వినికిడి మీదా కరోనా

కరోనా జబ్బు అనర్థాలకు లెక్కలేకుండా పోతోంది. రోజురోజుకీ కొత్త విషయాలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇది గుండె, రక్తనాళాలనే కాదు.. చెవులను సైతం వదిలి పెట్టటం లేదని యూనివర్సిటీ

Published : 04 Aug 2020 01:25 IST

కరోనా జబ్బు అనర్థాలకు లెక్కలేకుండా పోతోంది. రోజురోజుకీ కొత్త విషయాలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇది గుండె, రక్తనాళాలనే కాదు.. చెవులను సైతం వదిలి పెట్టటం లేదని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ అధ్యయనం పేర్కొంటోంది. కరోనా బారినపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన 8 వారాల తర్వాత కొందరిని పరిశీలించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వీరిలో చాలామంది వినికిడి లోపం, చెవిలో రింగుమనే మోత (టినిటస్‌) సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పటం గమనార్హం. తట్టు, గవదబిళ్లలు, మెదడు పొరల వాపు వంటి సమస్యలకు దారితీసే వైరస్‌లు వినికిడిని దెబ్బతీస్తాయన్నది తెలిసిందే. సార్స్‌-కొవ్‌2 కూడా దీనికి మినహాయింపేమీ కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది శ్రవణ నాడినీ దెబ్బతీయగలదని వివరిస్తున్నారు. మధ్యచెవిలోని కాక్లియా నుంచి శ్రవణ నాడి ద్వారా మెదడుకు శబ్దాలు చేరుకుంటాయి. అప్పుడే మనకు ఆయా మాటలు, చప్పుళ్లు వినిపిస్తాయి. శ్రవణ నాడి సరిగా పనిచేయకపోతే వినికిడీ దెబ్బతింటుంది (ఆడిటరీ న్యూరోపతి). ఇలాంటివారికి కాక్లియా బాగానే పనిచేస్తుంటుంది గానీ అక్కడ్నుంచి శబ్దాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరుకోవటం అస్తవ్యస్తమవుతాయి. దీని బారినపడ్డవారికి రణగొణధ్వనుల మధ్య చెవులు సరిగా వినిపించవు. కొవిడ్‌ బాధితుల్లో జరుగుతోంది ఇదే. కరోనా కారక వైరస్‌తో గిలియన్‌ బారీ సిండ్రోమ్‌ సైతం తలెత్తుతున్నట్టు ఇప్పటికే బయటపడింది. ఇదీ ఆడిటరీ న్యూరోపతికి దారితీసేదే. కరోనా జబ్బు కన్నా దాని దుష్ప్రభావాలే ఎక్కువగా కలవర పెడుతున్నాయనటానికి ఇదో మచ్చుతునక. కరోనా వస్తుంది, పోతుందని తేలికగా తీసుకోకుండా అసలు రాకుండా చూసుకోవటమే ముఖ్యమని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని