ఇన్‌ఫెక్షన్‌కు టీకా తోడైతే

ఇప్పటికే కొవిడ్‌-19 బారినపడ్డారా? టీకాలు కూడా పూర్తిగా తీసుకున్నారా? అయితే ఒంట్లో కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల ఉత్పత్తి పుంజుకున్నట్టే. అంతేకాదు, వివిధ వైరస్‌ రకాలను ఎదుర్కొనేలా యాంటీబాడీల సామర్థ్యం మెరుగైనట్టే. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా-లాస్‌ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ) అధ్యయనం ఇదే పేర్కొంటోంది.

Published : 14 Dec 2021 00:42 IST

ఇప్పటికే కొవిడ్‌-19 బారినపడ్డారా? టీకాలు కూడా పూర్తిగా తీసుకున్నారా? అయితే ఒంట్లో కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల ఉత్పత్తి పుంజుకున్నట్టే. అంతేకాదు, వివిధ వైరస్‌ రకాలను ఎదుర్కొనేలా యాంటీబాడీల సామర్థ్యం మెరుగైనట్టే. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా-లాస్‌ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ) అధ్యయనం ఇదే పేర్కొంటోంది. డెల్టా రకంతో పాటు ఇతరత్రా కొవిడ్‌ వైరస్‌ రకాలను ఎదుర్కొనేలా యాంటీబాడీల సామర్థ్యం పెంపొందటంలో బూస్టర్‌ టీకాలు అంతే సమర్థంగా ఉపయోగపడగలవని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అధ్యయనంలో భాగంగా ముందుగా కొవిడ్‌ టీకాలు తీసుకొని, ఇంకా ఇన్‌ఫెక్షన్‌ బారినపడనివారిలో.. అలాగే ఇటీవల ఇన్‌ఫెక్షన్‌ బారినపడి, ఇంకా టీకాలు తీసుకోనివారిలో యాంటీబాడీల తీరుతెన్నులను పరిశీలించారు. అనంతరం ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారు టీకాలు తీసుకున్నాక వారిలో పుట్టుకొచ్చిన యాంటీబాడీలనూ పోల్చి చూశారు. కేవలం సహజ ఇన్‌ఫెక్షన్‌తో గానీ టీకాలతో గానీ పుట్టుకొచ్చిన యాంటీబాడీలతో పోలిస్తే.. గతంలో ఇన్‌ఫెక్షన్‌ బారినపడి, టీకాలు తీసుకున్నవారిలో యాంటీబాడీలు సమర్థంగా వైరస్‌ను ఎదుర్కొంటున్నట్టు బయటపడింది. అంటే కొవిడ్‌ వచ్చి ఉండి, టీకాలు తీసుకున్నవారు తరచూ వైరస్‌ ముల్లు ప్రొటీన్‌ ప్రభావానికి గురైతే మన రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీల పనితీరును మెరుగు పరుస్తూ వస్తోందన్నమాట. అందువల్ల టీకాలతో వ్యాధికారక ప్రొటీన్‌ను తరచూ ప్రభావితం చేయటం ద్వారా కొవిడ్‌ వైరస్‌ రకాల నిరోధకతను అధిగమించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీకాల్లో ఇతర వైరస్‌ రకాల అంశాలు లేకపోయినా ఇలాంటి ప్రభావం కనిపించొచ్చని భావిస్తున్నారు. కొవిడ్‌ వచ్చాక టీకాలు తీసుకున్నవారిలో మాదిరిగానే బూస్టర్‌ టీకాలు తీసుకునేవారిలోనూ సమర్థ యాంటీబాడీలు పుట్టుకొచ్చే అవకాశముందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని