ప్రయాణంలో వాంతులా?

కారు, రైలు, విమానం.. ఏది ఎక్కినా కొందరికి కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. వాంతులు అవుతుంటాయి. ఇలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్నుంచి గట్టెక్కొచ్చు.

Published : 22 Feb 2022 00:54 IST

కారు, రైలు, విమానం.. ఏది ఎక్కినా కొందరికి కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. వాంతులు అవుతుంటాయి. ఇలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్నుంచి గట్టెక్కొచ్చు.

* సరైన సీటు: వాహనంలో కూర్చునే చోటుతోనూ వాంతి భావన కలగొచ్చు. కారులో ముందు సీటులో కూర్చున్నప్పటి కన్నా వెనక కూర్చుంటే వాంతయ్యే అవకాశమెక్కువ. బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం మంచిది. రైలులోనైతే రైలు కదిలే దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి. కిటికీ పక్కన కూర్చుంటే మంచిది.
* తగినంత గాలి: ప్రయాణించే సమయంలో తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. కారులో ఏసీ వాడుకోవచ్చు. రైలులో, బస్సులో కిటికీ నుంచి వచ్చే గాలి ముఖానికి తగిలేలా చూసుకోవాలి.

* చదవటం వద్దు: ప్రయాణంలో పుస్తకాల వంటివి చదవొద్దు. కిటికీలోంచి దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీంతో వాంతి భావన నుంచి దృష్టి మళ్లుతుంది. పక్క నుంచి కదిలే కార్లు, బస్సుల వంటి వాటిని చూడకపోవటమూ మేలు చేస్తుంది.

* కడుపు నిండా తినొద్దు: ప్రయాణానికి ముందు కడుపు నిండా తినొద్దు. కావాలంటే మామూలు ఆహారం కొద్దిగా తినొచ్చు. ప్రయాణానికి ముందు, ప్రయాణం చేసేటప్పుడు వేపుళ్లు, మసాలా, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాల జోలికి వెళ్లొద్దు. ఇవి జీర్ణాశయంలో ఆమ్లాన్ని పెంచి వాంతి భావన కలిగించొచ్చు. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. తగినంత నీరు తాగాలి.

* పడుకోవటం: కొందరికి పడుకుంటే హాయిగా ఉంటుంది. వీలుంటే కారులో లేదా రైలులో సీటు మీద నడుం వాల్చొచ్చు. కొందరికి నిల్చుంటే బాగుండొచ్చు. ఇలాంటివారు బస్సులో, రైలులో నిలబడితే మేలు.

* సంగీతం వినొచ్చు: సంగీతం వినటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇది వాంతి భావన నుంచి మనసు మళ్లేలా చేస్తుంది.

* తులసి ఆకులు నమలటం: దీంతో కొందరికి వాంతి భావన తగ్గే అవకాశముంది.

* తరచూ విరామం: కారులో వెళ్లేవారు అప్పుడప్పుడు విరామం తీసుకోవటం మంచిది. కిందికి దిగి కాసేపు నడవాలి. తాజా గాలి పీల్చుకోవాలి.

* మందులు: ప్రయాణాలకు సిద్ధమయ్యేవారు ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి వాంతి, వికారం తగ్గించే మందులు వాడుకోవచ్చు. వీటిని ప్రయాణం చేయటానికి రెండు గంటల ముందు వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని