాపు తలెత్తే ముప్పు తగ్గుతుంది. జలుబు బారినపడటం తగ్గుతుంది. ఒకవేళ జలుబు అంటుకున్నా త్వరగా నయం కావొచ్ఛు అన్నింటికీ మించి వాసనలు పసిగట్టటం మెరుగవుతుంది. దీంతో పోషణలోపం ముప్పూ తగ్గుతుంది. మరి వాసన, రుచి సరిగా లేకపోతే ఏదీ తినబుద్ది కాదు కదా. పొగ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నవారితో పోలిస్తే- 40 ఏళ్ల వయసులో పొగ మానేసినవారికి పొగ మూలంగా సంభవించే ముప్పులు 90% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటం గమనార్హం. ఆయుష్షు 9 ఏళ్ల వరకు పెరగటం విశేషం. అదే 50 ఏళ్ల వయసులో పొగ మానేస్తే ఆరేళ్లు, 60 ఏళ్ల వయసులో మానేస్తే నాలుగేళ్ల ఆయుర్దాయం పెరుగుతున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు.. పొగ మానేసిన కొన్నివారాల్లోనే పక్షవాతం, గుండెపోటు ముప్పులతో పాటు ఆస్థమా, దీర్ఘకాల బ్రాంకైటిస్‌ లక్షణాలూ తగ్గుముఖం పడతాయి. కాబట్టి పొగ మానెయ్యటం ఎప్పుడైనా మంచిదేనని గుర్తుంచుకోవాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని