బాల్యంలో వాయు కాలుష్యంతో పెద్దయ్యాక ఊపిరితిత్తి సమస్య

బాల్యంలో వాయు కాలుష్య ప్రభావంతో పెద్దయ్యాక ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఉబ్బే (బ్రాంకైటిస్‌) ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది.

Published : 09 Jul 2024 00:43 IST

బాల్యంలో వాయు కాలుష్య ప్రభావంతో పెద్దయ్యాక ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఉబ్బే (బ్రాంకైటిస్‌) ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది. పిల్లలు రెండు రకాల కాలుష్యం ప్రభావాలకు గురవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 1. కాలుష్యం, దుమ్ము, పుప్పొడి, కార్చిచ్చు బూడిద, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, వాహనాల పొగ. 2. పెట్రోలు ఇంజిన్ల నుంచి వచ్చే నైట్రోజన్‌ ఆక్సైడ్‌. బ్రాంకైటిస్‌లో కళ్లెతో కూడిన తీవ్రమైన దగ్గు, పిల్లికూతలు, ఛాతీనొప్పి, శ్వాస సరిగా ఆడకపోవటం వంటి లక్షణాలుంటాయి. బాల్యంలో వాయు కాలుష్య ప్రభావాలు ఊపిరితిత్తుల మీద కనిపించీ కనిపించనట్టుగానే ఉన్నప్పటికీ పెద్దగా అవుతున్న కొద్దీ తీవ్ర అనర్థమే కలిగి స్తోందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల్లో శ్వాసకోశ, రోగనిరోధక వ్యవస్థలు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుంటాయి. శరీర ఎత్తు, బరువులతో పోలిస్తే ఎక్కువ గాలిని పీల్చుకుంటారు. అందువల్ల కాలుష్య ప్రభావానికి గురైనా పెద్దగా ఇబ్బందులుండవు. కానీ పెద్దయ్యాక సమస్యాత్మకంగా పరిణమిస్తోంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు చిన్నప్పుడు ఆరోగ్య సర్వేలో పాల్గొన్న కొందరిని ఎంచుకొని పరిశీలించారు. బాల్యంలో గాలి కాలుష్య ప్రభావానికీ పెద్దయ్యాక బ్రాంకైటిస్‌కూ గణనీయ సంబంధముంటున్నట్టు గుర్తించారు. చిన్నప్పుడు ఆస్థమా గలవారిపై ఎక్కువ ప్రభావం పడుతుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని