మామోగ్రామ్‌ 40ల్లోనే

రొమ్ముక్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సమర్థంగా చికిత్స చేయొచ్చు. ఎక్కువకాలం జీవించేలా చూడొచ్చు. రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లను ముందుగా గుర్తించటానికి మామోగ్రామ్‌ పరీక్షలు (స్క్రీనింగ్‌) ఎంతగానో ఉపయోగపడతాయి.

Published : 23 Aug 2022 00:54 IST

రొమ్ముక్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సమర్థంగా చికిత్స చేయొచ్చు. ఎక్కువకాలం జీవించేలా చూడొచ్చు. రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లను ముందుగా గుర్తించటానికి మామోగ్రామ్‌ పరీక్షలు (స్క్రీనింగ్‌) ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ముందుగానే ఆరంభించటం మంచిదని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటావా అధ్యయనం పేర్కొంటోంది. నలబైల్లో ఏటా మామోగ్రామ్‌ పరీక్షలు ఆరంభించిన ప్రాంతాల్లో తీవ్ర రొమ్ముక్యాన్సర్‌ తక్కువగా బయటపడుతున్నట్టు తేలింది. నలబైల్లో ఉన్నవారిలో 2, 3, 4 దశల రొమ్ముక్యాన్సర్‌.. యాబైల్లో ఉన్నవారిలో 2, 3 దశల క్యాన్సర్‌ తక్కువగా బయటపడినట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే ముందుగానే మామోగ్రామ్‌ పరీక్షలు చేయటం వల్ల చిన్న వయసువారిలోనే కాదు, పెద్ద వయసువారిలోనూ మంచి ఫలితం కనిపిస్తోందన్నమాట. క్యాన్సర్‌ తీవ్ర దశలో బయటపడితే మరింత ఉద్ధృతంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఫలితమూ అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. రొమ్ముక్యాన్సర్‌ ముప్పు సగటుగా ఉన్నవారికి 40 ఏళ్ల వయసులోనే మామోగ్రామ్‌ పరీక్షలు ఆరంభించాలంటూ అమెరికా నేషనల్‌ కాంప్రెహెన్సివ్‌ క్యాన్సర్‌ నెట్‌వర్క్‌ ఇటీవల మార్గదర్శకాలను సవరించింది. తాజా అధ్యయన ఫలితాలు దీన్ని బలపరుస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని