అరికాళ్ల మంట పోయేదెలా?

నాకు 80 ఏళ్లు. నాలుగేళ్లుగా అరికాళ్ల మంటలతో బాధపడుతున్నా. మడమలు, వేళ్లు మొద్దుబారినట్టూ ఉంటున్నాయి. ఉదయం కన్నా సాయంత్రం వేళలో బాధ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం లేదు. అరికాళ్ల మంట

Published : 18 Jan 2022 00:26 IST

సమస్య: నాకు 80 ఏళ్లు. నాలుగేళ్లుగా అరికాళ్ల మంటలతో బాధపడుతున్నా. మడమలు, వేళ్లు మొద్దుబారినట్టూ ఉంటున్నాయి. ఉదయం కన్నా సాయంత్రం వేళలో బాధ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం లేదు. అరికాళ్ల మంట తగ్గటానికి తేలికైన పరిష్కారం తెలియజేయండి.

- డి.ప్రసాదరావు(ఈమెయిల్‌)

సలహా: అరికాళ్ల మంటకు మూలం నాడులు దెబ్బతినటం. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలుసుకోవటం ముఖ్యం. సాధారణంగా మధుమేహంతో బాధపడేవారిలో నాడులు దెబ్బతినే అవకాశం ఎక్కువ. మీరు మధుమేహం లేదని అంటున్నారు కాబట్టి విటమిన్‌ బి12, థైరాయిడ్‌ లోపం వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంటుంది. వృద్ధాప్యంలో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. శరీరం పోషకాలను గ్రహించుకోలేదు. దీంతో విటమిన్ల లోపం తలెత్తుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో విటమిన్‌ బి12 లోపం ఎక్కువ. నాడులు సజావుగా ఉండటానికి, ఇవి సక్రమంగా పనిచేయటానికి విటమిన్‌ బి12 అత్యవసరం. ఇది లోపిస్తే నాడుల మీదుండే రక్షణ పొర దెబ్బతింటుంది. దీంతో నాడుల లోపలి భాగం పైకి తేలి.. కాళ్లలో తిమ్మిర్లు, మండినట్టు అనిపించటం, నడుస్తుంటే తూలటం వంటి ఇబ్బందులు పొడసూపుతాయి. కాబట్టి మీరు విటమిన్‌ బి12 మోతాదు పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకవేళ బి12 తక్కువుంటే మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకోవాలి. థైరాయిడ్‌ సమస్యతోనూ అరికాళ్లలో మంటలు రావొచ్చు. థైరాయిడ్‌ హార్మోన్‌ లోపిస్తే ఒంట్లోంచి నీరు సరిగా బయటకు పోదు. దీంతో కణజాలాలు ఉబ్బుతాయి. ఫలితంగా నాడుల మీద ఒత్తిడి పడి దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల థైరాయిడ్‌ హార్మోన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇది తక్కువుంటే మందులు వాడుకోవాలి. దీంతో సమస్య కుదురుకుంటుంది. మీరు ఏవైనా మందులు వాడుతున్నారో తెలియజేయలేదు. కొన్ని మందులను దీర్ఘకాలంగా వాడుతున్నా అరికాళ్ల మంటలు తలెత్తొచ్చు. అలాగే కాళ్లలో స్పర్శ ఎలా ఉందన్నదీ చూడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే తగు పరీక్షలు చేసి మందులు సూచిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని