ఆటిజంతో పేగు సమస్యలెలా?

ఆటిజమ్‌తో బాధపడేవారిలో పేగుల సమస్యలూ తలెత్తుతుంటాయి. ఒకటేమో మెదడుకు సంబంధించిన సమస్య. మరోటి పేగుల సమస్య. ఈ రెండింటికీ సంబంధమేంటి? దీని రహస్యాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, ఎంఐటీ పరిశోధకులు ఛేదించారు. గర్భం ధరించినప్పుడు తల్లి ఇన్‌ఫెక్షన్‌ బారినపడటం

Published : 14 Dec 2021 00:49 IST

ఆటిజమ్‌తో బాధపడేవారిలో పేగుల సమస్యలూ తలెత్తుతుంటాయి. ఒకటేమో మెదడుకు సంబంధించిన సమస్య. మరోటి పేగుల సమస్య. ఈ రెండింటికీ సంబంధమేంటి? దీని రహస్యాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, ఎంఐటీ పరిశోధకులు ఛేదించారు. గర్భం ధరించినప్పుడు తల్లి ఇన్‌ఫెక్షన్‌ బారినపడటం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. గర్భిణికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఆమె రోగనిరోధక వ్యవస్థ ఇంటర్‌ల్యూకిన్‌-17ఏ (ఐఎల్‌-17ఏ) అనే వాపు  ప్రక్రియ ప్రేరేపకాన్ని పెద్దమొత్తంలో విడుదలయ్యేలా చేస్తుంది. ఇది పిండం మెదడు పనితీరునూ మార్చేస్తుంది. దీంతో ఆటిజమ్‌ మాదిరి లక్షణాలు పొడసూపుతాయి. అయితే ఐఎల్‌17-ఏ ఒక్క మెదడునే కాదు.. తల్లి పేగుల్లోని బ్యాక్టీరియా తీరుతెన్నులనూ ఏమారుస్తుండటం గమనార్హం. ఫలితంగా పుట్టిన తర్వాత శిశువు రోగనిరోధక వ్యవస్థ మున్ముందు ఎదురయ్యే వాపు ప్రక్రియ దాడులకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. అంటే పేగులు ఆయా దాడులకు త్వరగా స్పందిస్తాయన్నమాట. ఇదే ఆటిజమ్‌ బాధితుల్లో జీర్ణకోశ సమస్యలకు కారణమవుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. పుట్టుకతో నాడీ సమస్యలు గలవారిలో రోగనిరోధక వ్యవస్థ ఎందుకు అస్తవ్యస్తమవుతోందనేది అర్థం చేసుకోవటానికి తోడ్పడే యంత్రాంగమేదీ లేదు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు ఈ రెండింటి మధ్య సంబంధాన్ని బయట పెట్టటం కొత్త చికిత్సలకు మార్గం వేయగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని