కిడ్నీ తిత్తులకు మూలమిదే

కిడ్నీల్లో నీటితిత్తులు (పీకేడీ) పెద్ద సమస్య. జన్యుపరంగా తలెత్తే ఇది ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంటుంది. పీకేడీలో కిడ్నీల్లోని సన్నటి గొట్టాలు ఉబ్బి, నీటి బుడగల్లా మారుతుంటాయి

Published : 10 Jan 2023 00:28 IST

కిడ్నీల్లో నీటితిత్తులు (పీకేడీ) పెద్ద సమస్య. జన్యుపరంగా తలెత్తే ఇది ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంటుంది. పీకేడీలో కిడ్నీల్లోని సన్నటి గొట్టాలు ఉబ్బి, నీటి బుడగల్లా మారుతుంటాయి. క్రమంగా తిత్తుల్లా తయారవుతాయి. ఇవి ఆరోగ్య కణజాలం మీద ఒత్తిడి కలగజేసి, సమస్యలు సృష్టిస్తాయి. కిడ్నీ వైఫల్యానికీ దారితీస్తాయి. దీనికి కారణమయ్యే పలు జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు గానీ ఈ తిత్తులు ఎలా ఏర్పడతాయనేది ఇప్పటికీ తెలియదు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన బెంజమిన్‌ ఫ్రీడ్‌మన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీని గుట్టును ఛేదించింది. కిడ్నీల్లోని గొట్టాల్లో నిరంతరం ద్రవం ప్రవహిస్తుంటుంది. మన శరీరంలోని ద్రవాల్లో 25% ఎప్పుడూ వీటిల్లోనే ఉంటుంది. ఆందుకే ప్రయోగశాల పాత్ర మీద కిడ్నీల చిన్న రూపాలను వృద్ధి చేసి.. వాటికి నీరు, చక్కెర, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాల మిశ్రమాన్ని అందించి పరిశీలించారు. కిడ్నీ తిత్తులు గ్లూకోజును గ్రహించి, నీటిని లోపలికి లాక్కుంటున్నాయని.. ఇవి తిత్తుల సైజు పెరగటానికి కారణమవుతున్నాయని గుర్తించారు. తిత్తులు గ్లూకోజును సంగ్రహించటం విశేషం కాదు గానీ అవి దీని మీద ఆధారపడటమే ఆశ్చర్యకరం. కిడ్నీల్లో తిత్తులు ఏర్పడటంపై ఇది కొత్త అవగాహన కల్పించింది. పీకేడీని గుర్తించటానికి, చికిత్సలను రూపొందించటానికి తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని