కీళ్లవాతానికీ మధుమేహ మందు

రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడిచేయటం వల్ల రుమటాయిడ్‌ కీళ్లవాతం, ల్యూపస్‌ వంటి స్వీయ రోగనిరోధక జబ్బులు తలెత్తుతుంటాయి.

Published : 06 Jun 2023 00:34 IST

రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడిచేయటం వల్ల రుమటాయిడ్‌ కీళ్లవాతం, ల్యూపస్‌ వంటి స్వీయ రోగనిరోధక జబ్బులు తలెత్తుతుంటాయి. వీటికి మధుమేహ చికిత్సలో వాడే కానాగ్లిఫ్లోజిన్‌ మందు ఉపయోగ పడుతున్నట్టు స్వాన్‌సీ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. కానాగ్లిఫ్లోజిన్‌ రోగ నిరోధక కణాల్లో భాగమైన టి కణాల మీద ప్రభావం చూపుతుండటం విశేషం. తెల్ల రక్తకణాల్లో భాగమైన టి కణాలు ఇన్‌ఫెక్షన్లు, జబ్బులతో పోరాడటంలో పాలు పంచుకుంటాయి. కానీ స్వీయ రోగనిరోధక జబ్బుల్లో ఇవి ఆరోగ్యకరమైన కణజాలం మీదా దాడికి దిగుతాయి. ఇలాంటి జబ్బుల విషయంలో టి కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మందులతో మంచి ఫలితం కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కానాగ్లిఫ్లోజిన్‌ మందు టి కణాలు ప్రేరేపితం కాకుండా నిలువరిస్తున్నందున దీన్ని రుమటాయిడ్‌ కీళ్లవాతం వంటి జబ్బులకూ వాడుకోవచ్చని భావిస్తున్నారు. మధుమేహ నియంత్రణకే కాకుండా ఇది ఇతర జబ్బులకూ ఉపయోగ పడటం విశేషమని అనుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని