రెండు నెలలుగా జలుబు?

వయసు 28 సంవత్సరాలు. గత రెండు నెలల నుంచి జలుబు తగ్గటం లేదు. నాకు ఎప్పుడైనా జలుబు చేస్తే దానంతటదే ఐదారు రోజుల్లో తగ్గిపోయేది. ఈసారి తగ్గలేదు. దీంతో సిట్రిజిన్‌ మాత్రలు వేసుకుంటున్నాను.  ఇవి వేసుకున్నప్పుడు జలుబు తగ్గుతుంది. ఆపేస్తే మళ్లీ వస్తోంది

Published : 17 Nov 2020 00:58 IST

సమస్య-సలహా

సమస్య: నా వయసు 28 సంవత్సరాలు. గత రెండు నెలల నుంచి జలుబు తగ్గటం లేదు. నాకు ఎప్పుడైనా జలుబు చేస్తే దానంతటదే ఐదారు రోజుల్లో తగ్గిపోయేది. ఈసారి తగ్గలేదు. దీంతో సిట్రిజిన్‌ మాత్రలు వేసుకుంటున్నాను.  ఇవి వేసుకున్నప్పుడు జలుబు తగ్గుతుంది. ఆపేస్తే మళ్లీ వస్తోంది. తరచూ తుమ్ములతో బాధపడుతున్నాను. పరిష్కార మార్గమేంటి?

- ఎం.పార్థసారథి

సలహా: మామూలు జలుబు వారం రోజుల్లోనే తగ్గిపోతుంది. మీరు రెండు నెలల నుంచీ బాధపడుతున్నారంటే ఇతరత్రా కారణాలను పరిశీలించాల్సి ఉంటుంది. సిట్రిజిన్‌ ఆపేస్తే మళ్లీ జలుబు మొదలవుతోందని అంటున్నారంటే చాలావరకు అలర్జీ కావొచ్చనే అనిపిస్తోంది. దీన్నే అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. గాలిలోని దుమ్ము ధూళి, పుప్పొడి వంటి అలర్జీ కారకాలకు రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం దీనికి కారణం. దీంతో ముక్కు కణజాలం ఉబ్బిపోతుంది. ఫలితంగా ముక్కు దిబ్బడ, దురద, తుమ్ముల వంటివి ఇబ్బంది పెడతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సుమారు 80% మందిలో ఆస్థమాకు దారితీసే ప్రమాదముంది. ముక్కు దూలం పక్కకు జరిగి ఉండటం, ముక్కులో బుడిపెలు (పాలిప్స్‌) వంటి సమస్యలతోనూ తరచూ జలుబు చేయొచ్చు. కాబట్టి మీరు ముందుగా ముక్కు, చెవి, గొంతు (ఈఎన్‌టీ) డాక్టర్‌ను సంప్రదించండి. ముక్కు తీరుతెన్నులను పరిశీలించి, అవసరమైతే ఎక్స్‌రే తీసి చూస్తారు. ఇందులో ముక్కు లోపలి భాగాలు, ముక్కు చుట్టుపక్కల గాలి గదులు ఎలా ఉన్నాయన్నది తెలుస్తుంది. ముక్కులో ఎలాంటి సమస్యలూ లేకపోతే శ్వాసకోశ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. కేవలం ముక్కు అలర్జీయేనా? ఆస్థమా ఏవైనా ఉందా? అనేది పరీక్షిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ఆయాసం, పొడిదగ్గు, ఛాతీ బరువుగా ఉండటం వంటి ఆస్థమా లక్షణాలు మొదట్లో కనిపించవు. లోపల సమస్య ఉన్నా బయటపడకపోవచ్చు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే స్పైరోమెట్రీ వంటి పరీక్షలతో దీన్ని ముందుగానే గుర్తిస్తే తగు చికిత్స ఆరంభించొచ్చు. సమస్య ముదరకుండా చూసుకోవచ్చు. అలర్జీ  అయినట్టయితే దేని మూలంగా ప్రేరేపితమవుతుందో పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అలర్జీ కారకాలను గురిస్తే వాటికి విరుగుడు మందులూ ఇవ్వచ్చు. మీరు వేసుకుంటున్న సిట్రిజిన్‌ మాత్రలతో నిద్ర మత్తు వస్తుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇప్పుడు నిద్ర మత్తు కలిగించని మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మీరు భయపడాల్సిన పనిలేదు. అలాగని నిర్లక్ష్యం చేయటమూ తగదు. సొంతంగా మందులు కొనుక్కొని వేసుకోవటం కన్నా నిపుణులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవటం మంచిది.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని