బరువు తగ్గించే శస్త్రచికిత్సలతోనీరసం వస్తుందా?

అధిక బరువు, మధుమేహం తగ్గటానికి చేసే ఆధునిక చికిత్స పద్ధతులు.. బేరియాట్రిక్‌ సర్జరీలు ఎక్కువ ఆహారం తినకుండా చేస్తాయి కదా. మరి దీంతో నీరసం రాదా? ఇలాంటి చికిత్సలతో ఎముకలు బలహీనపడతాయని చదివాను

Published : 14 Dec 2021 00:30 IST

సమస్యసలహ

సమస్య: అధిక బరువు, మధుమేహం తగ్గటానికి చేసే ఆధునిక చికిత్స పద్ధతులు.. బేరియాట్రిక్‌ సర్జరీలు ఎక్కువ ఆహారం తినకుండా చేస్తాయి కదా. మరి దీంతో నీరసం రాదా? ఇలాంటి చికిత్సలతో ఎముకలు బలహీనపడతాయని చదివాను. ఇది నిజమేనా? వీటి గురించి తెలియజేయండి.

- ఎస్‌. ఆనంద్‌, కూకట్‌పల్లి, హైదరాబాద్‌

సలహా: బేరియాట్రిక్‌ సర్జరీలతో గానీ బరువును తగ్గించే ఎండోస్కోపీ చికిత్సలతో గానీ ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆహార పరిమాణం తగ్గినా దానికి తగ్గట్టుగా శరీరం సన్నద్ధమవుతుంది. సహజంగానే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. తినే ఆహారానికి అనుగుణంగానే జీవక్రియలు మారతాయి. అందుకే బరువును తగ్గించే చికిత్సలు చేశాక మొదట్లో ఆహారంలో కొన్ని మార్పులు చేస్తారు. జీర్ణాశయం సైజు తగ్గుతుంది కాబట్టి మొదటి వారంలో కేవలం ద్రవాహారమే ఇస్తారు. తర్వాత నెమ్మదిగా మెత్తగా ఉండే ఆహారం ఇస్తారు. దీంతో జీర్ణకోశ వ్యవస్థ దానికి తగ్గట్టుగా సన్నద్ధమవుతుంది. రెండు మూడు వారాల తర్వాత తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అప్పుడు యథావిధిగా మునుపటి ఆహారమే తీసుకోవచ్చు. ఇలా మన శరీరం ఆహార పరిణామానికి అనుగుణంగా తయారవుతుంది కాబట్టి నీరసం, నిస్సత్తువ వంటివేవీ ఉండవు. ఎండోస్కోపీ పద్ధతుల్లో చేసే చికిత్సలు.. అంటే బెలూన్‌ అమర్చటం, గ్యాస్ట్రోప్లాస్టీ వంటివి చేయించుకున్నవారికి పోషకాల లోపమేమీ తలెత్తదు. అదనంగా విటమిన్‌ మాత్రలు తీసుకోవాల్సిన అవసరమేమీ ఉండదు. ఎముకలు బలహీనపడతాయని అనుకోవటం అపోహే. కాకపోతే పేగుల్లో కొంత భాగాన్ని కత్తిరించటం వంటి బేరియాట్రిక్‌ సర్జరీలు చేయించుకున్నవారు క్యాల్షియం, విటమిన్‌ బి12 మాత్రల వంటివి వేసుకోవాల్సి ఉంటుంది. పేగుల్లో ఆయా పోషకాలను గ్రహించే భాగాన్ని తొలగిస్తారు కాబట్టి వీటిని మాత్రల ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పోషకాల లోపంతో తలెత్తే సమస్యలను ముందుగానే నివారించుకోవటానికి వీలుంటుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని