ఊబకాయ చికిత్స దిశగా..

ఊబకాయం, దీంతో ముడిపడిన మధుమేహం వంటి జబ్బులకు కొత్త చికిత్సలను కనుగొనే దిశగా యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ యాంగ్లియా, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు.

Updated : 06 Jun 2023 05:33 IST

ఊబకాయం, దీంతో ముడిపడిన మధుమేహం వంటి జబ్బులకు కొత్త చికిత్సలను కనుగొనే దిశగా యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ యాంగ్లియా, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. మంచి కొవ్వును వేడి రూపంలో ఖర్చు చేయటానికి వీలు కల్పించే అన్‌కప్లింగ్‌ ప్రొటీన్‌ 1 (యూసీపీ1) అణు స్వరూపాన్ని గుర్తించారు. ఇది యూసీపీ1ను కృత్రిమంగా ప్రేరేపించే చికిత్సలను రూపొందించటానికి తోడ్పడగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా కొవ్వు, చక్కెరల నుంచి లభించే అదనపు కేలరీలను ఖర్చయ్యేలా చేయొచ్చని వివరిస్తున్నారు. ఇది ఏదో ఒకరోజు ఊబకాయ చికిత్సకూ ఉపయోగపడగలదనీ భావిస్తున్నారు. మన శరీరంలో తెల్ల, ఊదా రంగు కొవ్వులుంటాయి. తెల్ల కొవ్వు శక్తిని నిల్వ చేసుకొని బరువు పెరిగేలా చేస్తుంది. అదే ఊదా కొవ్వు రక్తంలో కొవ్వు, చక్కెరలను విడగొట్టి వేడిని పుట్టిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీన్ని ఉత్తేజితం చేయటం ద్వారానే యూసీపీ1 బరువు అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. అందుకే దీనిపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇదెలా పనిచేస్తుందో తెలిస్తే మందులో ప్రేరేపించే అవకాశముంటుంది. తాజా అధ్యయనం ఈ దిశగా కొత్త మార్గాన్ని చూపించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని