వినికిడి లోపం వెనక్కి?

వినికిడి లోపాన్ని సరిదిద్దొచ్చా? తిరిగి వినికిడిని రప్పించొచ్చా? యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది.

Published : 21 Feb 2023 00:27 IST

వినికిడి లోపాన్ని సరిదిద్దొచ్చా? తిరిగి వినికిడిని రప్పించొచ్చా? యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. మనకు శబ్దాలు వినిపించటానికి తోడ్పడే చెవిలోని సూక్ష్మకేశాలు పునరుజ్జీవం పొందే అవకాశముందని తేలటమే దీనికి కారణం. సాధారణంగా ఇవి దెబ్బతింటే తిరిగి వృద్ధి చెందవు. ఇది క్రమంగా వినికిడి లోపానికి దారితీస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ ఎవరికైనా ఇది తలెత్తొచ్చు. కానీ తరచూ పెద్ద పెద్ద శబ్దాల ప్రభావానికి గురయ్యే సైనికులు, నిర్మాణ కార్మికులు, సంగీత కళాకారుల వంటి వారికి దీని ముప్పు మరింత ఎక్కువ. అయితే పక్షులు, చేపల్లో ఈ సూక్ష్మకేశ కణాలు పునరుత్తేజితం అవుతుండటం విశేషం. దీని లోగుట్టును తెలుసుకోవటంలో డెల్‌ మాంటే ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ న్యూరోసైన్స్‌ పరిశోధకులు ముందడుగు వేశారు. ఈఆర్‌బీబీఆర్‌ అనే గ్రోత్‌ జన్యువు ఎస్‌పీపీ1 వంటి వివిధ రకాల ప్రోటీన్ల వ్యక్తీకరణతో మూలకణాల వంటి వాటిని సృష్టిస్తోందని, ఫలితంగా ఎలుకల కాక్లియాలోని కణాలు ప్రేరేపితమై సూక్ష్మకేశాలు తిరిగి వృద్ధి చెందేలా చేస్తోందని గుర్తించారు. సూక్ష్మకేశాల వృద్ధి బాల్యదశకే పరిమితం కాదని, పెద్దయ్యాకా దీన్ని సాధించే అవకాశముందని దీంతో రుజువైంది. అందుకే ఇప్పుడు పరిశోధకులు క్షీరదాలపై అధ్యయనం చేయటానికి సన్నద్ధమయ్యారు. ఇది విజయవంతమైతే వినికిడి లోపాన్ని వెనక్కి మళ్లించటానికి దారి పడినట్టేనని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు