గొంతులోకి ద్రవాలు ఎగదన్నుకొస్తున్నాయి..

చాలాకాలంగా ద్రవ పదార్థాలు గొంతులోకి పైకి ఎగదన్నుకొని వస్తున్నాయంటే కారణమేంటన్నది నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం జీర్ణాశయంలోని ఆమ్లం

Published : 06 Oct 2020 00:54 IST

సమస్య-సలహా

సలహా: చాలాకాలంగా ద్రవ పదార్థాలు గొంతులోకి పైకి ఎగదన్నుకొని వస్తున్నాయంటే కారణమేంటన్నది నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని రావటం (గ్యాస్టోఈసోఫేగల్‌ రిఫ్లక్స్‌). దీన్ని ఛాతీలో మంట (అసిడిటీ) అనీ అంటుంటారు. ఇది ప్రమాదకరమైందేమీ కాదు. ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే ఒమిప్రొజోల్‌ వంటి పీపీఐ రకం మందులు, యాంటాసిడ్లు వాడుకుంటే తగ్గిపోతుంది. అలాగే కారం, మసాలా పదార్థాలకు దూరంగా ఉండటం.. అధిక బరువుంటే తగ్గించుకోవటం.. పొగ, మద్యం అలవాట్లుంటే మానెయ్యటం.. భోజనం చేసిన వెంటనే పడుకోకపోవటం వంటి జాగ్రత్తలూ తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంటుంది. అరుదుగా అకలేసియా కార్డియా, క్యాన్సర్‌ వంటివీ దీనికి కారణం కావొచ్ఛు మీరు రెండేళ్ల నుంచి రిఫ్లక్స్‌తో బాధపడుతున్నానని తెలిపారు. అప్పట్నుంచి మరీ తీవ్రం కాలేదంటే క్యాన్సర్‌ కాకపోవచ్చనే అనిపిస్తోంది. అకలేసియా కార్డియా అయితే తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మావలుగా మనం ఏదైనా మింగినప్పుడు అన్నవాహిక కింది కండర వలయం (స్ఫింక్టర్‌) వదులై, తెరచుకుంటుంది. దీంతో ఆయా పదార్థాలు జీర్ణాశయంలోకి వెళ్లిపోతాయి. అకలేసియా కార్డియాలో కండర వలయం సరిగా తెరచుకోదు. దీంతో ద్రవాలు, ఆహార పదార్థాలు వెనక్కి వచ్చేస్తుంటాయి. కండర వలయానికి సమాచారాన్ని చేరవేసే నాడులు దెబ్బతినటం దీనికి కారణం. దీర్ఘకాలంగా జీర్ణాశయంలో ఆమ్లం ఉత్పత్తి ఎక్కువగా అవటం (అసిడిటీ) వలంగానూ అన్నవాహిక కింది భాగం సన్నబడిపోవచ్చు (స్ట్రిక్చర్‌). ఇదీ ద్రవాలు పైకి వచ్చేలా చేయొచ్ఛు అందువల్ల ముందు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, సమస్య ఏంటన్నది నిర్ధారణ చేసుకోవటం ముఖ్యం. పీపీఐ రకం మందులు, యాంటాసిడ్లతో సమస్య తగ్గకపోతే ఎండోస్కోపీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో కండర వలయం వసుకుపోవటం, అన్నవాహిక సన్నబడటం వంటి మార్పులేవైనా ఉంటే బయటపడతాయి. ఎండోస్కోపీ ఫలితాలు నార్మల్‌గా ఉంటే బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అకలేషియా కార్డియా మావలు స్థాయిలో ఉంటే ఎండోస్కోపీలో తెలియదు. ఇది బేరియం ఎక్స్‌రేలోనే బయటపడుతుంది. కండర వలయం వసుకుపోతే ఎండోస్కోపీ ద్వారా బెలూన్‌ను పంపించి వదులు చేయొచ్చు (ఎండోస్కోపిక్‌ డైలటేషన్‌). పెరోరల్‌ ఎండోస్కోపిక్‌ మయాటమీ (పోయెమ్‌), ల్యాప్రోస్కోపిక్‌ హెల్లెర్‌ మయాటమీ పద్ధతులతోనూ సరిచేయొచ్ఛు మీకు ఎలాంటి పద్ధతి సరిపోతుందనే దాన్ని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు.

సమస్య: నాకు 69 ఏళ్లు. నేను రెండేళ్లుగా రిఫ్లక్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. ద్రవ పదార్థాలు గొంతులోకి పైకి ఎగదన్నుకొని వస్తున్నాయి. దీనికి కారణమేంటి? చికిత్స ఏంటి?

- ఎండి. షర్ఫుద్దీన్‌, హన్మకొండ, వరంగల్‌

సమస్యలు పంపాల్సిన చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512. email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని