మంగు మచ్చ తగ్గేదెలా?

నాకు 40 సంవత్సరాలు. నాలుగేళ్ల క్రితం ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చాయి. డాక్టర్‌కు చూపిస్తే మంగు మచ్చలు అని మాత్రలు రాసిచ్చారు. మాత్రలు వాడితే మచ్చలు తగ్గిపోయి, మళ్లీ వచ్చాయి. మాత్రలు వేసుకుంటే నలుపు కాస్త తగ్గుతున్నాయి, ఆపేస్తే తిరిగి ల్లగా అవుతున్నాయి. ఇవి పూర్తిగా

Updated : 15 Feb 2022 01:27 IST

సమస్య: నాకు 40 సంవత్సరాలు. నాలుగేళ్ల క్రితం ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చాయి. డాక్టర్‌కు చూపిస్తే మంగు మచ్చలు అని మాత్రలు రాసిచ్చారు. మాత్రలు వాడితే మచ్చలు తగ్గిపోయి, మళ్లీ వచ్చాయి. మాత్రలు వేసుకుంటే నలుపు కాస్త తగ్గుతున్నాయి, ఆపేస్తే తిరిగి ల్లగా అవుతున్నాయి. ఇవి పూర్తిగా తగ్గే మార్గముందా? వీటితో బయటకు వెళ్లలేక పోతున్నాను. పరిష్కారం సూచించండి.

- డి. రమణి, హైదరాబాద్‌

సలహా: మీరు మంగు (మెలస్మా) మచ్చలకు మాత్రలు వేసుకుంటున్నాననే రాశారు. నిజానికి దీనికి పూత మందులూ వాడుకోవాల్సి ఉంటుంది. మచ్చలకు మూలం చర్మానికి రంగు తెచ్చిపెట్టే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి కావటం. దీనికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. ఒంట్లో హార్మోన్ల మార్పులు, ఎండకు ఎక్కువగా గురికావటం వంటివి దీనికి దోహదం చేయొచ్చు. కొందరికి వంశ పారంపర్యంగా.. తల్లికి లేదా తండ్రికి మంగు ఉన్నా రావచ్చు. హార్మోన్ల మాత్రలు వాడేవారికీ దీని ముప్పు ఉంటుంది. చర్మం పైపొరలకే నలుపు పరిమితమైతే స్టిరాయిడ్‌, స్టిరాయిడ్‌ రహిత పూత మందులతో తేలికగానే తగ్గుతుంది. మీరు తెలియజేసిన వివరాలను బట్టి మంగు మచ్చలు (మెలస్మా) లోపలి పొరలకు వ్యాపించినట్టు అనిపిస్తోంది. చర్మం పైపొరల్లోని మచ్చలు తేలికగానే తగ్గుముఖం పడతాయి గానీ లోపలి పొరలకు వ్యాపించినవి తగ్గటం కష్టం. ఇలాంటివి మందులతో తగ్గినా ఎండ తగలగానే తిరిగి ఎక్కువవుతాయి. దీనికి లోపలి పొరల మీదా పనిచేసే స్టిరాయిడ్‌తో కూడిన పూత మందులు.. అలాగే విటమిన్‌ సి, ట్రానెక్జామిక్‌ యాసిడ్‌ వంటి మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు చర్మం మీద ఎండ ప్రభావాన్ని తగ్గించే సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా రాసుకోవాలి. మచ్చలు తగ్గటం ఆరంభించాక నెమ్మదిగా మాత్రలు, స్టిరాయిడ్‌ పూత మందు తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. అనంతరం స్టిరాయిడ్‌ రహిత పూత మందులు వాడుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం  లేజర్‌ చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ చికిత్సలయినా శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. చికిత్స తీసుకున్నాక కొన్ని జాగ్రత్తలతో చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఎండకు వెళ్తే గొడుగు ధరించాలి. చర్మ నిపుణులను సంప్రదిస్తే తగు చికిత్స, జాగ్రత్తలు సూచిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని