Updated : 05 Jul 2022 06:01 IST

రెటీనా ఉబ్బుకు సమర్థ చికిత్స

సలే కన్ను సున్నితం. ఇక అందులోని రెటీనా మధ్యభాగం దెబ్బతింటే? చూపు మొత్తానికే ఎసరు వస్తుంది. మాక్యులర్‌ ఎడీమా అలాంటి జబ్భే మన కంటి వెనకాల కాంతిని గ్రహించే రెటీనా పొర మధ్యలో మాక్యులా అనే భాగముంటుంది. చూపు స్పష్టంగా, నేరుగా ఉన్న దృశ్యాలు కనిపించేలా చేసేది ఇదే. కొన్నిసార్లు దీనిలో ద్రవం పోగుపడి, ఉబ్బుతుంది. మందంగా తయారవుతుంది. ఇది రక్తనాళాలు లీక్‌ అవటానికీ దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే చూపు తగ్గటం, చివరికి చూపు పోవటమూ సంభవించొచ్చు. మాక్యులా ఉబ్బటానికి ఒక కారణం రెటీనా సిరల్లో అడ్డంకులు తలెత్తటం. వీటికి చికిత్స చేస్తే దీర్ఘకాలం మంచి ఫలితం ఉంటున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రక్త ప్రసరణ అస్తవ్యస్తమైనప్పుడు వ్యాస్కులర్‌ ఎండోథిలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్లు (వీఈజీఎఫ్స్‌) విడుదలవుతుంటాయి. ఇవి మ్యాక్యులా ఉబ్బేలా చేస్తాయి. అందుకే వీఈజీఎఫ్స్‌ను అడ్డుకునే అఫ్లిబర్‌సెప్ట్‌, బెవాసిజుమాబ్‌ మందులతో పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. నెలకు ఒకసారి చొప్పున, ఆరు నెలల పాటు వీటిల్లో ఒక మందును ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చారు. ఏడాది తర్వాత వారి డాక్టర్ల విచక్షణ మేరకు చికిత్స కొనసాగించాలని సూచించారు. ఐదేళ్ల తర్వాత వీరిలో చాలామందిలో చూపు స్పష్టత మెరుగవటం విశేషం. రెటీనా సిరల్లో అడ్డంకులు తలెత్తినవారు రోజువారీ ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఈ అధ్యయనం ఎన్నో విషయాలను నేర్పించిందని పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఇన్‌గ్రిడ్‌ యు. స్కాట్‌ చెబుతున్నారు. వీలైనంత వరకు చూపును కాపాడుకోవటానికి ఈ జబ్బు తీరుతెన్నులను పరిశీలిస్తుండటం, ఆయా వ్యక్తులకు అనుగుణమైన చికిత్సను అందించటం ఎంత ముఖ్యమో కూడా ఇది నొక్కి చెబుతోందని అంటున్నారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని