కుంగుబాటుతో ‘ఢీ’

మనం శారీరకంగా, మానసికంగా బాగుండటానికి విటమిన్‌ డి తగు మోతాదులో ఉండటం అవసరం. ఇది లోపిస్తే కుంగుబాటు తలెత్తే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుంగుబాటుతో బాధపడేవారికీ విటమిన్‌ డి మేలు చేస్తున్నట్టు, ఇది నిరాశ, నిస్పృహ, విచారం వంటి లక్షణాలు

Published : 23 Aug 2022 00:54 IST

మనం శారీరకంగా, మానసికంగా బాగుండటానికి విటమిన్‌ డి తగు మోతాదులో ఉండటం అవసరం. ఇది లోపిస్తే కుంగుబాటు తలెత్తే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుంగుబాటుతో బాధపడేవారికీ విటమిన్‌ డి మేలు చేస్తున్నట్టు, ఇది నిరాశ, నిస్పృహ, విచారం వంటి లక్షణాలు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. కుంగుబాటు లక్షణాలు ఒక మాదిరిగా ఉన్నా, తీవ్రంగా ఉన్నా విటమిన్‌ డితో తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. గతంలో నిర్వహించిన 41 అధ్యయనాలను విశ్లేషించి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. ఒంట్లో క్యాల్షియం, ఫాస్ఫేట్‌ మోతాదులను నియంత్రించటంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థలో వివిధ పనుల్లోనూ విటమిన్‌ డి పాలు పంచుకుంటుంది. ఇది మెదడులో రసాయనాల సమతుల్యతనూ నియంత్రిస్తున్నట్టు జంతువుల మీద చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణంగా కుంగుబాటు తగ్గటానికి యాంటీడిప్రెసెంట్‌ మందులు ఇస్తుంటారు. అయితే ఇవి అందరిలో సమర్థంగా పనిచెయ్యవు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల కోసం పరిశోధకులు చాలాకాలంగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో విటమిన్‌ డి కుంగుబాటుకు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడగలదని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తుండటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని