రోజూ విటమిన్ల మాత్రలా?

రోజూ విటమిన్ల మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఆరోగ్యంగా ఉన్నవారిలో ఇవి మరణాల ముప్పును తగ్గించటం లేదని వెల్లడైంది.

Updated : 09 Jul 2024 03:39 IST

రోజూ విటమిన్ల మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఆరోగ్యంగా ఉన్నవారిలో ఇవి మరణాల ముప్పును తగ్గించటం లేదని వెల్లడైంది. అమెరికాలోని నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పరిశోధకులు సుమారు 4 లక్షల మందిని 20 ఏళ్ల పాటు పరిశీలించి దీన్ని గుర్తించారు. మనలో చాలామంది ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి విటమిన్ల మాత్రలు వేసుకుంటుంటారు. అయితే వీటితో ఒనగూరే ప్రయోజనాలు, అనర్థాల గురించి కచ్చితంగా తెలియదు. విటమిన్ల మాత్రలు, మరణం ముప్పు మీద గతంలో చేసిన అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. పైగా అవి తక్కువ సమయంలో చేసిన అధ్యయనాలే. అందుకే దీర్ఘకాలం విటమిన్ల మాత్రలు వేసుకోవటానికీ మరణాలకూ మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన క్యాన్సర్, ఇతర దీర్ఘకాల సమస్యలు లేనివారిని.. ఆరోగ్యవంతులను ఎంచుకొని చాలా ఏళ్లు పరిశీలించారు. విటమిన్‌ మాత్రలు వేసుకోనివారితో పోలిస్తే వేసుకునేవారిలో మరణాల ముప్పేమీ తగ్గలేదని తేలింది. క్యాన్సర్, గుండెజబ్బు, పక్షవాతం వంటి జబ్బులతో సంభవించే మరణాల్లోనూ తేడా కనిపించలేదు. జాతి, విద్య, ఆహార నాణ్యత వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని చూసినా ఫలితాల్లో మార్పేమీ లేదు. అందువల్ల పోషకాల లోపం, వయసుతో పాటు వచ్చే సమస్యల వంటివి పరిశీలించి విటమిన్ల వాడకం, మరణాల ముప్పును మదించటం ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని