ముఖాలను ఎలా గుర్తిస్తాం?

రోజూ తెలిసినవారిని, తెలియనివారిని ఎంతోమందిని కలుస్తుంటాం. తెలిసినవారిని గుర్తిస్తాం. తెలియని వారిని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత కలిసినప్పుడు ముఖాన్ని చూడగానే పోల్చుకుంటాం. ఇదేమీ పెద్ద విషయంగా మనకు తోచకపోవచ్చు.

Published : 22 Mar 2022 00:58 IST

రోజూ తెలిసినవారిని, తెలియనివారిని ఎంతోమందిని కలుస్తుంటాం. తెలిసినవారిని గుర్తిస్తాం. తెలియని వారిని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత కలిసినప్పుడు ముఖాన్ని చూడగానే పోల్చుకుంటాం. ఇదేమీ పెద్ద విషయంగా మనకు తోచకపోవచ్చు. కానీ దీని వెనకాల పెద్ద తతంగమే ఉన్నట్టు సెడార్‌-సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనం పేర్కొంటోంది. కంటి కదలికలు మెదడులోని తరంగాలను ప్రేరేపితం చేయటం వల్లనే ఇది సాధ్యమవుతోందని పరిశోధకులు గుర్తించారు మరి. సాధారణంగా మనం తదేకంగా చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది గానీ కళ్లను నిరంతరం కదిలిస్తూనే ఉంటాం. ప్రతీ సెకండుకు నాలుగైదు సార్లయినా ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు దృష్టి మళ్లిస్తుంటాం. మన చూపు ఒకరి ముఖం మీద కేంద్రీకృతమైనప్పుడు సామాజిక అంశాల సమాచారాన్ని విశ్లేషించే మెదడులోని అమిగ్దలలో కొన్ని కణాలు ప్రేరేపితమవుతాయి. వీటినే ముఖ కణాలనీ పిలుచుకుంటున్నారు. ఇవి ప్రతిస్పందించటం వల్లనే ఆయా ముఖాలను గుర్తుపెట్టుకోవటం సాధ్యమవుతోంది. మూర్ఛతో బాధపడేవారి మెదడుకు అమర్చిన ఎలక్ట్రోడ్ల సాయంతో ఈ విషయాన్ని గుర్తించారు. చూపు ఎక్కడ కేంద్రీకృతమవుతోందనేది పసిగట్టటం వీటితోనే సాధ్యమైంది. మనుషుల ముఖాల ఫొటోలను చూసినప్పుడు అమిగ్దలలోని ‘ముఖం’ కణాలు ప్రేరేపితం కావటంతో పాటు హిప్పోక్యాంపస్‌లో థీటా తరంగాల క్రమం కుదురుకొని, తిరిగి సాగుతున్నట్టూ తేలింది. సమాచార విశ్లేషణ, జ్ఞాపకాల రూపకల్పనలో థీటా తరంగాలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. కళ్లు కదిలిన ప్రతీసారీ ఇవి కుదురుకోవటం గమనార్హం. వానరాలు, పువ్వులు, పక్షుల వంటి ఇతర ఫొటోలను చూసినప్పుడు ఇలాంటి ధోరణి కనిపించలేదు. ముఖం మీద కళ్లు కేంద్రీకృతమైనప్పుడు ఎంత త్వరగా మెదడులో కణాలు ప్రేరేపితమైతే అంత ఎక్కువగా ముఖాలు గుర్తుండిపోతున్నాయనీ తేలింది. తెలిసిన ముఖాలను చూసినప్పుడు ఈ కణాలు నెమ్మదిగా పుంజుకుంటున్నట్టూ బయటపడింది. అంటే అప్పటికే ఆయా ముఖాలు జ్ఞాపకశక్తిలో నిల్వ ఉండిపోయాయని అర్థం. వీటిని మళ్లీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆటిజమ్‌ వంటి సమస్యలకు కొత్త చికిత్సల రూపకల్పనలో అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని