మృదులాస్థి మరమ్మతుకు కొత్త హైడ్రోజెల్‌

మన శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ముందే రకరకాల ఏర్పాట్లు చేసుకొని పెట్టుకుంటుంది.

Updated : 03 Aug 2021 01:32 IST

న శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ముందే రకరకాల ఏర్పాట్లు చేసుకొని పెట్టుకుంటుంది. మృదులాస్థి (కార్టిలేజ్‌) అలాంటి సహజమైన, అద్భుతమైన ఏర్పాటే. ఇది కీళ్లు ఒకదాంతో మరోటి రాసుకుపోకుండా, ఎముక త్వరగా అరిగిపోకుండా కాపాడుతుంది. గట్టి రబ్బరులాంటి మృదులాస్థి షాక్‌ అబ్జార్బర్‌ మాదిరిగా పనిచేస్తూ కీళ్ల మీద ఒత్తిడి పడకుండా చూస్తుంది. కీళ్ల మీద భారం సమానంగా పడేలానూ చేస్తుంది. ఎంత గట్టిగా, మృదువుగా ఉన్నప్పటికీ గాయాలు, హార్మోన్ల సమస్యల వంటివి దీన్ని దెబ్బతీయొచ్చు. ఒకవేళ దెబ్బతింటే త్వరగా కుదురుకోకుండా చేయొచ్చు. అందుకే దెబ్బతిన్న మృదులాస్థిని మరమ్మతు చేయటానికి పరిశోధకులు హైడ్రోజెల్స్‌ (పాలిమర్స్‌) మీద దృష్టి సారించారు. కాకపోతే పాలీఅక్రిలమైడ్‌(పీఏఎం)తో తయారుచేసే ఈ హైడ్రోజెల్స్‌ అంత బలంగా ఉండవు. త్వరగా రంధ్రాలు పడుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించటానికే బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు వినూత్నంగా ఆలోచించారు. పీఏఎంకు కార్బన్‌ నానోట్యూబులు, టైటానియం డయాక్సైడ్‌ను జోడించి కొత్తరకం హైడ్రోజెల్‌ను రూపొందించారు. ఇది మరింత బలంగా, సహజ కణజాలానికి సరిపోయేలా ఉండటమే కాదు.. తనకు తానుగా మృదులాస్థిని మరమ్మతు చేస్తుండటం విశేషం. కార్బన్‌ నానోట్యూబులు, టైటానియం డయాక్సైడ్‌ను జోడించటం వల్ల నీటిని గ్రహించుకోవటానికి, ఉబ్బటానికి వీలవుతుంది. జీవవైద్య అవసరాలకు ఇలాంటి గుణం చాలా అవసరం. ఒత్తిడికి గురిచేసినా, సూదులతో గుచ్చినా ఇది ఏమాత్రం దెబ్బతినకపోవటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని