White Hair: తెల్ల కిరీటం!

అప్పటివరకూ నల్లగా నిగనిగలాడిన జుట్టే. కిరీటంలా అందాన్ని ద్విగుణీకృతం చేసిన జుట్టే. ఎందుకనో నెమ్మదిగా తెల్లబడటం మొదలవుతుంది.

Updated : 25 Apr 2023 04:12 IST

అప్పటివరకూ నల్లగా నిగనిగలాడిన జుట్టే. కిరీటంలా అందాన్ని ద్విగుణీకృతం చేసిన జుట్టే. ఎందుకనో నెమ్మదిగా తెల్లబడటం మొదలవుతుంది. మనసును ఏదో దిగులూ కమ్మేస్తుంది. అప్పుడే వృద్ధాప్యం ముంచుకొచ్చేసిందా? ఇప్పుడేం చేయటం? రంగు వేసుకోవాలా? లేకపోతే వయసుతో పాటు వచ్చిన మార్పే కదాని అలాగే వదిలేయాలా? అనే సందేహాలు ముసురుకుంటాయి. తెల్ల జుట్టు నిజాలేంటో తెలుసుకుంటే మనసు నెమ్మదించే అవకాశముంది.


తెలుపు రహస్యం

వెంట్రుకల కుదుళ్లలో వర్ణద్రవ్య కణాలు (మెలనోసైట్స్‌) ఉంటాయి. ఇవి మెలనిన్‌ అనే రసాయనాన్ని పుట్టిస్తాయి. జుట్టుకు రంగునిచ్చేది ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కణాలు చనిపోవటం మొదలెడతాయి. దీంతో తెల్లబడటం ఆరంభమవుతుంది. మెలనోసైట్స్‌ పరిపక్వం కావటానికి, ఇవి తిరిగి వృద్ధి చెందటానికి తోడ్పడే మూలకణాలు కదలకుండా బిగుసుకుపోవటమూ జుట్టు తెల్లబడటానికి కారణమవుతున్నట్టు న్యూయార్క్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో బయటపడింది. కారణమేదైనా గానీ.. మెలనిన్‌ లేకపోవటం వల్ల వెంట్రుకలు లేత రంగులో మొలుస్తాయి. ఇవి బూడిద రంగులో, వెండి రంగులో, తెల్లగా.. రకరకాల ఛాయల్లో కనిపిస్తాయి. వెంట్రుకల కుదుళ్లలో మెలనిన్‌ ఉత్పత్తి ఆగిపోతే ఇక నల్లటి జుట్టు మొలవదని గుర్తించాలి.  


ఎప్పుడు? ఎందుకు?

చాలామంది పని ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందని భావిస్తుంటారు. నిజానికి జన్యువులే కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు త్వరగా, వేగంగా తెల్లబడటాన్ని నిర్ణయించేది ఇవే. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా 30ల్లోనే జుట్టు తెల్లబడితే పిల్లలకూ అంతే త్వరగా వచ్చే అవకాశముందన్నమాట. మనలాంటి ఆసియా దేశ వాసులకు సగటున 30ల చివర్లలో జుట్టు నెరవటం మొదలవుతుంది. కొందరికి దీని కన్నా పదేళ్ల ముందే జుట్టు తెల్లబడటం మొదలు కావొచ్చు. దీన్నే బాల నెరుపంటారు. మనదేశంలో 25 ఏళ్లలోపే జుట్టు తెల్లబడితే బాల నెరుపుగా పరిగణిస్తారు.


జబ్బులతో నెరుస్తుందా?

విటమిన్‌ బి12 లోపం.. కొన్ని అరుదైన, వంశపారంపర్య కణితులు.. థైరాయిడ్‌ జబ్బు, బొల్లి వంటి సమస్యలతో జుట్టు తెల్లబడొచ్చు. పేను కొరుకుడులో జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది. చాలావరకు నల్ల జుట్టే రాలుతుంది. దీంతో మిగిలిన తెల్ల వెంట్రుకల మూలంగా హఠాత్తుగా జుట్టు నెరిసినట్టు అనిపిస్తుంది.


మానసిక ఒత్తిడితో తెల్లబడుతుందా?

మానసిక ఒత్తిడికి, జుట్టు తెల్లబడటానికి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ మానసిక ఒత్తిడితో జుట్టు మామూలుగా కన్నా మూడు రెట్లు ఎక్కువ వేగంగా ఊడిపోవచ్చు. తిరిగి మొలిచే జుట్టు నల్లగా కన్నా తెల్లగా ఉండే అవకాశముంది.


పొగ పెట్టొద్దు

పొగ అలవాటు తల నుంచి కాళ్ల వరకూ ప్రభావం చూపుతుంది. పొగ తాగనివారితో పోలిస్తే పొగ తాగేవారికి 30 ఏళ్ల లోపు జుట్టు తెల్లబడే ముప్పు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. జుట్టు లేత రాగి రంగులోకీ మారొచ్చు.


పీకేయాలా? వద్దా?

ఒక్క తెల్ల వెంట్రుకను పీకితే మూడు తెల్ల వెంట్రుకలు మొలుస్తాయని నమ్ముతుంటారు. ఇది నిజం కాదు. అయినా కూడా తెల్ల వెంట్రుకలను పీకొద్దు. దాని స్థానంలో మరో తెల్ల వెంట్రుక మొలుస్తుంది. వెంట్రుకను గట్టిగా లాగితే కుదుళ్లు దెబ్బతినొచ్చు. అప్పుడు కొత్త వెంట్రుక మొలవకపోవచ్చు. జుట్టు పలచబడిపోతుంది.


మరింత భద్రంగా

సహజ రంగు వెంట్రుకలతో పోలిస్తే తెల్ల వెంట్రుకలు పలుచగా ఉంటాయి. అందువల్ల ఎండలోని అతి నీలలోహిత కిరణాలు, వాతావరణంలోని తేమ, హానికారక రసాయనాల వంటి వాటి నుంచి మరింత ఎక్కువగా కాపాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వెంట్రుకల్లో నీటిశాతం తగ్గి పొడిగా, పెళుసుగా మారతాయి. కొబ్బరినూనె వంటివి రాసుకుంటే నిగనిగలాడతాయి. కొన్నిరకాల షాంపూలూ మేలు చేస్తాయి. తప్పదనుకుంటే రంగు వేసుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు