Updated : 16 Aug 2022 09:19 IST

పేగుల్లో బ్యాక్టీరియా చెడ్డగా మారేదెలా?

పేగుల్లోని బ్యాక్టీరియా మంచే కాదు, చెడూ చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్యలు, పేగుల్లో పూత, జీవక్రియ రుగ్మతలు, కుంగుబాటు వంటి జబ్బులనూ తెచ్చిపెడుతుంది. ఇలాంటి దుష్ప్రభావాలకు బ్యాక్టీరియా పేగులను దాటుకొని రావటం (లీకీ గట్‌) కారణమని భావిస్తుంటారు. కానీ జబ్బుల ఆనవాళ్లేమీ కనిపించనీయకుండా ఆరోగ్యవంతుల్లో ఈ హానికర బ్యాక్టీరియా ఎలా మనగలుగుతుందనేది అంతు చిక్కని ప్రశ్న. తాజాగా యేల్‌ యూనివర్సిటీ పరిశోధకులు దీని గుట్టును ఛేదించారు. పేగుల్లోని బ్యాక్టీరియా క్రమంగా రెండు వేర్వేరు రకాలుగా మారుతున్నట్టు గుర్తించారు. ఒక రకమేమో పాత బ్యాక్టీరియా మాదిరిగానే ప్రవర్తిస్తుండగా.. మరో రకంలో డీఎన్‌ఏ మారిపోతున్నట్టు కనుగొన్నారు. దీంతో ఇది పేగుల్లోని జిగురు పొరల్లో జీవించే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. అంతేకాదు.. పేగుల్లోంచి బయటపడ్డాక లింఫ్‌ గ్రంథులు, కాలేయంలోనూ మనగలుగుతోంది. పైగా ఇది తాత్కాలికంగానైనా రోగనిరోధక వ్యవస్థను తప్పించుకొని అవయవాల్లో జీవిస్తుండటం గమనార్హం. క్రమంగా వాపు ప్రక్రియను ప్రేరేపించి స్వీయ రోగనిరోధక సమస్యలను తెచ్చిపెడుతోంది. వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్నప్పటికీ కొందరికి ఎన్నడూ జబ్బులు రాకపోవటానికి, కొందరికి వయసు మీద పడుతున్నకొద్దీ జబ్బులు తలెత్తటానికి కొంతవరకిది కారణం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధులు కలగజేసేలా బ్యాక్టీరియా మారటానికి పేగుల్లోని వాతావరణమూ దోహదం చేస్తుంది. ఉదాహరణకు- మంచి ఆహారం తినేవారిలో రకరకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. వీటి మధ్య పోరాటంలో హానికారక బ్యాక్టీరియా తగ్గుతుంది. పేగుల్లోంచి బయటపడే అవకాశమూ సన్నగిల్లుతుంది. అదే తక్కువ వైవిధ్యం గల బ్యాక్టీరియా ఉన్నట్టయితే హానికారకంగా పరిణమించే వాటి సంఖ్య పెరిగే ప్రమాదముంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని