ఇదేం వేడి?

నాకు 35 ఏళ్లు. ఇటీవల కొవిడ్‌ వచ్చి, తగ్గింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. ఆక్సిజన్‌ కూడా పెట్టారు. ఇప్పుడు బాగానే ఉంది గానీ అప్పుడప్పుడు ఒళ్లు వేడిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా పని చేసినప్పుడు వేడి ఎక్కువగా ఉంటోంది. భయంగా అనిపిస్తోంది. దీనికి కారణమేంటి?

Updated : 12 Oct 2021 01:01 IST

సమస్య: నాకు 35 ఏళ్లు. ఇటీవల కొవిడ్‌ వచ్చి, తగ్గింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. ఆక్సిజన్‌ కూడా పెట్టారు. ఇప్పుడు బాగానే ఉంది గానీ అప్పుడప్పుడు ఒళ్లు వేడిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా పని చేసినప్పుడు వేడి ఎక్కువగా ఉంటోంది. భయంగా అనిపిస్తోంది. దీనికి కారణమేంటి?

- వాణి, హైదరాబాద్‌

సలహా: మీరు ఒళ్లు వేడిగా ఉంటోందని అంటున్నారు గానీ ఉష్ణోగ్రత ఎంత ఉందనేది తెలియజేయ లేదు. ఒళ్లు వేడిగా అనిపించటం వేరు. ఉష్ణోగ్రత పెరగటం వేరని తెలుసుకోవాలి. అందువల్ల జ్వరం ఉందో లేదో థర్మామీటర్‌తో చూసి తెలుసుకోవాలి. జ్వరం లేకపోయినట్టయితే పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కొవిడ్‌ అనంతరం అప్పుడప్పుడు జ్వరం వచ్చినట్టు అనిపించటం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒక విధమైన నీరసం, నిస్సత్తువ వంటివి చాలామందిలో చూస్తున్నాం. ఇవి మూడు నుంచి ఆరు నెలల వరకు కొనసాగొచ్చు. ఏదైనా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకుంటున్న దశలో ఎక్కువ శ్రమ పడితే ఒళ్లు వేడిగా అనిపించటం మామూలే. కొవిడ్‌లో ఇది ఇంకాస్త ఎక్కువగానూ కనిపిస్తోంది. మీరు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారంటే ఇన్‌ఫెక్షన్‌ కాస్త తీవ్రంగానే వచ్చి ఉండాలి. తీవ్ర కొవిడ్‌లో రక్తనాళాల్లో రక్తం గడ్డలూ తలెత్తుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే ఎక్కువ శారీరక శ్రమ చేయటం మంచిది కాదు. మీరు కొద్దిరోజుల వరకు ఎక్కువ అలసటకు గురిచేసే పనులకు దూరంగా ఉండండి. నెమ్మదిగా పనులు పెంచుకుంటూ రావాలి. జ్వరం, ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. కంటి నిండా నిద్ర పోవాలి. కొద్దిరోజుల్లో అంతా సర్దుకుంటుంది. భయం అవసరం లేదు. ఒకవేళ జ్వరం ఉన్నట్టయితే ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించాల్సి ఉంటుంది. కొందరికి కొవిడ్‌ అనంతరం థైరాయిడ్‌ సమస్యల వంటివీ మొదలవుతున్నాయి. ఇవీ ఒళ్లు వేడిగా, జ్వరం వచ్చినట్టుగా అనిపించేలా చేయొచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. అవసరమైతే తగు పరీక్షలు చేసి పరిష్కారం సూచిస్తారు.

- డా।। ఎం.వి.రావు, జనరల్‌ ఫిజీషియన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని