Updated : 14 Jun 2022 06:45 IST

రక్తం కాదు ప్రాణదానం!

నేడు రక్తదాతల దినోత్సవం

అవతలివారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. మీ ప్రాణంలో కొంత ధారపోసి వారిని బతికిస్తే? మీరే అపర దేవతలైతే? రక్తదానం అలాంటి దైవత్వాన్నే ప్రసాదిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఒకేసారి ఏకంగా ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశాన్ని కల్పిస్తుంది. ఒంట్లో జీవధారగా ప్రవహిస్తూ, మనల్ని నడిపిస్తూనే.. అవసరమైతే ఇతరుల ప్రాణాలనూ నిలబెట్టగల రక్తం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. రక్తదాతల దినోత్సవం సందర్భంగా దీని గొప్పతనం, అవసరం, ప్రయోజనాలపై సమగ్ర కథనం మీకోసం. 

ఆశ్చర్యంగా అనిపించినా మన ఒంట్లో అతిపెద్ద అవయవం రక్తమే. ద్రవరూపంలో ఉండటం వల్ల అవయవంగా పరిగణించం గానీ ఇది చేసే పనులు దేనికీ తీసిపోవు. మన లోపలి జీవధార ఇదే. అన్ని అవయవాలకూ, కణాలకూ పోషకాలను, ద్రవాలను అందించటం దగ్గర్నుంచి మన ప్రాణాలు నిలవటానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేయటం వరకూ ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే కార్బన్‌ డయాక్సైడ్‌, ఇతర వ్యర్థాలను బయటకు పంపటంలోనూ రక్తం పాత్రే కీలకం. అంతేనా? రోజువారీ వ్యవహారాల్లో భాగంగా దెబ్బతినే కణజాలాన్ని మరమ్మతు చేసేదీ ఇదే. ఇలా ఒళ్లంతా విస్తరించిన భారీ అవయవంలా రక్తం అనుక్షణం మనకు అండగా నిలుస్తుంది. శరీర బరువును బట్టి ఒంట్లో రక్తం మోతాదు ఆధారపడి ఉంటుంది. పెద్దవారిలో సుమారు 5 నుంచి 6.5 లీటర్ల రక్తం ఉంటుంది. ఇది ఎప్పుడూ నిర్ణీత మోతాదులో ఉండటం తప్పనిసరి. అప్పుడే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పోషకాలు బాగా అందుతాయి. గుండెతో పాటు శరీరంలోని అన్ని అవయవాలు సమర్థంగా పనిచేస్తాయి. లేకపోతే అన్నీ చతికిల పడతాయి. కాబట్టే ప్రమాదాలు, సర్జరీల వంటి పరిస్థితుల్లో ఒంట్లోంచి రక్తం బాగా పోయినప్పుడు భర్తీ చేయటం అత్యవసరం. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడే రక్తదానం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఎందుకంటే రక్తం దుకాణాల్లో దొరికే సరుకు కాదు. కృత్రిమ పరికరాల మాదిరిగా తయారు చేయలేం, ప్రయోగశాలలో వృద్ధి చేయలేం. మన శరీరంలోనూ అప్పటికప్పుడు కోల్పోయిన రక్తాన్ని తయారుచేసే యంత్రాంగం గానీ, చికిత్సలు గానీ లేవు. అప్పటికప్పుడు ఇతరుల నుంచి తీసుకున్న రక్తమో లేదంటే దాతల నుంచి సేకరించి పెట్టుకున్న రక్తమో ఎక్కించటం తప్ప మరో మార్గం లేదు.

సాటి లేదు 

నెమ్మదిగా.. పదిహేను నిమిషాల్లో 500-700 మి.లీ. రక్తం పోయినా మన శరీరం తట్టుకోగలదు. రక్తపోటు, రక్తంలో గ్లూకోజు, ఆక్సిజన్‌ మోతాదులు పెంచుకోవటం ద్వారా అప్పటికి కుదురుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ అతిగా రక్తం పోతే మాత్రం తట్టుకోలేదు. రక్తపోటు పడిపోతుంది. రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గుతాయి. గుండె వేగంగా కొట్టుకోవటం ఆరంభిస్తుంది. సెలైన్‌ ఎక్కించటం వంటి వాటితో కొంతవరకు కోలుకునేలా చేయొచ్చు గానీ ఇవేవీ రక్తానికి సరిపోయేవి కావు. వీలైనంత త్వరగా కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయాల్సిందే. ఇతరుల నుంచి తీసుకున్న రక్తాన్ని ఎక్కించే ప్రక్రియ 130 ఏళ్ల కిందటే మొదలైంది. దీన్నే ఇప్పటికీ అనుసరిస్తూ వస్తున్నాం. క్రమంగా ఆయా గ్రూపులకు సరిపడిన రక్తాన్ని ఎక్కించటం పరిపాటిగా మారిపోయింది. మనదేశంలో చికిత్సల కోసం ఏటా 1.5 కోట్ల యూనిట్ల రక్తం (ఒక యూనిట్‌ అంటే 400-450 మి.లీ.) అవసరమని అంచనా. కానీ సుమారు కోటి యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఈ కొరత అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో ఇక్కట్లకు దారితీస్తోంది. సమయానికి సరిపడిన, అవసరమైనంత రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు పోతుండటం చూస్తున్నాం.  

మూడు ముఖ్య పదార్థాలు 

రక్తం ఎర్రగా ఉండటం తెలిసిందే. దీనికి కారణం ఎర్ర రక్తకణాలు. ఇవే కాదు.. రక్తంలో తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కణాల వంటి ఇతర పదార్థాలూ ఉంటాయి. రక్తం చేసే పనుల్లో ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. మన ఎముకమజ్జలోని మూలకణాల సాయంతో ఇవి పుట్టుకొస్తాయి. ఎర్ర కణాల మధ్యలో హిమోగ్లోబిన్‌ ఉంటుంది. అన్ని అవయవాలకూ ఆక్సిజన్‌ను మోసుకెళ్లేది, కణాల నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను ఊపిరితిత్తులకు చేరవేసేది ఇదే. తెల్ల రక్తకణాలేమో ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంటాయి. అవసరమైనప్పుడు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంటాయి. ఇక ప్లేట్‌లెట్లు మనకు ఏవైనా గాయాలైనప్పుడు, చర్మం చీరుకుపోయినప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. ఆయా భాగాలు మరమ్మతు కావటంలో పాలు పంచుకుంటాయి. తక్కువ మొత్తంలోనే అయినా రక్తంలో మూలకణాలూ ప్రవహిస్తుంటాయి. ఒంట్లో ఏవైనా కణాలు దెబ్బతింటే ఇవి అక్కడికి చేరుకొని సరిచేయటానికి ప్రయత్నిస్తాయి. రక్తకణాలు రోజూ ఉత్పత్తి కావాల్సిందే. ఇవి కొంతకాలమే జీవించి ఉంటాయి మరి. ఉదాహరణకు- ఎర్ర రక్తకణాల జీవనకాలం 120 రోజులు. తెల్లరక్తకణాలు 10 రోజులు, ప్లేట్‌లెట్లు 7 రోజుల వరకే జీవిస్తాయి. గడువు తీరగానే ప్లీహం వీటిని విచ్ఛిన్నం చేసేస్తుంది. రక్తంలో ద్రవం, కణాలు సమానంగా ఉంటాయి. అంటే 6 లీటర్ల రక్తంలో 3 లీటర్లు ద్రవ పదార్థముంటే.. మిగతా 3 కిలోలు ఎర్ర, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్ల వంటివి ఉంటాయన్నమాట. రక్తం ఎక్కించినప్పుడు పరిమాణం మాత్రమే కాదు, ఇలాంటి కణాల మోతాదులూ పెరుగుతాయి. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ శాతమూ పెరుగుతుంది. ప్రొటీన్‌ కూడా అందుతుంది. ఇవన్నీ రక్తపోటు, ఆక్సిజన్‌, పోషకాల స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. రక్తం బాగా కోల్పోయినవారి ప్రాణాలు నిలవటానికివి చాలా ముఖ్యం. 

ముగ్గురి ప్రాణాలకు రక్ష 

ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడినట్టే. రక్తంలోని పదార్థాలను మూడుగా విభజించి వేర్వేరు అవసరాలకు వాడుకోవచ్చు మరి. వీటిల్లో ఒకటి- ప్యాక్డ్‌ రెడ్‌ సెల్స్‌. దీన్నే ప్యాక్డ్‌ సెల్స్‌ అనీ అంటారు. ఒక యూనిట్‌ రక్తంలో దీని పరిమాణం 200-250 మి.లీ. వరకు ఉంటుంది. పెద్దమొత్తంలో ఎర్ర రక్తకణాలు, కొంత ప్లాస్మా ద్రవంతో కూడిన ఇది రిఫ్రిజిరేటర్‌లో 20-35 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మొత్తం రక్తంలో రెండు, మూడు రోజుల తర్వాత ఉపయోగపడేది ఇదే. అందుకే దీనికి అంత ప్రాధాన్యం. రెండోది- ఫ్రెష్‌ ఫ్రోజెన్‌ ప్లాస్మా (ఎఫ్‌ఎఫ్‌పీ). రక్తంలోని ద్రవం నుంచి దీన్ని వేరు చేస్తారు. రక్తం నెమ్మదిగా గడ్డకట్టే హిమోఫీలియా వంటి సమస్యలు గలవారికి, సర్జరీలు చేసేటప్పుడు, సర్జరీ అనంతరం రక్తస్రావమయ్యేవారికిది ఉపయోగపడుతుంది. దీన్ని మైనస్‌ 20, మైనస్‌ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డ కట్టిస్తే ఒకట్నుంచి రెండేళ్ల వరకు వాడుకోవచ్చు. మూడోది- ప్లేట్‌లెట్లు. డెంగీ వంటి సమస్యల్లో రక్తం లీకయ్యే ప్రమాదమున్నప్పుడు వీటిని ఎక్కించటం తెలిసిందే. ప్రస్తుతం రక్తం నుంచి వీటిని వేరు చేయటానికి అధునాతన పద్ధతులెన్నో వచ్చాయి. దీంతో అవసరమైన పదార్థాలనే ఎక్కించే వెసులుబాటు వచ్చింది. అందువల్ల రక్తంలోని పదార్థాలను వేరు చేసే సదుపాయాలున్న బ్లడ్‌ బ్యాంకుల్లోనే రక్తదానం చేయటం మంచిది. దీంతో ఒక రక్త దానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. 

ఎవరికి అవసరం? 

రక్తం అవసరం ఎప్పుడైనా తలెత్తొచ్చు. ప్రమాదాల్లో గాయపడటం, శస్త్రచికిత్సలు, కాన్పు సమయంలో రక్తస్రావం వంటి సందర్భాల్లో అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. రక్తం ఎక్కువగా పోయినప్పుడు హిమోగ్లోబిన్‌ మోతాదులు వేగంగా పడిపోతాయి. అప్పుడు తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అందక మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. సత్వరం రక్తం ఎక్కించకపోతే ప్రాణాల మీదికి రావొచ్చు. సర్జరీలు.. ముఖ్యంగా కడుపు, గుండె శస్త్రచికిత్సల్లో ఎక్కువ రక్తం పోతుంటుంది. వీరికీ రక్తం అవసరం. థలసీమియా, సికిల్‌ సెల్‌, ఎప్లాస్టిక్‌ ఎనీమియా, మైలోడిస్‌ప్లాస్టిక్‌ సిండ్రోమ్‌, పాంకోనీ అనీమియా వంటి జబ్బులతో బాధపడేవారిలో నాణ్యమైన రక్తం.. ముఖ్యంగా మంచి హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. ఇలాంటివారికి తరచూ.. నెల, రెండు నెలలకోసారి రక్తం మార్చాల్సి ఉంటుంది. మలంలో రక్తం పోవటం, మొలలు, పోషణ లోపం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారికీ కొన్నిసార్లు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి రావొచ్చు. రక్తం ఎక్కించే విషయంలో ప్రధానంగా రక్తం పరిమాణం, హిమోగ్లోబిన్‌ మోతాదులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లను పరిశీలిస్తారు.

పద్ధతిగా నిల్వ 

దానం చేశాక బ్లడ్‌ బ్యాంకు రిఫ్రిజిరేటర్‌లో రక్తం బ్యాగును విడిగా ఉంచుతారు. దీన్ని అన్‌స్క్రీన్‌డ్‌ రక్తం అంటారు. తర్వాత బ్యాగు గొట్టం నుంచి కొంత రక్తం తీసుకొని హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ, హెపటైటిస్‌ వైరస్‌ పరీక్షలు చేస్తారు. సుఖవ్యాధులను గుర్తించే వీడీఆర్‌ఎల్‌.. అలాగే మలేరియా పరాన్నజీవి పరీక్షలూ కూడా ముఖ్యమే. ఇవన్నీ రక్తం ద్వారా నేరుగా ఇతరులకు సంక్రమిస్తాయి. ఇలాంటి పరీక్షలు నెగెటివ్‌గా వస్తే ‘స్క్రీన్‌డ్‌ బ్లడ్‌’గా ముద్ర వేస్తారు. ఒక నంబరును కేటాయిస్తారు. బ్లడ్‌ గ్రూపు, సేకరించిన తేదీ, గడువునూ బ్యాగు మీద రాస్తారు. ఆ తర్వాత దీన్ని ప్రధాన రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుస్తారు. కణాలకు శక్తిని అందించేది కణ కేంద్రకమే (న్యూక్లియస్‌). చిత్రంగా ఎర్ర రక్తకణానికిది ఉండదు. మన శరీరంలో కణ కేంద్రకం లేని కణం ఇదొక్కటే. అయినా 120 రోజుల వరకు జీవించి ఉండటం విచిత్రం. ఇవి పెద్దమొత్తంలో గ్లూకోజును తీసుకుంటూ జీవిస్తాయి. అందువల్ల రక్తాన్ని సేకరించే బ్యాగులో తగినంత గ్లూకోజు ఉండేలా చూస్తారు. అలాగే రక్తం గడ్డకుండా చూసే సిట్రేట్‌, కొంత ప్రొటీన్‌ కూడా జతచేస్తారు. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకొని భద్రపరచిన రక్తం 35 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది. మనదగ్గర రక్తం కొరత ఎక్కువగా ఉండటం వల్ల చాలా చోట్ల 10 రోజుల్లోనే వాడేస్తుంటారు. 

ఎవరైనా సరే గానీ.. 

రక్తాన్ని 18-65 ఏళ్ల వయసువారు ఎవరైనా, ఎప్పుడైనా దానం చేయొచ్చు. ఒకసారి 350-400 మి.లీ. రక్తాన్ని సురక్షితంగా దానం చేయొచ్చు. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వచ్చు. రక్తదాన ప్రక్రియ తేలికైంది. పది నిమిషాల్లోనే ముగుస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం.
* దాత ఆరోగ్యంగా, శరీర సామర్థ్యం కలిగి ఉండాలి. బరువు 45 కిలోల కన్నా తక్కువ ఉండరాదు.
* వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వంటి సాంక్రమిక జబ్బులేవీ ఉండకూడదు.
* శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండాలి. నోట్లో థర్మామీటర్‌తో చూస్తే 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మించకూడదు.
* రక్తం ఇచ్చే ముందు రోజు మద్యం తాగి ఉండకూడదు. సిగరెట్ల విషయంలో అభ్యంతరం లేదు గానీ తాగకుండా ఉంటేనే మేలు.
* కొవిడ్‌ టీకాల వంటి ఎలాంటి టీకాలు తీసుకున్నా నాలుగు వారాల తర్వాతే రక్తం ఇవ్వాలి.
* హిమోగ్లోబిన్‌ 12.5 గ్రా/డీఎల్‌ కన్నా ఎక్కువగా ఉండాలి.
* అధిక రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్‌, మూర్ఛ, కిడ్నీ జబ్బులు, మధుమేహం వంటి జబ్బులతో బాధపడేవారు రక్తదానం చేయరాదు.
* పచ్చబొట్టు పొడిపించుకోవటం, చెవులు కుట్టించుకోవటం వంటివి చేస్తే ఆరు నెలల వరకు రక్తదానం చేయొద్దు.
* గర్భస్రావమైన మహిళలు ఆరు నెలల వరకు రక్తం ఇవ్వద్దు.\

రక్తదానం చేసే రోజున 

రక్త దానం చేసే రోజు ఉదయం అల్పాహారం తినాలి. తగినంత నీరు తాగాలి. దీంతో రక్తం పరిమాణం బాగుంటుంది. రక్తాన్ని ఇచ్చాక 15-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. పండ్ల రసాలు తాగాలి. పండ్లు కూడా తినొచ్చు. వీలుంటే కూల్‌ డ్రింకు తాగొచ్చు. రక్తపోటు పరీక్షించాక ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆ పూట విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లోనే ఉండాలి. తగినంత నీరు తాగాలి. మంచి ఆహారం తినాలి. మర్నాటి నుంచి యథావిధిగా పనులు చేసుకోవచ్చు. రక్తదానంతో దుష్ప్రభావాలేవీ ఉండవు. కొందరికి తల తిప్పినట్టు అనిపించొచ్చు గానీ చాలావరకిది మానసిక భావనే. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తినా తేలికగానే నియంత్రించొచ్చు. రక్తం తీసుకునేటప్పుడు సూది పక్కలకు గుచ్చుకుపోతే మాత్రం అక్కడ రక్తం గడ్డకట్టే ప్రమాదముంది.

గ్రూపుల వారీగా.. 

రక్తాన్ని ప్రధానంగా ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులుగా విభజించొచ్చు. వీటిల్లోనూ ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ను బట్టి పాజిటివ్‌, నెగెటివ్‌ రకాలుంటాయి. ఇలా మొత్తమ్మీద 8 రకాల గ్రూపులు ఉంటాయి.
* ఏ గ్రూపు రక్తాన్ని ఏ, ఓ గ్రూపు వారికే ఇస్తారు.
*  బి గ్రూపు రక్తాన్ని బి, ఓ గ్రూపు వారికే ఇస్తారు.
* ఏబీ గ్రూపు రక్తాన్ని ఏబీ, ఓ గ్రూపు వారికే ఇస్తారు.
*  ఓ గ్రూపు రక్తాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఓ నెగెటివ్‌ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు.
* ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ విషయానికి వస్తే- పాజిటివ్‌ రక్తాన్ని పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ గ్రూపు వారికి ఇవ్వచ్చు. కానీ నెగెటివ్‌ రక్తం గలవారికి నెగెటివ్‌ రక్తాన్ని మాత్రమే ఇవ్వాలి.
* ప్రస్తుతం రక్తం గ్రూప్‌ను త్వరగా తెలుసుకునే పద్ధతులు అందుబాటులోకి రావటంతో ఆయా గ్రూపు రక్తాలను ఎక్కించటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
అరుదైన రక్తం గలవారైతే బాంబే బ్లడ్‌ గ్రూప్‌, ఓ ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ రక్తం గ్రూపులు అరుదు. ఇలాంటి రక్తం గలవారు రక్తదానం చేయకపోవటమే మంచిది. అవసరమైనప్పుడు దానం చేయటానికి అందుబాటులో ఉంటే చాలు.


రక్త సంబంధికుల నుంచి వద్దు! 

‘నా రక్తం తీసుకోండి’ అని సినిమాల్లో తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుడు ముందుకు రావటం చూస్తుంటాం. నిజానికి సన్నిహిత రక్త సంబంధికుల రక్తం ఎక్కించకపోవటమే మంచిది. మనకు తల్లిదండ్రుల నుంచి సగం డీఎన్‌ఏ సంక్రమిస్తుంది. అలాగే తల్లిదండ్రుల్లోనూ మనలోని సగం డీఎన్‌ఏ ఉంటుంది. అందువల్ల సగం డీఎన్‌ఏ సరిపోలుతుంది. ఈ రక్తంలోని లింఫ్‌ కణాలను శరీరం సొంతమైనవనే భావిస్తుంది. ఇవి రక్తం తీసుకున్నవారి ఎముకమజ్జలోకి చేరుకొని, వృద్ధి చెందుతాయి. 20, 25 రోజుల తర్వాత ఎముకమజ్జను దెబ్బతీసి ‘ట్రాన్స్‌ఫ్యూజన్‌ అసోసియేటెడ్‌ గ్రాఫ్ట్‌ వర్సస్‌ హోస్ట్‌ డిసీజ్‌’కు దారితీయొచ్చు. ఇది అరుదే అయినా.. ప్రాణాల మీదికి తెస్తుంది. దీనికి చికిత్స లేదు. ఒకవేళ సన్నిహిత రక్త సంబంధికుల రక్తం మరీ అవసరమైతే రక్తం బ్యాగును 20 డిగ్రీల రేడియేషన్‌ ప్రభావానికి గురిచేయాల్సి ఉంటుంది (ఇర్రాడియేటెడ్‌ బ్లడ్‌ ప్రొడక్ట్‌). ఇలాంటి రక్తం లింఫోమా బాధితులకు, ఎముకమజ్జ మార్పిడి, గుండె శస్త్రచికిత్స అవసరమైనవారికి, కొందరు నవజాత శిశువులకు కూడా ఉపయోగపడుతుంది.


 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని