అరచేతిలో అవగాహన!

రొమ్ములు.. స్త్రీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే శరీర భాగాలు! వంపుసొంపుల అందాలకే కాదు.. స్త్రీత్వానికి ఒక అర్థాన్నీ, అస్తిత్వాన్ని కూడా తెచ్చిపెట్టే అపురూపమైన శరీర భాగాలివి. పిల్లగా మొదలైన తన జీవన యానంలో.. మరో పిల్లకు తల్లిగా నిలబడేందుకు ప్రతి మహిళనూ సన్నద్ధం చేసే ప్రకృతి సిద్ధమైన ఏర్పాట్లివి. అందుకే స్త్రీ జీవితంలో దశ మారినప్పుడల్లా ఇవీ మార్పులకు లోనవుతాయి.

Published : 21 Mar 2017 01:40 IST

అరచేతిలో అవగాహన!
రొమ్ముల ఆరోగ్యం

రొమ్ములు.. స్త్రీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే శరీర భాగాలు! వంపుసొంపుల అందాలకే కాదు.. స్త్రీత్వానికి ఒక అర్థాన్నీ, అస్తిత్వాన్ని కూడా తెచ్చిపెట్టే అపురూపమైన శరీర భాగాలివి. పిల్లగా మొదలైన తన జీవన యానంలో.. మరో పిల్లకు తల్లిగా నిలబడేందుకు ప్రతి మహిళనూ సన్నద్ధం చేసే ప్రకృతి సిద్ధమైన ఏర్పాట్లివి. అందుకే స్త్రీ జీవితంలో దశ మారినప్పుడల్లా ఇవీ మార్పులకు లోనవుతాయి. ఈ మార్పుల్లో సహజమైనవేవి? అసహజమైనవేవి? అన్నది తెలుసుకోవటమే ఇప్పుడు ప్రతి మహిళ ముందున్న కర్తవ్యం!

ఎందుకంటే ఒకవైపు రొమ్ము క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరిగి పోతున్నాయి. ఈ క్యాన్సర్‌ మార్పులను ఎంత ముందుగా పట్టుకోగలిగితే మనం దాన్ని అంత సమర్థంగా జయించే వీలుంటుంది. కాబట్టి ప్రతి మహిళా రొమ్ముల్లో వచ్చే మార్పులు, సమస్యల్లో సర్వసాధారణమైనవేవి? క్యాన్సర్‌ను అనుమానించాల్సినవేవి? అన్నది తెలుసుకోవటం అవసరం.

 ఇవి సహజం
ఆడపిల్ల రజస్వల అయినప్పటి నుంచీ.. పెరిగి పెద్దదై నెలసరి నిలిచిపోయే వయసుకు చేరుకునే వరకూ కూడా... జీవితంలోని ప్రతి దశలోనూ రొమ్ముల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. అందుకని ఏ వయసులో ఎలాంటి మార్పులు సహజం? ఏ మార్పులను తేలికగా తీసుకోకూడదన్న అవగాహన ప్రతి ఆడపిల్లకూ ఉండాలి.

* సాధారణంగా 9-11 ఏళ్ల వయసులో రొమ్ములు పెరగటం ఆరంభమవుతుంది. ఈ సమయంలో కొందరికి చిన్నచిన్న గడ్డల్లాంటివి తగులుతుండొచ్చుగానీ వీటికి చికిత్సేమీ అవసరం ఉండదు.

* రొమ్ములు పూర్తిగా ఎదిగిన తర్వాత.. నెలసరి సమయంలో కొన్ని మార్పులు కనబడటం సహజం. నెలసరి రావటానికి కొద్ది రోజుల ముందు రొమ్ములు కాస్త పెద్దగా అవటం, బరువుగా, కొద్దిగా సలపరింతగా అనిపించొచ్చు. నెలసరి తర్వాత ఇవి క్రమేపీ తగ్గిపోతాయి.

* గర్భం ధరించినపుడు పాలను ఉత్పత్తి చేసే కణాలు పెరగటం వల్ల రొమ్ములు పెద్దగా అవుతాయి. నొప్పి కూడా ఉండొచ్చు. చనుమొనలు నల్లగా అవుతాయి.

* కాన్పు అనంతరం బిడ్డకు పాలిచ్చే సమయంలో రోజులో చాలాసార్లు రొమ్ముల సైజు మారిపోతుంటుంది. పాలివ్వటం ఆపేశాక.. రొమ్ములు సాధారణంగా తిరిగి మామూలు సైజుకు వచ్చేస్తాయి. మొత్తమ్మీద.. సైజులో మునుపటితో పోలిస్తే కొద్దిపాటి తేడాలుండొచ్చు, బిగుతు కూడా తగ్గొచ్చు.

అందరిలో ఒకేలా ఉండవు
రొమ్ములు కొందరిలో పెద్దగా, మరికొందరిలో చిన్నగా ఉండొచ్చు. ఒకటి పెద్దగా, మరోటి చిన్నగా ఉండొచ్చు. రెంటి ఆకారంలోనూ తేడా ఉండొచ్చు. కొందరికి పుట్టినప్పటి నుంచీ లేదా రొమ్ములు ఎదిగినప్పటి నుంచీ కూడా చనుమొనలు లోపలికి లాక్కొనిపోయే ఉండొచ్చు. కాబట్టి ఎవరికి వారు ముందు నుంచీ కూడా తమ రొమ్ముల ఆకారం, సైజు, స్వభావం ఎలా ఉంటున్నాయన్న దానిపై అవగాహనతో ఉండటం అవసరం. దీనివల్ల- ఎప్పుడన్నా రొమ్ముల్లో అసాధారణ మార్పులేవైనా మొదలైతే వెంటనే పట్టుకునే వీలుంటుంది.

ఇవి అసహజం!
రొమ్ముల్లో అంతకు ముందు లేని కొత్త మార్పులేవైనా వస్తున్నాయేమో అప్పుడప్పుడు గమనిస్తుండాలి. రొమ్ముల నుంచి చంకలు, మొడ ఎముక వరకూ కూడా చేత్తో తడుముతూ చూసుకోవాలి. ఏవైనా మార్పులు కనబడితే తాత్సారం చెయ్యకూడదు. ముఖ్యంగా ఇలాంటి మార్పులను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు..

* రొమ్ముల సైజులోగానీ, షేపులోగానీ తేడా రావటం

* చనుమొన లోపలికి తిరిగిపోవటం లేదా దాని ఆకారం మారటం. అంతకు ముందున్న చోటు నుంచి మొన పక్కకు జరగటం, సైజు మారటం.

* చనుమొన చుట్టూ ఎర్రబడటం, లేదా దద్దులా రావటం

* రొమ్ముల నుంచి అకారణంగా స్రావాల వంటివి వస్తుండటం

* రొమ్ము మీద చర్మంలో మార్పు (నారింజ తొక్కలా) రావటం, సొట్ట పటడటం

* చంకలోగానీ, మెడ ఎముక దగ్గరగానీ వాపులా రావటం

* రొమ్ము మీద ఎక్కడన్నా గడ్డలాగా లేదా కాస్త గట్టిబడినట్లుగా అనిపించటం

* రొమ్ములోగానీ, చంకలోగానీ వీడకుండా నొప్పి అనిపించటం

ఇతర సమస్యలు
రొమ్ముల్లో ఏ సమస్య తలెత్తినా క్యాన్సరేమో అన్న అనుమానం పెరిగిపోతోంది. వాస్తవానికి క్యాన్సర్‌తో సంబంధంలేని సాధారణ రొమ్ము సమస్యలూ ఎక్కువగానే కనబడుతుంటాయి. వీటి పైనా అవగాహన కలిగి ఉండటం అవసరం.

* రొమ్ముల్లో నొప్పి: ఇది తరచుగా కనబడేదే. ముట్లుడగటానికి ముందస్తు దశలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఏదో ఒక సమయంలో దీన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. రొమ్ముల్లో నొప్పి అనగానే చాలామంది క్యాన్సరేమోనని భయపడిపోతుంటారు. కానీ నొప్పి ఒక్కటే క్యాన్సర్‌కు సంకేతం కాదు. నిజానికి చాలామందికి రొమ్ము క్యాన్సర్‌ తొలిదశలో గడ్డ ఉన్నప్పటికీ ఎలాంటి నొప్పీ ఉండదు. సాధారణంగా కొందరికి నెలసరి ఆరంభం కావటానికి వారం ముందు నుంచే రొమ్ముల్లో అసౌకర్యం, చిన్న చిన్న గడ్డలున్నట్టు అనిపించటం, నొప్పి వంటివి కనబడుతుంటాయి. నెలసరి మొదలవగానే ఇవి తగ్గిపోతుంటాయి. మరికొందరిలో నెలసరితో సంబంధం లేకుండా మిగతా సమయాల్లో కూడా నొప్పి వస్తుంటుంది. కొన్నిసార్లు ఇతరత్రా కండరాలు, కీళ్ల వంటి వాటిల్లో తలెత్తే నొప్పులు కూడా రొమ్ము నొప్పిలా అనిపించొచ్చు. వీటిని వైద్యులు గుర్తించి, చికిత్స అందిస్తారు.

* కణజాలం గట్టిపడటం: కొందరికి రొమ్ముల్లోని క్షీర గ్రంథుల మీది కణజాలం పెరిగి బంతిలా ఏర్పడి, గట్టిగా అవుతుంటుంది. దీన్నే ఫైబ్రోఎడినోమా అంటారు. దీనికి చాలావరకూ రొమ్ముకణజాలం ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కు అతిగా స్పందించటమే మూలం. సాధారణంగా ఈ గడ్డలు చిన్నగానే.. 1-3 సెంటీమీటర్ల లోపే ఉంటాయి. వీటితో మున్ముందు క్యాన్సర్‌ వస్తుందన్న భయమేమీ అవసరం లేదు. అయితే ఇవి మరీ పెద్దగా తయారైతే మున్ముందు క్యాన్సర్‌కు దారితీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి.

* నీటితిత్తులు: రొమ్ముల్లో వచ్చే మార్పుల్లో భాగంగా సహజంగానే కొందరిలో రొమ్ము కణజాలంలో ద్రవంతో నిండిన తిత్తులు ఏర్పడుతుంటాయి. ఇవి ఏ వయసులోనైనా రావొచ్చు గానీ 35 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ. ముట్లుడిగే దశకు చేరుకుంటున్నకొద్దీ మరింత ఎక్కువగా కనబడుతుంటాయి. ఆ తర్వాత ఆగిపోవచ్చు లేదా తక్కువగా రావొచ్చు. అయితే హార్మోన్ల చికిత్స తీసుకునే వారిలో ముట్లుడిగిన తర్వాత కూడా తిత్తులు ఏర్పడొచ్చు. వీటితో క్యాన్సర్‌ భయమేం ఉండదు. సాధారణంగా వీటిని తొలగించాల్సిన అవసరం కూడా ఉండదు. మరీ పెద్దగా అప్పుడు వైద్యులు నీరు తీస్తారు.

* స్రావాలు: చాలామందిలో ముట్లుడిగే దశకు చేరుకుంటున్నకొద్దీ చనుమొనల వెనకాల ఉండే క్షీర నాళాలు పొట్టిగానూ, వెడల్పుగానూ తయారవుతుంటాయి. దీన్నే ‘డక్ట్‌ ఎక్టేసియా’ అంటారు. ఇది సహజమైన పరిణామం. దీనికి భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు ఇలా వెడల్పయిన నాళాల్లో ద్రవం చేరుకుని, అరుదుగా పుండ్లు కూడా పడొచ్చు. ఇదేమీ క్యాన్సర్‌కు దారి తీసేది కాదు. కాకపోతే సమస్య ఇదేనని కచ్చితంగా నిర్ధారించుకోవటం అవసరం. చాలాసార్లు దీనికి పెద్ద చికిత్స కూడా అవసరం ఉండదు. మరీ ఎక్కువగా ఉంటే వైద్యులు సర్జరీ చేసి ఆ గ్రంథిని తొలగిస్తారు.

రొమ్ము క్యాన్సర్‌ అంటే?
రొమ్ముల ప్రధాన విధి పాల ఉత్పత్తి. ఇందుకోసం రొమ్ముల్లో క్షీర గ్రంథులు (లోబ్యూల్స్‌), ఉత్పత్తి అయిన పాలను చనుమొన వద్దకు చేర్చే నాళాలు (డక్ట్స్‌) ఉంటాయి. రొమ్ముల్లో అధికభాగం కొవ్వు కణజాలం ఉంటుంది. అలాగే రొమ్ముల్లో తయారయ్యే ఇతరత్రా ద్రవాలను బయటకు తీసుకెళ్లేందుకు చంకల వరకు లింఫ్‌ నాళాలుంటాయి. రొమ్ముల్లోని కణజాలంలో ఎక్కడైనా, ఏదైనా కణం అస్తవ్యస్తంగా, తామరతంపరగా విభజన చెందుతూ.. కణితిలా పెరగటాన్నే ‘క్యాన్సర్‌’ అంటాం.

రొమ్ముల్లో వస్తున్న క్యాన్సర్‌ మార్పులను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే వీలుంటుంది. క్యాన్సరేమోనన్న అనుమానం వస్తే- వైద్యులు ముందుగా చేతితో నొక్కి పరీక్షించటం, మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించటం.. అనుమానం ఉన్న ప్రదేశంలోకి సూదిని పంపి, అక్కడి నుంచి చిన్నముక్కను సేకరించి పరీక్షించటం బాగా ఉపయోగపడతాయి. వీటితో క్యాన్సర్‌ కచ్చితంగా నిర్ధరణ అవుతుంది.

అపోహలు ఎన్నెన్నో..
రొమ్ము క్యాన్సర్‌ విషయంలో బోలెడన్ని అపోహలు, అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలోని నిజానిజాలేమిటో చూద్దాం.

* రొమ్ముల్లో ఏర్పడే గడ్డలన్నీ క్యాన్సర్లేనా?
రొమ్ముల్లో గడ్డలు చాలా సందర్భాల్లో రావచ్చు. ప్రతి 10 గడ్డల్లో 9 క్యాన్సర్‌ గడ్డలు కావు. కాకపోతే వీటిని పరీక్షించి- క్యాన్సర్‌ గడ్డలు కావని నిర్ధరించుకోవటం అవసరం.

* రొమ్ము క్యాన్సర్‌ పెద్ద వయసు మహిళల్లోనే వస్తుందా?
రొమ్ము క్యాన్సర్‌ అనేది చాలా వరకూ 50 ఏళ్లు పైబడిన వారిలోనే కనబడుతున్నా.. ఇది ఏ వయసు వారికైనా రావొచ్చు. మన దేశంలో చాలామందిలో 50 ఏళ్లలోపే బయటపడుతుండటం గమనార్హం.

* రొమ్ము క్యాన్సర్‌ మగవారికీ వస్తుందా?
మగవారికి రొమ్ములు ఉండవని, కాబట్టి రొమ్ము క్యాన్సర్‌ రాదని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. రొమ్ములు పెద్దగా లేకపోయినా.. పురుషుల్లోనూ రొమ్ము కణజాలం ఉంటుంది. కాబట్టి మగవారికీ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. కాకపోతే స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు తక్కువ. ఏటా నిర్ధరణ అవుతున్న మొత్తం రొమ్ము క్యాన్సర్లలో సుమారు 1% మగవారిలోనే బయటపడుతున్నాయి.

* రొమ్ము క్యాన్సర్‌ ఎందుకొస్తుందో తెలుసా?
రొమ్ము క్యాన్సర్‌ ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పలేం. అయితే వయసు మీద పడుతున్న స్త్రీలకు దీని ముప్పు ఎక్కువ. సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రొమ్ము క్యాన్సర్‌ బారినపడటం (ముఖ్యంగా వాళ్లు చిన్నవయసులోనే ఈ క్యాన్సర్‌ బారినపడటం), 12 ఏళ్లకు ముందే రజస్వల కావటం, 55 ఏళ్ల తర్వాతే ముట్లుడగటం, సంతానం కలగకపోవటం లేదా 30 ఏళ్ల తర్వాత సంతానం కలగటం, నెలసరి నిలిచిపోయిన తర్వాత దీర్ఘకాలం హార్మోన్ల చికిత్స తీసుకోవటం, వూబకాయం.. ముఖ్యంగా ముట్లుడిగిన తర్వాత బరువు పెరగటం వంటివన్నీ రొమ్ము క్యాన్సర్‌ను ముప్పును పెంచుతాయి.

* తల్లిపాలు పట్టటం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చా?
బిడ్డకు తల్లిపాలు ఇవ్వటం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ రాకుండా చూసుకోగలమని చెప్పలేం. అయితే బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు.

* గర్భనిరోధక మాత్రలు రొమ్ము క్యాన్సర్‌కు దారితీస్తాయా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు చాలా తక్కువ మోతాదుల్లోనే ఉంటున్నాయి. కాబట్టి వీటితో రొమ్ము క్యాన్సర్‌ ముప్పేమీ పెరగదు.

* రొమ్ములకు దెబ్బలు తగిలినా, గాయాలైనా క్యాన్సర్‌కు దారితీస్తుందా?
దెబ్బలతోగానీ, గాయాలతోగానీ రొమ్ములకు క్యాన్సర్‌ రాదు.


యాప్‌ సిద్ధం

రొమ్ము క్యాన్సర్‌.. ఇప్పుడు మనం ఏమాత్రం విస్మరించలేని వాస్తవం! మన దేశంలో ఏటా లక్షా ఏభై వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. ప్రతి పది నిమిషాలకో మహిళ ఈ క్యాన్సర్‌కు బలైపోతోంది. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా.. ఇప్పటికీ దీని గురించి పైకి మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. రొమ్ముల్లో తేడా అనిపిస్తున్నా లేనిపోని దాపరికాలకు పోతూ చాలాకాలం తమలో తామే మథనపడుతున్నారు. చివరికి సమస్య బాగా ముదిరిన తర్వాతగానీ వైద్యులను సంప్రదించటం లేదు. ఆ స్థితిలో ఒక్కోసారి ప్రాణాలు కాపాడటమూ కష్టమవుతోంది. అందుకే ప్రతి మహిళా తన రొమ్ములపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా హైదరాబాద్‌కు చెందిన ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ‘ఎబిసి ఆఫ్‌ బ్రెస్ట్‌ హెల్త్‌’ పేరిట తొలిగా ఓ యాప్‌ను రూపొందించింది. విఖ్యాత నటుడు అమితాబ్‌బచ్చన్‌ గత వారం ముంబయిలో విడుదల చేసిన ఈ యాప్‌- రొమ్ముల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్రసమాచారాన్ని ఆంగ్లంతో పాటు 12 భారతీయ భాషల్లో సులభంగా అందిస్తోంది. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని అవగాహన పెంచుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని