Vitamin C: విటమిన్‌ సితో జలుబు తగ్గుతుందా?

తరచూ జలుబుతో బాధపడేవారిలో కొందరు విటమిన్‌ సి మాత్రలు వేసుకుంటుంటారు. ఇవి జలుబు వైరస్‌లను కట్టడి చేస్తాయని భావిస్తుంటారు. విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచే మాట నిజమే. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌ కూడా. అంతమాత్రాన జలుబు వైరస్‌ల పని పడుతుందని అనుకోవటానికి లేదు. 

Updated : 25 Oct 2022 09:18 IST

రచూ జలుబుతో బాధపడేవారిలో కొందరు విటమిన్‌ సి మాత్రలు వేసుకుంటుంటారు. ఇవి జలుబు వైరస్‌లను కట్టడి చేస్తాయని భావిస్తుంటారు. విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచే మాట నిజమే. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌ కూడా. అంతమాత్రాన జలుబు వైరస్‌ల పని పడుతుందని అనుకోవటానికి లేదు. ఈ వైరస్‌లను అడ్డుకోవటంలో, జలుబును తగ్గించటంలో దీని ప్రభావం అంతంతేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రోజుకు 200 మి.గ్రా. అంతకన్నా ఎక్కువ మోతాదులో విటమిన్‌ సి తీసుకోవటం ద్వారా జలుబు బారినపడటం, దీని తీవ్రత, వేధించే కాలం తగ్గుతాయా? అనేది గుర్తించటానికి గతంలో పరిశోధకులు పెద్ద అధ్యయనమే నిర్వహించారు.

అరవై ఏళ్ల వైద్య పరిశోధనను సమీక్షించిన తర్వాత తేల్చిందేంటంటే- జలుబు మొదలయ్యాక విటమిన్‌ సి మాత్రలను మొదలెట్టినవారిలో జలుబు తీవ్రత, ఇది వేధించే సమయంలో ఎలాంటి తేడా లేదనే. రోజూ విటమిన్‌ మాత్రలు వేసుకున్నవారిలోనైతే జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతున్నట్టు బయటపడింది. విటమిన్‌ సి మాత్రలు జలుబును నివారించటం లేదని మరో అధ్యయనంలో తేలింది. కాకపోతే కొందరిలో లక్షణాల తీవ్రత కొద్దిగా తగ్గినట్టు గుర్తించారు. ఎక్కువ దూరాలు పరుగెత్తే క్రీడాకారుల వంటి దేహ దారుఢ్యం గలవారిలో మాత్రం రోజూ విటమన్‌ సి మాత్రల వేసుకుంటే జలుబు వచ్చే అవకాశం సగం వరకు తగ్గుతుండటం గమనార్హం. ఏతావాతా జలుబు నివారణ, చికిత్సల్లో ఈ మాత్రలు అంతగా ఉపయోగపడటం లేదనే ఇవన్నీ సూచిస్తున్నాయి.

నిజానికి మాత్రల కన్నా ఆహారం ద్వారా విటమిన్‌ సి లభించేలా చూసుకోవటమే మంచిది. మనకు రోజుకు 65 మి.గ్రా. నుంచి 100 మి.గ్రా. విటమిన్‌ సి అవసరం. దీని మోతాదు 2,000 మి.గ్రా. కన్నా మించితే వికారం, వాంతి, ఛాతీలో మంట, కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. బత్తాయి, నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, టమోటా, క్యాబేజీ, కాలిఫ్లవర్‌, బంగాళాదుంప వాటితో విటమిన్‌ సి దండిగా లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే విటమిన్‌ను శరీరం ఇంకాస్త బాగా గ్రహించుకుంటుంది కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని