logo

స్మార్ట్‌ రాష్ట్రమే సర్కారు లక్ష్యం: ముఖ్యమంత్రి

తమిళనాడును స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ తరఫున ‘ముదలీట్టాళర్‌ ముదల్‌ ముగవరి-తమిళనాడు’ (పెట్టుబడిదారుల తొలి చిరునామా-తమిళనాడు) పేరుతో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం సదస్సు జరిగింది.

Updated : 05 Jul 2022 06:36 IST


సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడును స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ తరఫున ‘ముదలీట్టాళర్‌ ముదల్‌ ముగవరి-తమిళనాడు’ (పెట్టుబడిదారుల తొలి చిరునామా-తమిళనాడు) పేరుతో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో రూ.1,25,244 కోట్ల పెట్టుబడులతో 60 ప్రాజెక్టులకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. సదస్సులో స్టాలిన్‌ మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనకు తగిన ఉత్తమ రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానాన్ని పొందడం చరిత్రాత్మక విజయమన్నారు. 13వ స్థానం నుంచి ఈ స్థానానికి చేరామని, డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రిగా తంగం తెన్నరసును ఎంపిక చేసిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టారని అభినందించారు. ఆరోసారి డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రపంచ నలుమూలలకు రాష్ట్ర ఉత్పత్తులు చేరాలన్నదే ఈ సదస్సు లక్ష్యాల్లో ఒకటన్నారు. ప్రభుత్వంపై అపార నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం హర్షణీయమని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సాంకేతిక సేవలను ఒకే గొడుగు కింద అందించడానికి అనువుగా టీఎన్‌- టెక్‌ఎక్స్‌పీరియన్స్‌ ప్రాజెక్టు వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అంకుర సంస్థలకు ఓ ప్లాట్‌ఫారం ఏర్పాటు చేసేలా టీఎన్‌ పీట్చ్‌ఫెస్ట్‌నూ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ప్రపంచానికి ఓ ఉదాహరణగా ఉండేలా తమిళనాడును స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చడమే సర్కారు లక్ష్యమని వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి మార్గాలనూ రూపొందించుకుంటేనే పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేకత చూపగలమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.20 లక్షల కోట్ల విలువైన 192 అవగాహన ఒప్పందాలు ప్రభుత్వం కుదుర్చుకుందని పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి తంగం తెన్నరసు, ఆ శాఖ అదనపు ప్రధానకార్యదర్శి కృష్ణన్‌, మార్గదర్శక సంస్థ ఎండీ, సీఈవో పూజా కులకర్ణి, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జుడిత్‌ రవిన్‌, టాటా పవర్‌ ఎండీ, సీఈవో ప్రవీణ్‌ సిన్హా, ఏసీఎంఈ గ్రూపు వ్యవస్థాపకుడు, ఎండీ మనోజ్‌కుమార్‌ ఉపాధ్యాయ్‌, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులు పాల్గొన్నారు.

టాన్‌సిమ్‌, ఎంఎస్‌ఎంఈలకు అభినందనలు

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌-2021లో అగ్రస్థానం పొందినందుకు తమిళనాడు స్టార్టప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (టాన్‌సిమ్‌), సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అందులో... రాష్ట్ర స్టార్టప్‌ ఛాంపియన్‌ పురస్కారం పొందినందుకు ఐఏఎస్‌ అధికారులు ఎస్‌.నాగరాజన్‌, సజీవనలకు అభినందనలు తెలిపారు. అంకుర పరిస్థితులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో భవిష్యత్తులోనూ ఉత్తమ ప్రదర్శన కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.

శ్రీలంక చెర నుంచి జాలర్లను విడిపించాలని లేఖ

చెన్నై, న్యూస్‌టుడే: శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన తమిళ జాలర్లను విడిపించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు ఓ లేఖ రాశారు. అందులో... 61 రోజుల నిషేధకాలం ముగిసి జూన్‌ 15న చేపల వేట ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో 12 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని తెలిపారు. వారిని విడిపించడానికి త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రానికి చెందిన ఏడుగురు, పుదుచ్చేరికి చెందిన ఐదుగురు జాలర్లు ఆదివారం అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

ఉదయనిధి కృతజ్ఞతలు

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే యువజన విభాగ కార్యదర్శిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అధ్యక్షుడైన స్టాలిన్‌కు ఆయన తనయుడు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. అందులో... బాధ్యతాయుతమైన పదవిలో నాలుగో ఏడాది ప్రయాణం ప్రారంభించానని తెలిపారు. నమ్మకంతో గురుతర బాధ్యత అప్పగించిన పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌, ప్రధానకార్యదర్శి దురైమురుగన్‌ తదితరులకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. తనతో పాటు కృషి చేస్తున్న యువజన విభాగం, తనను ఆదరిస్తున్న ప్రజలకూ కృతజ్ఞతలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని