కుంగుబాటా? టెస్టోస్టిరాన్‌ లోపమా?

శృంగారం మీద ఆసక్తి తగ్గటం, బలహీనత, నిస్సత్తువ వంటివి తలెత్తితే వయసుతో పాటు వచ్చిన మార్పులుగానే భావిస్తుంటారు. చాలామంది వీటిని కుంగుబాటు లక్షణాలనీ అనుకుంటుంటారు. అయితే మగవారిలో వీటితో పాటు విచారం, బాధ వంటివీ కనిపిస్తే పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టిరాన్‌ మోతాదులు తగ్గాయేమో కూడా చూసుకోవటం మంచిది.

Published : 18 Oct 2022 01:03 IST

శృంగారం మీద ఆసక్తి తగ్గటం, బలహీనత, నిస్సత్తువ వంటివి తలెత్తితే వయసుతో పాటు వచ్చిన మార్పులుగానే భావిస్తుంటారు. చాలామంది వీటిని కుంగుబాటు లక్షణాలనీ అనుకుంటుంటారు. అయితే మగవారిలో వీటితో పాటు విచారం, బాధ వంటివీ కనిపిస్తే పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టిరాన్‌ మోతాదులు తగ్గాయేమో కూడా చూసుకోవటం మంచిది. ఎందుకంటే దీని మోతాదుల్లో మార్పులు మూడ్‌ను సైతం ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. టెస్టోస్టిరాన్‌ మోతాదులు తగ్గటం వల్ల తలెత్తే లక్షణాలు, కుంగుబాటు లక్షణాలు చాలావరకు కలిసిపోయి ఉంటుండటం గమనార్హం. చిరాకు, మూడ్‌ మారిపోవటం, శృంగారాసక్తి తగ్గటం, నిస్సత్తువ, హుషారు లేకపోవటం, నలుగురితో కలవలేకపోవటం, ఆందోళన, ఏకాగ్రత కుదరకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం వంటివి రెండింటిలోనూ కనిపిస్తుంటాయి. దీని మూలంగానే కొన్నిసార్లు టెస్టోస్టిరాన్‌ తగ్గటాన్ని కుంగుబాటుగానూ పొరపడుతుంటారు. కాబట్టి మగవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టోస్టిరాన్‌ లోపించి ఉండొచ్చనీ అనుమానించాలి. ఒకవేళ తగ్గినట్టు తేలితే నిర్లక్ష్యం చేయరాదు. ముఖ్యంగా హఠాత్తుగా బరువు పెరగటం, శృంగారాసక్తి లేదా శృంగార సామర్థ్యం తగ్గటం, భావోద్వేగ లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు టెస్టోస్టిరాన్‌ మోతాదులు పెరగటానికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ ఈ హార్మోన్‌ మోతాదులు తగ్గిపోతుంటాయి. వయసు ఒక్కటే కాదు.. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గటం లేదా పెరగటం వంటివీ వీటి హెచ్చుతగ్గులకు దోహదం చేయొచ్చు. టెస్టోస్టిరాన్‌ తగ్గితే శారీరకంగానూ మార్పులు సంభవిస్తుంటాయి. కండరాల మోతాదు తగ్గటం, రొమ్ము కణజాలం పెరగటం, బలం క్షీణించటం, హఠాత్తుగా బరువు పెరగటం, స్తంభన లోపం వంటి సమస్యలూ ఎదురవుతాయి. దీనికి కుంగుబాటు కూడా తోడైనట్టయితే ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. శృంగారాసక్తి, శృంగార సామర్థ్యం గణనీయంగా పడిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని