బ్యాక్టీరియాకూ ఎంఆర్‌ఎన్‌ఏ టీకా

ప్రస్తుతానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు సార్స్‌-కొవీ2 వంటి వైరస్‌లను సమర్థంగా అడ్డుకుంటున్నాయి. కానీ బ్యాక్టీరియాను నిలువరించే ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు లేవు.

Published : 28 Mar 2023 00:38 IST

ప్రస్తుతానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు సార్స్‌-కొవీ2 వంటి వైరస్‌లను సమర్థంగా అడ్డుకుంటున్నాయి. కానీ బ్యాక్టీరియాను నిలువరించే ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు లేవు. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ (టీఏయూ) శాస్త్రవేత్తలు ఈ లోటును పూరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్లేగును నయం చేయగల ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను రూపొందించారు. యాంటీబయాటిక్‌ మందులను తట్టుకొనే బ్యాక్టీరియాకు సమర్థమైన టీకాలను తయారు చేయటానికిది దారి చూపగలదని భావిస్తున్నారు. యెర్సినియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియాతో ప్లేగు సంభవిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని బట్టి దీని లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అత్యంత తీవ్రమైన న్యుమోనిక్‌ ప్లేగు చాలా ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. యాంటీబయాటిక్‌ చికిత్సకు లొంగదు. ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన అధునాతన టీకా ఈ యెర్సినియా పెస్టిస్‌ బ్యాక్టీరియాను నూటికి నూరు శాతం అడ్డుకుంటున్నట్టు జంతువులపై నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. ఒక్క మోతాదుతోనే.. అదీ రెండు వారాల్లోనే పూర్తి స్థాయి రక్షణ లభించటం విశేషం. టీకాలు లేని హానికారక బ్యాక్టీరియా రకాలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు కొన్ని దశాబ్దాలుగా విచ్చిలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్‌ మందుల మూలంగా అవి మొండిగానూ తయారవుతున్నాయి. మందుల ప్రభావాన్ని తట్టుకునే ఇలాంటి బ్యాక్టీరియా ఇప్పటికే పెను ప్రమాదంగా మారింది. కొత్తరకం ఎంఆర్‌ఎన్‌ఏ టీకా దీనికి పరిష్కారం చూపగలదని టీఏయూకు చెందిన ప్రొఫెసర్‌ డ్యాన్‌ పీర్‌ చెబుతున్నారు. వైరస్‌లను ఎదుర్కోవటానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల మీద చాలాకాలంగా పరిశోధనలు జరగటం మూలంగానే కొవిడ్‌-19కు త్వరగా టీకా రూపొందించటం సాధ్యమైంది. ఒకవేళ మున్ముందు బ్యాక్టీరియాతో ఏదైనా మహమ్మారి పుట్టుకొస్తే సురక్షితమైన, సమర్థమైన టీకా రూపొందించటానికి తమ అధ్యయనం తోడ్పడగలదని పీర్‌ పేర్కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు