చేతులు ఒరుసుకుపోతున్నాయేం?

నా వయసు 23 సంవత్సరాలు. మూడు వారాల నుంచి నీరు తగిలిన నిమిషానికే చేతులు బాగా ఒరుసుకుపోతున్నాయి. చర్మం ముడతు పడినట్టు అవుతోంది. ఇంట్లో వంట పనులకు సాయం చేయలేకపోతున్నాను. ఇదేమైనా జబ్బా? దీనికి పరిష్కారం చెప్పగలరు...

Published : 22 Sep 2020 01:22 IST

సమస్య సలహా

సమస్య: నా వయసు 23 సంవత్సరాలు. మూడు వారాల నుంచి నీరు తగిలిన నిమిషానికే చేతులు బాగా ఒరుసుకుపోతున్నాయి. చర్మం ముడతు పడినట్టు అవుతోంది. ఇంట్లో వంట పనులకు సాయం చేయలేకపోతున్నాను. ఇదేమైనా జబ్బా? దీనికి పరిష్కారం చెప్పగలరు.

- పావని (ఈ మెయిల్‌)

సలహా: ఎక్కువసేపు స్నానం చేసినప్పుడు, ఈత కొట్టినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు అరచేతి మీద ముడతలు పడినట్టు కనిపించటం మామూలే. ఇలాంటి సమయాల్లో నాడీ వ్యవస్థ రక్తనాళాలు సంకోచించేలా సంకేతాలు పంపిస్తుంది. దీంతో వేళ్లకు రక్త సరఫరా తగ్గి, చర్మం ముడతలు పడినట్టు అనిపిస్తుంది. కొందరికి రోజువారీ పనుల మూలంగా అరచేతుల్లో చర్మం మందంగా తయారవుతుంది. ఇలాంటివారిలో నీటిలో తడవగానే చర్మం ఉబ్బి, త్వరగా ముడతలు పడతాయి. మీరు ఒక్క నిమిషానికే చర్మం ముడతలు పడుతోందని అంటున్నారు. సాధారణంగా తక్కువ సమయంలోనే ఇలా జరగటమనేది ఉండదు. ఒకవేళ ముడతలు పడినా ఇదేమీ జబ్బు కాదు. మీరు నొప్పి, దురద, మంట వంటి లక్షణాలేవైనా ఉన్నాయేమో తెలియజేయలేదు. ఇలాంటి ఇబ్బందులేవీ లేకపోతే భయపడాల్సిన పనేమీ లేదు. ముడతలు పడినంత మాత్రాన ఏమీ కాదు. కావాలంటే చేతులకు గ్లవుజులు వేసుకోండి. నొప్పి, దురద లాంటివేవైనా ఉంటే చర్మ నిపుణుడిని సంప్రదించండి. తగు పరీక్షలు చేసి పరిష్కారం సూచిస్తారు.


ఇంతలోనే మరుపేల?

సమస్య: ఇటీవల నాకు చదివింది సరిగా గుర్తుండటం లేదు. ఏదైనా చదివితే రెండు రోజుల్లోనే మరచిపోతున్నాను. ఇలా చాలాసార్లు జరుగుతోంది. దీంతో మున్ముందు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా? జ్ఞాపకశక్తి పెరగటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- యంబ శ్రీహర్ష (ఈ మెయిల్‌)

సలహా: మీరు వయసెంతో తెలియజేలేదు. చదువుల గురించి అడుగుతున్నారంటే విద్యార్థేనని అనిపిస్తోంది. చిన్న వయసులో ఇలా మరచిపోవటం పెద్ద సమస్యేమీ కాదు. అప్పుడప్పుడు మరచిపోవటమనేది సహజమే. మనలో చాలామంది తరచూ మరచిపోతూనే ఉంటారు. మీరు చదివింది సరిగా గుర్తుండటం లేదు, రెండు రోజుల్లోనే మరచిపోతున్నాని అంటున్నారు. అంటే మరచిపోతున్నాననే సంగతిని మీరు గుర్తించగలుగుతున్నారన్నమాట. దీని గురించి పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. మరచిపోతున్నామనే విషయాన్ని తమకు తాము గుర్తించగలగటమనేది పెద్ద సమస్యేమీ కాదు. ఆయా విషయాలు కొంతసేపటి తర్వాత తిరిగి గుర్తుకొస్తాయి. మరచిపోతున్న సంగతిని తాము గుర్తించలేకపోతుంటే, ఇతరులు దాన్ని గమనించి చెబుతున్నట్టయితే మాత్రం తీవ్ర మతిమరుపు సమస్యగా (డిమెన్షియా) భావించాల్సి ఉంటుంది. ఇందులో క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. ఇది పెద్ద వయసులో వచ్చే సమస్య. మీది చిన్న వయసే కాబట్టి మామూలు మతిమరుపుగానే భావించొచ్ఛు ఇక చదివింది గుర్తుండటం లేదంటే ఏకాగ్రత కొరవడుతోందని అర్థం. చదువుల మీద దృష్టి పెట్టకపోతే, ఏదో ఆలోచిస్తూ చదివితే బుర్రకు ఎక్కదు, గుర్తుండదు. కాబట్టి ముందుగా చదివేటప్పుడు మనసు పెట్టి చదవండి. పుస్తకం ముందేసుకునేప్పుడు మీ లక్ష్యాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే ఏకాగ్రతతో చదవటానికి అవకాశముంటుంది. ధ్యాస మళ్లకుండా సెల్‌ఫోన్ల వంటివి కట్టేయాలి. చదివిన పాఠాలను తిరిగి మననం చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారేమో చూసుకోండి. ఇదీ మరచిపోవటానికి దారితీయొచ్ఛు ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. జ్ఞాపకశక్తి పెరగటానికి ప్రత్యేకించి ఆహారమంటూ ఏదీ లేదు. సమతులాహారం తీసుకోవటం ముఖ్యం. కొవ్వులు తగ్గించుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. ప్రొటీన్‌ తగినంత తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా మంచి ఆహార అలవాట్లు, జీవనశైలిని పాటించటం ద్వారా మెదడు చురుకుగా ఉండేలా చూసుకోవచ్ఛు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని