Hair: తొలిసారిగా ల్యాబ్‌లో వెంట్రుకల కుదుళ్ల తయారీ!

వెంట్రుకలు ఊడిపోయే సమస్యతో బాధపడేవారికి శుభవార్త. మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరిపక్వ వెంట్రుకల కుదుళ్లను వృద్ధి చేశారు మరి. ఎలుకల పిండంలోని చర్మ కణాలను మార్చటం ద్వారా దీన్ని సాధించారు.

Updated : 01 Nov 2022 09:53 IST

వెంట్రుకలు ఊడిపోయే సమస్యతో బాధపడేవారికి శుభవార్త. మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరిపక్వ వెంట్రుకల కుదుళ్లను వృద్ధి చేశారు మరి. ఎలుకల పిండంలోని చర్మ కణాలను మార్చటం ద్వారా దీన్ని సాధించారు. ముందుగా చర్మ కణాలను ప్రత్యేకమైన జిగరుద్రవంలో పెట్టారు. దీనిలోని వృద్ధి కారకాలు, ప్రేరేపకాలు, సంకేత మార్గాల నిరోధకాల వంటి వాటి సాయంతో చర్మ కణాలు కుదుళ్లుగా మారాయి. ఇవి 30 రోజుల వరకు 3 మిల్లీమీటర్ల మేరకు పెరగటం విశేషం.

నిజానికి వెంట్రుకల కుదుళ్లను కృత్రిమంగా పుట్టించటం చాలా కష్టమైన వ్యవహారం. వీటికి వివిధ రకాల కణాలు, పోషకాలు కావాలి. శరీరం లోపల ఉన్నప్పటితో పోలిస్తే బయట ఉన్నప్పుడు వీటి అవసరాలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా క్షీరదాల్లో పిండస్థ దశలో చర్మకణాలు, అనుసంధాన కణజాలం మధ్య జరిగే చర్యల ఫలితంగా వెంట్రుకల కుదుళ్లు ఏర్పడతాయి.

అందుకే ఈ చర్యలను మరింత బాగా అర్థం చేసుకోవటానికి జపాన్‌లోని యోకోహామా నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు కుదుళ్ల ఆర్గనాయిడ్ల (అవయవాల సూక్ష్మ, సరళ రూపాలు) మీద అధ్యయనం చేశారు. వీటి ఆకృతిని నియంత్రించటం ద్వారా కుదుళ్ల వృద్ధి వేగాన్ని పెంపొందించారు. ఇప్పుడు మనుషుల కణాలతోనూ ఇలాంటి ప్రయోగమే చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది సఫలమైతే వెంట్రుకలు రాలే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలదని ఆశిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు