Updated : 22 Nov 2022 08:01 IST

Diabetes: శృంగారానికి మధు శాపం!

మధుమేహం దీర్ఘకాలంగా నియంత్రణలో లేనివారికి గుండె జబ్బులు, నాడులు దెబ్బతినటం వంటి సమస్యలెన్నో చుట్టుముడుతుంటాయి. అంతేనా? మగవారిలో, ఆడవారిలో శృంగార సమస్యలనూ తెచ్చిపెడతాయి.

ధుమేహం మూలంగా మగవారిలో టెస్టోస్టీరాన్‌ మోతాదులు తగ్గుతాయి. శృంగారం మీద ఆసక్తి, ఉత్సాహం సన్నగిల్లుతాయి. కుంగుబాటు, ఆందోళన, నిస్సత్తువ, బరువు పెరగటం, తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు, స్తంభన లోపం, సంతాన సామర్థ్యం తగ్గటం వంటివీ పొడసూపుతాయి. ఇక ఆడవారిలో శారీరకంగా, మానసికంగానూ సమస్యలు మొదలవుతాయి. శృంగార వాంఛ లోపించటం, యోని పొడిబారటం, సంభోగ సమయంలో నొప్పి, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటివి వేధిస్తుంటాయి. మామూలు వారితో పోలిస్తే అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓఎస్‌) గల యువతుల్లో మధుమేహం 10 రెట్లు ఎక్కువ! పీసీఓఎస్‌ బారినపడ్డ వారిలో కణాలు ఇన్సులిన్‌ను గ్రహించక పోవటం, దీంతో రక్తంలో ఇన్సులిన్‌ మోతాదు పెరగటం గర్భధారణకు విఘాతం కలిగిస్తుంటాయి. నెలసరి సమయంలో అండం విడుదల కాకుండా అడ్డుకుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇలాంటి దుష్ప్రభావాలను అధిగమించొచ్చు.

* క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ గ్లూకోజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవటానికి వెనకాడొద్దు.
* ఆకుకూరలు, కూరగాయలు, క్యారట్లు, చిక్కుళ్లు, బటానీలు, బ్రోకలీ, తాజా పండ్లు, గింజపప్పుల వంటివి తీసుకోవాలి. వీటితో పీచు ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చూస్తుంది.
* రోజూ వ్యాయామం చేయటం తప్పనిసరి. ధ్యానం, యోగాలను జత చేసుకుంటే ఇంకా మంచిది.
* కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ముందు కూర్చోవటం తగ్గించుకోవాలి.
* తగినంత సేపు, కంటి నిండా నిద్ర పోవాలి.
* పొగ, మద్యం, అతిగా కెఫీన్‌ తీసుకోవటం వంటి అలవాట్లుంటే మానుకోవాలి.
* మంచి పుస్తకాలు చదవటం, శ్రావ్యమైన సంగీతం వినటం వంటి ఒత్తిడిని తగ్గించే పనులు చేయాలి.
* మగవారిలో స్తంభనలోపం, ఆడవారిలో అసంకల్పితంగా యోని కండరాలు సంకోచించటం వంటి సమస్యలుంటే చికిత్స తీసుకోవాలి.
* శృంగార సమస్యల గురించి ఏవైనా ఆందోళనలకు గురవుతుంటే మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి.
* సురక్షితమైన శృంగారానికి కండోమ్‌ల వంటివి వాడుకోవాలి. భాగస్వామితో శృంగార జీవితానికి కట్టుబడి ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని