అనవసర విషయాలు మరవాలంటే?

సమస్య: నాకు 27 ఏళ్లు. నాకు తరచూ అనవసర విషయాలు గుర్తుకొస్తుంటాయి. దీంతో కుంగిపోతుంటాను. నిద్ర పట్టదు. దీనికి పరిష్కారమేంటి? అనవసర విషయాలు గుర్తుకురాకుండా, ప్రశాంతంగా ఉండటానికి ఏం చెయ్యాలి?

Updated : 02 Nov 2021 06:28 IST

సమస్య సలహా

సమస్య: నాకు 27 ఏళ్లు. నాకు తరచూ అనవసర విషయాలు గుర్తుకొస్తుంటాయి. దీంతో కుంగిపోతుంటాను. నిద్ర పట్టదు. దీనికి పరిష్కారమేంటి? అనవసర విషయాలు గుర్తుకురాకుండా, ప్రశాంతంగా ఉండటానికి ఏం చెయ్యాలి?

- పి.బుజ్జి (ఈమెయిల్‌)

సలహా: తరచూ అనవసర విషయాలు, గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు గుర్తుకురావటం.. నిద్ర పట్టకపోవటం, మానసిక ప్రశాంతత లేకపోవటం.. ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారంటే మీరు ముందుగా కుంగుబాటుతో (డిప్రెషన్‌) బాధపడుతున్నారేమో చూసుకోవాలి. దీని బారినపడ్డవారిలో శారీరక, మానసిక సామర్థ్యాలు రెండూ తగ్గుముఖం పడతాయి. దీంతో మనసు ఎక్కువగా ప్రతికూల అంశాల మీదే దృష్టి సారిస్తుంది. చుట్టుపక్కల మంచి విషయాలు జరుగుతున్నా పట్టవు. జీవితంలో సాధించిన విజయాలు.. ఇంట్లో వాళ్లు, ఆత్మీయులు తమ మీద చూపించే ప్రేమ వంటి వాటినీ పట్టించుకోరు. మనసు, ఆలోచనలు అన్నీ ప్రతికూల అంశాల వైపే మళ్లుతాయి. ఇవి పదే పదే గుర్తుకొస్తుంటాయి. కుంగుబాటుతో బాధపడేవారిలో స్తబ్ధత, దిగులు, నిరాశ, నిస్పహలు, చిన్న విషయాలకే తమను తాము నిందించుకోవటం, ఆత్మవిశ్వాసం కొరవడటం, పనుల మీద ఆసక్తి లేకపోవటం, వస్తువులను ఎక్కడో పెట్టి పదే పదే వెతుక్కోవటం వంటి లక్షణాలూ పొడసూపుతుంటాయి. దీనికి కారణం మనసంతా ప్రతికూల అంశాలతో ముడిపడిన ఆలోచనలతో నిండిపోవటం. బయటి ప్రపంచంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోకపోవటం. కాబట్టి మీరు మానసిక నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు కుంగుబాటు తగ్గటానికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మందులతో పాటు కౌన్సెలింగ్‌ కూడా అవసరమే. గతం గతః. అది వెనక్కి తిరిగిరాదు. దాన్ని మనసులో అలాగే పెట్టుకుంటే గతాన్ని ఇంకా మోస్తున్నట్టే. ఎప్పుడో ఎదురైన చేదు అనుభవాలను మరవకుండా ఇంకా తలచుకుంటూ ఉన్నట్టయితే వాటికి తిరిగి ప్రాణం పోసినట్టు అవుతుంది. ఇలా వాస్తవాన్ని గ్రహించేలా, ఆలోచనా విధానాన్ని మార్చుకునేలా కౌన్సెలింగ్‌లో శిక్షణ ఇస్తారు. దీంతో ఏది అవసరం? ఏది కాదు? అని గ్రహించటానికి మార్గం సుగమమవుతుంది. మీ బలాన్ని మీరు తెలుసుకోవటానికి వీలవుతుంది. మందులు, కౌన్సెలింగ్‌తో పాటు వ్యాయామం, యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులూ ఉపయోగపడతాయి. వీటిని జీవనశైలిలో భాగం చేసుకోవటం మంచిది. పుస్తక పఠనం, చదరంగం ఆడటం వంటి హాబీలూ మేలు చేస్తాయి. ఇవి ఆలోచనలను తగ్గించి, మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. నిద్ర బాగా పట్టటానికి తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని