ఏడాది అయినా నెలసరి రాలేదు

సమస్య: మా అమ్మాయికి 21 ఏళ్లు. బరువు 56 కిలోలు. ఒక సంవత్సరం నుంచి తనకి ఒక్కసారైనా రుతుక్రమం రాలేదు. దీనికి కారణమేంటి? పరిష్కారమేంటి?

Updated : 22 Mar 2022 05:54 IST

సమస్య: మా అమ్మాయికి 21 ఏళ్లు. బరువు 56 కిలోలు. ఒక సంవత్సరం నుంచి తనకి ఒక్కసారైనా రుతుక్రమం రాలేదు. దీనికి కారణమేంటి? పరిష్కారమేంటి?

-ఒక పాఠకురాలు, కావలి

సలహా: అప్పటివరకూ నెలసరి సరిగా వస్తూ.. 3 నెలలు దాటినా నెలసరి రాకపోతే వెంటనే డాక్టర్‌కు చూపించాలి. కానీ మీరు డాక్టర్‌కు చూపించినట్టు లేదు. నెలసరి కాకపోవటానికి చాలా కారణాలు ఉండొచ్చు. వీటిల్లో అధిక బరువు ఒకటి. మీ అమ్మాయి బరువు మరీ ఎక్కువేమీ కాదు కాబట్టి ఇది కారణం కాకపోవచ్చు. అయితే బరువు ఎక్కువగా లేకపోయినా కొందరిలో అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓఎస్‌) ఉండొచ్చు. దీంతో నెలసరి రాకపోవచ్చు. పీసీఓఎస్‌లోనూ హఠాత్తుగా నెలసరి నిలిచిపోవట మనేది ఉండదు. ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ మోతాదులు పెరగటమూ ఒక కారణం కావొచ్చు. దీంతో అంతకుముందు తక్కువ తక్కువగా నెలసరి అవుతూ.. హఠాత్తుగా ఆగిపోవచ్చు. మనదేశంలో నెలసరి నిలవటానికి ముఖ్యమైన కారణం జననాంగ క్షయ. గర్భసంచిలో క్షయ వచ్చినట్టయితే దీని లోపలి పొర మాడిపోయినట్టు అవుతుంది. దీంతో హార్మోన్ల మోతాదులు బాగున్నా నెలసరి రాదు. కాబట్టి కారణమేంటన్నది కచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. గైనకాలజిస్టును సంప్రదిస్తే తగు పరీక్షలు చేస్తారు. ముందుగా నెలసరి వస్తుందో లేదో పరీక్షిస్తారు. ప్రొజెస్టిరాన్‌ మందు ఇచ్చి చూస్తారు. దీన్ని వేసుకున్నా నెలసరి రాకపోతే అండం విడుదల కావటం లేదని అర్థం. ప్రొజెస్టిరాన్‌ మందుతో నెలసరి రాకపోతే ఈస్ట్రోజెన్‌ మందు ఇచ్చి పరిశీలిస్తారు. ఈస్ట్రోజెన్‌ వేసుకుంటే నెలసరి వచ్చినట్టయితే దీన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అండాశయాలు సక్రమంగా పనిచేయకపోవటం వల్ల కొందరికి చాలా ముందుగానే నెలసరి నిలిచిపోవచ్చు (ప్రైమరీ ఓవేరియన్‌ ఇన్‌సఫిషియెన్సీ). వీరికి ఈస్ట్రోజెన్‌తో పాటు ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ మాత్రలూ అవసరమవుతాయి. కారణం తెలుసుకుంటే చికిత్స తేలికవుతుంది. సమస్య నయమవుతుంది. అవసరమైతే ఎండోక్రైనాలజిస్టును కూడా సంప్రదించాల్సి రావొచ్చు.

చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని