ట్రైగ్లిజరైడ్లు తగ్గాలంటే..

హానికర కొలెస్ట్రాల్‌ అనగానే చెడ్డ కొవ్వే గుర్తుకొస్తుంది. ఇదొక్కటే కాదు ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటమూ ప్రమాదకరమే. మనదేశంలో రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కన్నా ట్రైగ్లిజరైడ్ల సమస్యే ఎక్కువ. ఇవి ఎక్కువగా ఉంటే గుండెజబ్బుల ముప్పు పొంచి

Published : 26 Apr 2022 01:12 IST

హానికర కొలెస్ట్రాల్‌ అనగానే చెడ్డ కొవ్వే గుర్తుకొస్తుంది. ఇదొక్కటే కాదు ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటమూ ప్రమాదకరమే. మనదేశంలో రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కన్నా ట్రైగ్లిజరైడ్ల సమస్యే ఎక్కువ. ఇవి ఎక్కువగా ఉంటే గుండెజబ్బుల ముప్పు పొంచి ఉంటుందనే సంగతి మరవరాదు. గుండె, రక్తనాళాల జబ్బుల బారినపడుతున్నవారిలో 70% మందికి కొలెస్ట్రాల్‌ మామూలుగానే ఉంటున్నా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. ఒకరకం కొవ్వు పదార్థాలైన వీటి స్థాయులు మించిపోతే ప్రతి జీవ రసాయన ప్రక్రియకూ అడ్డుతగులుతుంటాయి. జీవక్రియల వేగాన్ని మందగింపజేస్తాయి. వీటితో అతిపెద్ద ప్రమాదమేంటంటే- రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ముద్దలుగా పేరుకుపోవటం. కొలెస్ట్రాల్‌ పేరుకుపోవటానికి ముందే అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లు అక్కడ పైపొరను దెబ్బతీస్తాయి. తర్వాత కొలెస్ట్రాల్‌ వచ్చి చేరుతుంది. అంటే రక్తనాళాల్లో పూడికలకు ట్రైగ్లిజరైడ్లు అనువైన పరిస్థితిని సృష్టిస్తున్నాయన్నమాట. మరి వీటిని తగ్గించుకునేదెలా?

* లావుగా ఉన్నవారు బరువు తగ్గించుకోవటం ప్రధానం.

* మద్యం, పొగ తాగితే ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లొద్దు.

* కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం తగ్గించాలి. అన్ని రకాల నూనెలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి.

* తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలతో ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. దుకాణాల్లో ప్యాకెట్లలో లభించే రకరకాల చిప్స్‌, నూడుల్స్‌, సేమియా, పాస్తా, పిజ్జాలు, కేకులు, బిస్కట్ల వంటివన్నీ తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలే. కాబట్టి వీటిని బాగా తగ్గించుకోవాలి.

* రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. 

* పంచదార, జామ్‌లు, జెల్లీల వంటివి ఎక్కువగా తినేవారికి ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు చక్కెర, మిఠాయిల వంటివి తగ్గించుకోవాలి. కూల్‌డ్రింకులు మానెయ్యటం మంచిది. మరీ అవసరమైతే మితంగానే తీసుకోవాలి.

* మధుమేహం గలవారంతా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోవటం, ఎక్కువుంటే తగ్గించుకోవటం తప్పనిసరి. గ్లూకోజును సమర్థంగా నియంత్రణలో ఉంచుకుంటే ట్రైగ్లిజరైడ్లు చాలావరకు అదుపులోకి వస్తాయి. గ్లూకోజును అదుపులో ఉంచుకుంటున్నా తగ్గకపోతే మందులు వాడుకోవాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారానూ ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు