ఇదేమైనా ల్యూపసా?

నా వయసు 76. మధుమేహం లేదు. బీపీకి, రుమాటిక్‌ నొప్పులకు మందులు వాడుతున్నాను. నాకు కళ్ల కింద రెండు వైపులా సీతాకోక చిలుక రెక్కల్లాగా తెల్లమచ్చలు వస్తున్నాయి. ఇది ల్యూపస్‌ అంటున్నారు. దీనికి ప్రత్యేకమైన మందులు ఉన్నాయా? తెలుపగలరు.

Updated : 21 Dec 2021 06:08 IST

సమస్య: నా వయసు 76. మధుమేహం లేదు. బీపీకి, రుమాటిక్‌ నొప్పులకు మందులు వాడుతున్నాను. నాకు కళ్ల కింద రెండు వైపులా సీతాకోక చిలుక రెక్కల్లాగా తెల్లమచ్చలు వస్తున్నాయి. ఇది ల్యూపస్‌ అంటున్నారు. దీనికి ప్రత్యేకమైన మందులు ఉన్నాయా? తెలుపగలరు.

- వి.సుబ్బారావు, హైదరాబాద్‌

సలహా: కళ్ల కింద రెండు వైపులా సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో తెల్లటి మచ్చలు రావటాన్ని మీరు ల్యూపస్‌గా అనుమానిస్తున్నట్టున్నారు. కానీ ల్యూపస్‌లో మచ్చలు తెల్లగా ఉండవు. ఎర్రటి తట్టు మాదిరిగా ఉంటాయి. సాధారణంగా ఇవి ఎండ సోకినప్పుడు వస్తుంటాయి. ఇలా చాలాకాలంగా వస్తూ పోతూ ఉంటే నల్లగా అవుతాయి. పైగా ల్యూపస్‌ మగవారిలో అరుదు. దీంతో బాధపడే ప్రతి పది మందిలో 9 మంది మహిళలే ఉంటారు. ల్యూపస్‌లో కీళ్లు నొప్పులూ ఉంటాయి. అయితే వృద్ధాప్యంలో కీళ్లు అరగటంతోనూ నొప్పులు (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) రావచ్చు. అందువల్ల మీరు మామూలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్లవాతంతో ముడిపడిన నొప్పులతో బాధపడుతున్నారా? అనేది నిర్ధరించాల్సి ఉంటుంది. నొప్పితో పాటు కీళ్లల్లో వాపు, ఎర్రగా కందిపోవటం, ఉదయం పూట దాదాపు 45 నిమిషాల సేపు ఎక్కువగా నొప్పి ఉండటం వంటి లక్షణాలుంటే కీళ్లవాతం నొప్పులుగా పరిగణించొచ్చు. ల్యూపస్‌లో చర్మం, కీళ్లకు సంబంధించినవే కాదు.. ఇతరత్రా లక్షణాలూ కనిపిస్తాయి. జుట్టు ఎక్కువగా ఊడటం.. చాలాకాలంగా నోట్లో పుండ్లు వస్తూ, పోతుండటం.. విపరీతమైన అలసట, నిస్సత్తువ, కొద్దిగా జ్వరం వంటివీ ఉంటాయి. సమస్య తీవ్రమైతే ఒంట్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు వంటి అవయవాలూ ప్రభావితమవుతుంటాయి. ఇలాంటి లక్షణాల గురించి మీరు తెలపలేదు. అందువల్ల మీరు అనుమానిస్తున్నట్టుగా ల్యూపస్‌ కాకపోయి ఉండొచ్చనే అనిపిస్తోంది. అయినా కూడా ఒకసారి రుమటాలజిస్టును సంప్రదించి, అనుమానాన్ని నివృత్తి చేసుకోవటం మంచిది. ఏఎన్‌ఏ, డీఎస్‌ డీఎన్‌ఏ పరీక్షలు చేసి జబ్బును నిర్ధరిస్తారు. అవసరమైతే తగు చికిత్స సూచిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని