పాదాలు చల్లనేల?

కొందరికి సాక్స్‌ వేసుకున్నా, కాళ్ల మీద దుప్పటి కప్పుకొన్నా పాదాలు చల్లగా అనిపిస్తుంటాయి. సాధారణంగా శరీరం ఉష్ణోగ్రతకు స్పందించటంలో భాగంగా పాదాలు చల్లగా అవుతుంటాయి. ఇదే కాదు.. కొన్ని జబ్బులూ దీనికి చేయొచ్చు. కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తినప్పుడు పాదాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది.

Published : 04 Oct 2022 01:05 IST

కొందరికి సాక్స్‌ వేసుకున్నా, కాళ్ల మీద దుప్పటి కప్పుకొన్నా పాదాలు చల్లగా అనిపిస్తుంటాయి. సాధారణంగా శరీరం ఉష్ణోగ్రతకు స్పందించటంలో భాగంగా పాదాలు చల్లగా అవుతుంటాయి. ఇదే కాదు.. కొన్ని జబ్బులూ దీనికి చేయొచ్చు. కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తినప్పుడు పాదాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో పాదాలు చల్లగా అనిపించొచ్చు. మధుమేహం, పొగతాగటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, వృద్ధాప్యం వంటివి రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తటానికి దోహదం చేస్తాయి. మధుమేహం మూలంగా నాడులు దెబ్బతిన్నా పాదాలు చల్లగా ఉన్న భావన కలుగుతుంది. మనం తిన్న ఆహారాన్ని, పీల్చుకున్న ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే హార్మోన్లను ఉత్పత్తి చేసే థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోయినా సమస్య తలెత్తొచ్చు. ఈ హార్మోన్ల మోతాదులు తగ్గితే పాదాలతో పాటు శరీరమంతా చల్లగా అనిపిస్తుంటుంది. మన ఊపిరితిత్తుల నుంచి అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గినా, ఇవి తగినంత ఆరోగ్యంగా లేకపోయినా (రక్తహీనత) సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. ఒత్తిడీ తక్కువదేమీ కాదు. దీనికి గురైనప్పుడు శరీరం కాళ్లు, చేతుల నుంచి కీలక అవయవాలకు రక్తాన్ని మళ్లిస్తుంది. దీంతోనూ పాదాలు చల్లగా అనిపించొచ్చు. గుండె వైఫల్యమూ దీనికి కారణం కావొచ్చు. కారణమేంటన్నది గుర్తించి, చికిత్స తీసుకుంటే సమస్యా నయమైపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని