మూడో నెలలో బ్లీడింగ్‌?

గర్భం ధరించిన తర్వాత రుతుస్రావం (బ్లీడింగ్‌) కావటం మంచిది కాదు. దీనర్థం గర్భధారణ ప్రక్రియ సరైన పద్ధతిలో సాగటం లేదనే. అలాగని అతిగా భయపడాల్సిన అవసరమూ లేదు. గర్భధారణ తర్వాత అప్పుడప్పుడు రుతుస్రావం కనిపించటం తరచూ చూసేదే.

Updated : 28 Jun 2022 04:54 IST

సమస్య- సలహా

సమస్య: నాకు 24 ఏళ్లు. గర్భం ధరించి 3 నెలలు. అప్పుడప్పుడు కొద్దిగా రుతుస్రావం అవుతోంది. దీనికి కారణమేంటి? బిడ్డకు ఏమైనా ప్రమాదమా?

- ఒక పాఠకురాలు

సలహా: గర్భం ధరించిన తర్వాత రుతుస్రావం (బ్లీడింగ్‌) కావటం మంచిది కాదు. దీనర్థం గర్భధారణ ప్రక్రియ సరైన పద్ధతిలో సాగటం లేదనే. అలాగని అతిగా భయపడాల్సిన అవసరమూ లేదు. గర్భధారణ తర్వాత అప్పుడప్పుడు రుతుస్రావం కనిపించటం తరచూ చూసేదే. తొలి త్రైమాసికంలో సుమారు 15-25% మందిలో బ్లీడింగ్‌ అవటం గమనిస్తుంటాం. చాలామందిలో ఇదేమీ పెద్ద ప్రమాదకరం కాదు. దానంతటదే తగ్గిపోతుంటుంది. అయితే బ్లీడింగ్‌కు కారణమేంటన్నది తెలుసుకోవటం ముఖ్యం. కొన్ని కారణాలను సరిచేయొచ్చు. కొన్నింటిని సరి చేయలేం. ఫలదీకరణ చెందిన అండం గర్భసంచి గోడలో కుదురుకునే సమయంలో తొలి రెండు వారాల్లో కొందరికి బ్లీడింగ్‌ కావొచ్చు. గర్భధారణ తొలిదశలో గర్భాశయ ముఖ ద్వారంలో రక్తనాళాలు పెద్ద సంఖ్యలో వృద్ధి చెందుతుంటాయి. అందువల్ల తేలికగా రక్త స్రావమయ్యే అవకాశముంది. హార్మోన్ల సమతుల్యత అస్తవ్యస్తం కావటం వంటి మామూలు సమస్యలతోనూ రుతుస్రావం కావొచ్చు. ఏదేమైనా మీరు గైనకాలజిస్టును సంప్రదించి, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవటం ఉత్తమం. దీంతో గర్భసంచిలోనే గర్భధారణ జరిగిందా? ఫలోపియన్‌ గొట్టాల్లోనా? అనేవి తెలుస్తాయి. సాధారణంగా ఫలోపియన్‌ గొట్టంలో గర్భధారణ జరిగినప్పుడు బ్లీడింగ్‌తోనే బయటపడుతుంటుంది. పిండం సైజు, గుండె కొట్టుకునే వేగం, గర్భసంచిలో ఎక్కడైనా రక్తం గడ్డలు ఉండటం వంటివీ స్కానింగ్‌లో తెలుస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉండి, గుండె కొట్టుకునే వేగం బాగుంటే ఏమీ కాదనే అనుకోవచ్చు. బాధపడాల్సిన పనిలేదు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే హార్మోన్ల మాత్రలు సూచిస్తారు. ఒకవేళ పాలిప్స్‌, గర్భాశయ ముఖద్వారంలో ఏదైనా పెరగటం వంటివి కారణమవుతుంటే సరిచేస్తారు. గమనించాల్సిన విషయం ఏంటంటే- రక్తస్రావం ఆగటానికి అనవసరంగా మందులు వేసుకోకపోవటం. ఇవి కొన్నిసార్లు బిడ్డకు హాని చేయొచ్చు. మందులతో బయటికి రక్తస్రావం కావటం ఆగిపోయినా లోపల సమస్య అలాగే ఉండొచ్చు. కాబట్టి మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్లీడింగ్‌ మరీ ఎక్కువగా అవటం, గడ్డలు గడ్డలుగా రక్తం పడటం, తీవ్రమైన నొప్పి రావటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వేంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


డా।। ఎ.ప్రణతీ రెడ్డి

సీనియర్‌ గైనకాలజిస్ట్‌


మీ ఆరోగ్య సమస్యలు, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని