పళ్లకు బ్రేసెస్‌ వేయించుకోవచ్చా?

సమస్య: నా వయసు 29. నాకు ఎత్తు పళ్లున్నాయి. ఇప్పుడు నేను బ్రేసెస్‌ వేయించుకుంటే ఫలితం ఉంటుందా? అలాగే నేను నోరు బాగా తెరిస్తే టిక్‌ టిక్‌మని చప్పుడు వస్తుంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

Updated : 17 Aug 2021 05:01 IST

సమస్య సలహా

సమస్య: నా వయసు 29. నాకు ఎత్తు పళ్లున్నాయి. ఇప్పుడు నేను బ్రేసెస్‌ వేయించుకుంటే ఫలితం ఉంటుందా? అలాగే నేను నోరు బాగా తెరిస్తే టిక్‌ టిక్‌మని చప్పుడు వస్తుంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

- రాజు, హైదరాబాద్‌

సలహా: ఎత్తు పళ్లు సరిచేయటానికి బ్రేసెస్‌ బాగా ఉపయోగపడతాయి. ఇవి పళ్లను అదిమి పడుతూ అమరికను సరిచేస్తాయి. వీటిని అమర్చుకోవటానికి వయసుతో నిమిత్తం లేదు. దవడ ఎముక, చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇవి ఆరోగ్యంగా ఉంటే బ్రేసెస్‌ అమర్చుకోవచ్చు. ఎక్స్‌రే ద్వారా ఎముక, చిగుళ్లు ఎలా ఉన్నాయన్నది బయటపడుతుంది. ఒక్క బ్రేసెసే కాదు.. దవడ శస్త్రచికిత్స(ఆర్థోగ్నాథిక్‌ సర్జరీ)తోనూ ఎత్తు పళ్లను సవరించుకోవచ్చు. ఇందులో దవడ ఎముకను కత్తిరించి, దంతాల అమరికను సరిచేస్తారు. ఇక నోరు బాగా తెరిస్తే టిక్‌ టిక్‌మనే చప్పుడు రావటానికి కారణం చెవికి దగ్గరగా ఉండే టెంపరో మాండిబ్యులార్‌ జాయింట్‌ (టీఎంజే) పనితీరు అస్తవ్యస్తం కావటం. సాధారణంగా ఇది పెద్ద వయసులో వస్తుంటుంది. మోకాలు, మోచేయి కీళ్లు అరిగినట్టుగానే టీఎంజే కూడా అరుగుతుంటుంది. దీంతో కీలు కదిలినప్పుడల్లా టిక్‌ టిక్‌మని చప్పుడు వస్తుంటుంది. మొదట్లో చప్పుడు మాత్రమే వస్తుంది. క్రమంగా దవడ తెరచుకొని అలాగే ఉండిపోతుంది. చేత్తో దవడను అటూఇటూ కదిలిస్తే తిరిగి మూసుకుంటుంది (సబ్‌లగ్జేషన్‌). కొన్నిసార్లు కీలు జారిపోవచ్చు (డిస్‌లొకేషన్‌). దీంతో దవడను కదిలించినా మూసుకోకుండా అలాగే ఉండిపోతుంది. దీన్ని సర్జరీ చేసి సవరించాల్సి ఉంటుంది. అయితే మీది చిన్న వయసే. ఇలా చిన్న వయసులోనే టిక్‌ టిక్‌ మనే చప్పుడు రావటానికి చాలావరకు ఒత్తిడే కారణమని అనిపిస్తోంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఒత్తిడికి గురయ్యేవారిలో దీన్ని చూస్తుంటాం. అందువల్ల ముందుగా మీరు ఏవైనా పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారా? అతిగా ఆలోచిస్తున్నారా? కుంగుబాటుకు లోనవుతున్నారా? అనేవి చూసుకోవటం మంచిది. ఒత్తిడి, ఆందోళన కారణమవుతుంటే తగ్గించుకోవాలి. దీంతో చప్పుళ్లూ ఆగిపోతాయి. పళ్ల అమరిక సరిగా లేకపోయినా నమిలేటప్పుడు టీఎంజే మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇదీ చప్పుడు వచ్చేలా చేయొచ్చు. బ్రేసెస్‌తో పళ్ల అమరికను సరిచేసుకుంటే చప్పుడూ తగ్గుతుంది. మీకు ఎత్తు పళ్లు ఉన్నాయి కాబట్టి ఇవేమైనా కారణమవుతున్నాయేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఏదైనా సమస్య ఉందేమో పరిశీలించి, తగు చికిత్స సూచిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని