కురులు వాడనీయొద్దు!

ఎండలో తిరిగితే జుట్టు కళ తప్పుతుంది. వేడి మూలంగా వెంట్రుకలు నిగనిగలాడటానికి తోడ్పడే ప్రోటీన్‌ దెబ్బతింటుంది. సూర్యరశ్మిలోని....

Published : 29 Mar 2016 02:48 IST

కురులు వాడనీయొద్దు!

ఎండలో తిరిగితే జుట్టు కళ తప్పుతుంది. వేడి మూలంగా వెంట్రుకలు నిగనిగలాడటానికి తోడ్పడే ప్రోటీన్‌ దెబ్బతింటుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలూ విపరీత ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో వేసవిలో వెంట్రుకలను కాపాడుకోవచ్చు.

* వేసవిలో వెంట్రుకలు, మాడు జిడ్డుగా అవుతాయి. అందువల్ల తరచూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకలు నిగనిగలాడతాయి.

* వెంట్రుకలకు కండిషనర్‌ను రాసి, కొద్దిసేపు షవర్‌ క్యాప్‌ ధరించాలి. ఇది ఎండకు ప్రభావితమైన కురులు తిరిగి కోలుకోవటానికి తోడ్పడుతుంది.

* సముద్రతీర ప్రాంతాల్లో షికారు చేసేవారు ఎస్‌పీఎఫ్‌తో కూడిన కండిషనర్‌ను జుట్టుకు రాసుకోవాలి. దీంతో సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావం బారి నుంచి వెంట్రుకలను కాపాడుకోవచ్చు.

* ఎక్కువసేపు ఎండలో తిరగాల్సి వస్తే వెడల్పయిన అంచు గల టోపీ ధరించటం మంచిది. ఇది వెంట్రుకలతో పాటు చెవులు, మెడకూ రక్షణ ఇస్తుంది.

* వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు వెంట్రుకలు చిక్కుపడే అవకాశం ఎక్కువ. శుభ్రంగా దువ్వుకొని జడ వేసుకోవటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. వెంట్రుకలు చిక్కు పడకుండా చూసే నూనెలూ వాడుకోవచ్చు.

* ఈతకు వెళ్లేవాళ్లు ముందుగా మంచి నీటితో తలను పూర్తిగా తడపాలి. దీనివల్ల ఉప్పునీటిని, కొలనులోని రసాయనాలను వెంట్రుకలు స్వీకరించవు. ఈత కొట్టాక తలను శుభ్రంగా తుడుచుకోవటం మంచిది. అలాగే తగినంత నీరు తాగుతూ ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు. ఇది వెంట్రుకలకూ మేలు చేస్తుంది.

* వెంట్రుకలను ఆరబెట్టే డ్రయర్లు, వంకర్లు తిప్పే సాధనాలను ఎండకాలంలో వాడకపోవటమే ఉత్తమం.

* వేడినీటితో తలస్నానం చేస్తే వెంట్రుకలు పొడిబారతాయి. అదే చల్లటి నీరు వెంట్రుకల పైపొర మూసుకుపోయేలా చేసి లోపలి తేమను పట్టి ఉంచుతుంది. అందువల్ల వేసవిలో చన్నీళ్ల స్నానం చేయటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు