Menstrual Cycle:నెలసరి 2 రోజులే... కారణమేంటి?
సమస్య: నాకు 24 ఏళ్లు. పెళ్లయ్యి రెండు సంవత్సరాలయ్యింది. నెలసరి మామూలు తేదీకే వస్తోంది. అయితే ఇటీవల రెండు రోజులే రుతుస్రావం అవుతోంది. ఇంతకుముందు ఐదు రోజులు అయ్యేది. దీనికి కారణమేంటి? పరిష్కార మార్గం సూచించండి.
- పద్మావతి, హైదరాబాద్
సలహా: నెలసరి కచ్చితంగా నెలకే రావాలనేమీ లేదు. మొత్తం ఐదు రోజులూ రుతుస్రావం కావాలనేమీ లేదు. ఇవి చాలా అంశాల మీద ఆధారపడి ఉంటాయి. నెలసరి 24 నుంచి 35 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా ఆరంభం కావచ్చు. రుతుస్రావం 2 రోజుల నుంచి 7 రోజుల వరకు కావటమూ మామూలే. అయితే అప్పటివరకూ నెలసరి సరిగా అవుతూ.. ఉన్నట్టుండి రుతుస్రావమయ్యే రోజులు తగ్గాయంటే ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ నెలసరిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తగినంత ఉత్పత్తి కాకపోతే నెలసరి అస్తవ్యస్తం కావటమే కాదు, రుతుస్రావమయ్యే రోజులూ తగ్గొచ్చు. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మోతాదులు పెరిగినా, అలాగే హఠాత్తుగా బరువు పెరిగినా సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. ఇలాంటివన్నీ అండాశయాల్లో నీటితిత్తుల సమస్యకు (పీసీఓఎస్) దారితీస్తాయి. ఇందులో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో నెలసరి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడితోనూ ఒంట్లో హార్మోన్ల తీరుతెన్నులు దెబ్బతినొచ్చు. ఇదీ రుతుస్రావం తక్కువయ్యేలా చేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించండి. హార్మోన్ల పరీక్షలు చేసి కారణాన్ని గుర్తిస్తారు. తగు చికిత్స సూచిస్తారు. సమస్య కుదురుకుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు.
Advertisement