సర్వైకల్‌ నమూనాతోనే రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపు

ఒక్క పరీక్షతో నాలుగు రకాల క్యాన్సర్ల గుర్తింపు! యూసీఎల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వుమెన్స్‌ హెల్త్‌ పరిశోధకులు ఇలాంటి వినూత్న పరీక్షనే అభివృద్ధి చేస్తున్నారు.

Updated : 08 Feb 2022 06:39 IST

ఒక్క పరీక్షతో నాలుగు రకాల క్యాన్సర్ల గుర్తింపు! యూసీఎల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వుమెన్స్‌ హెల్త్‌ పరిశోధకులు ఇలాంటి వినూత్న పరీక్షనే అభివృద్ధి చేస్తున్నారు. దీని పేరు డబ్ల్యూఐడీ పరీక్ష. ఇది ఒక్క గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) కణజాలం నమూనాతోనే అండాశయ, రొమ్ము, గర్భాశయ ముఖద్వార, గర్భసంచి క్యాన్సర్లనూ గుర్తించగలదు. ఈ క్యాన్సర్ల ముప్పునూ మరింత కచ్చితంగా అంచనా వేయగలదు. సాధారణంగా డీఎన్‌ఏలోని సూచనలను చదివి, వాటి ప్రకారం కణాలు నడచుకోవటాన్ని డీఎన్‌ఏ మిథైలేషన్‌ ప్రక్రియ నిర్ణయిస్తుంది. ఒకరకంగా దీన్ని డీఎన్‌ఏ ‘సాఫ్ట్‌వేర్‌’ అనుకోవచ్చు. పరిసరాలు, జీవనశైలి ప్రభావాల వంటివన్నీ క్రమంగా దీని సంకేతాన్ని మార్చేస్తుంటాయి. కొన్ని మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తుంటాయి. నిజానికి ఈ మార్పులు క్యాన్సర్‌ అభివృద్ధి చెందటానికి చాలా ఏళ్ల ముందుగానే మొదలవుతుంటాయి. వీటి ద్వారా క్యాన్సర్‌ ముప్పును అంచనా వేయొచ్చు. డబ్ల్యూఐడీ పరీక్ష చేసే పని ఇదే. రొమ్ముక్యాన్సర్‌ను అంచనా వేయటంలో ఇది ప్రస్తుత పద్ధతుల కన్నా 30% మెరుగ్గా పనిచేస్తుండటం గమనార్హం. అలాగే అండాశయ, గర్భసంచి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను గుర్తించటానికీ తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఇది క్యాన్సర్లను గుర్తించటంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని భావిస్తున్నారు. ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువగా గలవారికిది ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని