ముప్పు కారకాలు లేకున్నా.. అశ్రద్ధ చూపొద్దు!

మన నమ్మకాలు వమ్మవుతున్నాయి. మన విశ్వాసాలు చెదిరిపోతున్నాయి. పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న రొమ్ముక్యాన్సర్‌ మనదేశంలోనూ గణనీయంగా విజృంభిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనే కనబడుతుందనేది కాస్తా మారుమూల పల్లెలకూ విస్తరించింది. అంతేనా? పెద్దవయసు మహిళలకే వస్తుందనే అభిప్రాయానికీ కాలం చెల్లింది. పెద్దా చిన్నా తేడా లేకుండా ఇప్పుడిది అన్ని వయసులవారినీ చుట్టుముడుతోంది. అధికబరువు, సంతానం కలగకపోవటం వంటి సంప్రదాయ ముప్పు కారకాలేవీ లేకపోయినా కూడా ఎంతోమంది దీని బారినపడుతున్నారు.

Published : 17 Oct 2017 01:28 IST

ముప్పు కారకాలు లేకున్నా.. అశ్రద్ధ చూపొద్దు!
ఇది రొమ్ముక్యాన్సర్‌ అవగాహన మాసం

మన నమ్మకాలు వమ్మవుతున్నాయి. మన విశ్వాసాలు చెదిరిపోతున్నాయి. పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న రొమ్ముక్యాన్సర్‌ మనదేశంలోనూ గణనీయంగా విజృంభిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనే కనబడుతుందనేది కాస్తా మారుమూల పల్లెలకూ విస్తరించింది. అంతేనా? పెద్దవయసు మహిళలకే వస్తుందనే అభిప్రాయానికీ కాలం చెల్లింది. పెద్దా చిన్నా తేడా లేకుండా ఇప్పుడిది అన్ని వయసులవారినీ చుట్టుముడుతోంది. అధికబరువు, సంతానం కలగకపోవటం వంటి సంప్రదాయ ముప్పు కారకాలేవీ లేకపోయినా కూడా ఎంతోమంది దీని బారినపడుతున్నారు. మరి ఈ ముప్పును ఎదుర్కోవటమెలా? ఇందుకు అవగాహనే బలమైన ఆయుధం! తొలిదశలోనే క్యాన్సర్‌ ఆనవాళ్లను గుర్తించటం.. ఆ మాటకొస్తే చిన్నవయసు నుంచే రొమ్ముల ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం ఎంతో అవసరం. ఒకవేళ క్యాన్సర్‌ ఆనవాళ్లు కనబడినా బెంబేలెత్తకుండా సమర్థవంతమైన, పూర్తికాలం చికిత్స తీసుకోవటం ఇంకా కీలకం. కాబట్టి రొమ్ముక్యాన్సర్‌కు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకొని ఉండటం తప్పనిసరి. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన మనలాంటి దేశాల్లో ఇది మరెంతో అవసరం కూడా. అందుకే ‘రొమ్ముక్యాన్సర్‌ అవగాహన మాసం’ సందర్భంగా ఈ ముప్పు తీరుతెన్నులపై సమగ్ర కథనం మీకోసం!

రొమ్ముక్యాన్సర్‌ బారినపడుతున్న దాదాపు సగం మంది మహిళలు ఎలాంటి ముప్పు కారకాలు లేనివారే!
రొమ్ముల్లో తలెత్తే అన్ని గడ్డలూ క్యాన్సర్‌ కాకపోవచ్చు. అయినా కూడా వీటిని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు.

ఎందుకొస్తుంది?

రొమ్ముక్యాన్సర్‌ ఎందుకొస్తుంది, ఎవరికి వస్తుందనేది కచ్చితంగా తెలియదు. దీనికి జన్యువుల దగ్గర్నుంచి మన పరిసరాలు, అలవాట్ల వరకూ రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. వయసు మీద పడుతుండటం, కుటుంబంలో ఎవరైనా చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌ బారినపడటం (5-10% రొమ్ముక్యాన్సర్లు వంశపారంపర్యంగా రావొచ్చు), త్వరగా రజస్వల కావటం, ఆలస్యంగా నెలసరి నిలిచిపోవటం, తొలి సంతానం ఆలస్యం కావటం, హార్మోన్ల చికిత్స తీసుకోవటం, వూబకాయం వంటివన్నీ రొమ్ముక్యాన్సర్‌కు ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నాయి. అయితే ఇలాంటి ముప్పుకారకాలేవీ లేకపోయినా కూడా రొమ్ముక్యాన్సర్‌ రావొచ్చు. నిజానికి దీని బారినపడుతున్న దాదాపు సగం మంది మహిళలు ఎలాంటి ముప్పు కారకాలు లేనివారే! చాలామంది రొమ్ముక్యాన్సర్‌ మహిళలకే వస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది మగవారికీ రావొచ్చు. కాకపోతే మహిళలతో పోలిస్తే మగవారిలో చాలా తక్కువ.

 

నివారించుకోలేమా?

రొమ్ముక్యాన్సర్‌కు కచ్చితమైన కారణాలేంటో తెలియదు. కాబట్టి దీన్ని నివారించుకునే మార్గాల గురించీ మనకు స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ దీని నివారణ విషయంలో ఆరోగ్యకరమైన జీవనశైలి కొంతవరకు తోడ్పడుతుంది. ఇది ఒక్క క్యాన్సర్‌కే కాదు.. ఇతరత్రా జబ్బుల బారిన పడకుండానూ కాపాడుతుంది.
* క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి.
* బరువును అదుపులో ఉంచుకోవాలి.
* కొవ్వు పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
* ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులను సంప్రతించకుండా హార్మోన్‌ మాత్రలు వేసుకోవద్దు.
* బిడ్డకు తల్లిపాలు పట్టటం ద్వారా రొమ్ముక్యాన్సర్‌ ముప్పూ తగ్గుతున్నట్టు నిర్ధరణ అయ్యింది. కాబట్టి వీలైనంతకాలం బిడ్డకు తల్లిపాలు పట్టాలి.

రొమ్ముక్యాన్సర్‌. ఈ మాట వినగానే మహిళా ప్రపంచం ఉలిక్కిపడుతోంది. రొమ్ములో చిన్నపాటి గడ్డ కనబడినా, ఏమాత్రం నొప్పిగా ఉన్నా క్యాన్సర్‌ కణితేమోననే కలవరపడిపోతోంది. రోజురోజుకీ రొమ్ముక్యాన్సర్‌ గణనీయంగా విజృంభిస్తుండటమే దీనికి కారణం. మనదేశంలో ఎక్కువమందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్లలో ఇదీ ఒకటిగా మారిపోవటం గమనార్హం. వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న మహిళల్లో సుమారు 27% మంది రొమ్ముక్యాన్సర్‌ భాధితులే ఉండటం మరింత ఆందోళనకర విషయం. ఇది సమస్య తీవ్రతకు చిన్న మచ్చుతునక మాత్రమే. మనదగ్గర క్యాన్సర్ల నమోదుకు తగు వ్యవస్థ లేదు. దీంతో రొమ్ముక్యాన్సర్‌తో ఎంతమంది బాధపడుతున్నారు, సమస్య తీవ్రత ఏమిటన్నది పూర్తిగా అవగతం కావటం లేదు. ఈ నేపథ్యంలో మనదేశంలో లెక్కలోకి రాని క్యాన్సర్‌ బాధితుల సంఖ్య ఎక్కువేనన్నది నిపుణుల అంచనా. మరో చిక్కేటంటే- పాశ్చాత్యదేశాల్లో కంటే ఇది మనదేశంలో సగటున పదేళ్ల ముందుగానే దాడి చేస్తుండటం. ఇలా చిన్నవయసులో వచ్చే క్యాన్సర్‌ మరింత ఉద్ధృతంగా, తీవ్రంగా కూడా ఉంటుంది. చిన్నవయసులో రొమ్ముల కణజాలం చిక్కగా, దళసరిగా ఉండటం వల్ల వీరిలో క్యాన్సర్‌ మార్పులను ముందుగా కనిపెట్టటం కాస్త కష్టమే. ఫలితంగా చాలామందిలో బాగా ముదిరిన తర్వాతే రొమ్ముక్యాన్సర్‌ బయటపడుతోంది. కణితిని గుర్తించేసరికే క్యాన్సర్‌ ఎంతోకొంత ముదిరిపోయి ఉంటోంది కూడా. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించటం, చాలామందిలో ముదిరిన తర్వాతే బయటపడుతుండటం వల్ల మనదగ్గర రొమ్ముక్యాన్సర్‌ మరణాలు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రజల్లో సరైన అవగాహన లేకపోటం, సామాజికంగా స్త్రీలను చిన్నచూపు చూడటం, మన కుటుంబాల్లో మహిళలు తమ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోకపోవటం.. ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించటానికి ముందస్తు పరీక్షల వ్యవస్థ లేకపోవటం వంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి.

తొలిదశలోనే గుర్తించటం కీలకం

  రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. అందువల్ల రొమ్ముక్యాన్సర్‌ ముప్పులున్నవారే కాదు.. మహిళలంతా తమ రొమ్ములపై అవగాహన కలిగి ఉండటం, రొమ్ముల పట్ల మరింత శ్రద్ధ చూపటం అవసరం. బిడియం లేకుండా రొమ్ములను చేతితో తాకి పరిశీలించుకోవటం మంచిది.
* రొమ్ముల్లో ఏదైనా గడ్డలాంటిది కనబడుతోందా?
* ఎక్కడైనా గట్టిబడినట్టు అనిపిస్తోందా?
* రొమ్ముల సైజు, షేపు ఏమైనా మారిందా?
* చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలేవైనా వస్తున్నాయా?
* చనుమొనల చుట్టూ ఎరుపు లేదా దద్దు ఉందా?
* చనుమొన లోపలికి తిరిగిపోయినట్టుందా.. ఆకారం మారినట్టు అనిపిస్తోందా?
* రొమ్ము మీది చర్మం మందమవుతోందా? ఎక్కడైనా గుంట లేదా సొట్ట బడినట్టు కనబడుతోందా?
* చంకల్లో గడ్డలు, నొప్పి వంటివి ఉన్నాయా? మెడ ఎముక దగ్గర వాపు గానీ వచ్చిందా?

- ఇలాంటి మార్పులేవైనా వస్తున్నాయా అనేవి గమనిస్తుండాలి. నిజానికి రొమ్ముల్లో తలెత్తే అన్ని గడ్డలూ క్యాన్సర్‌ కాకపోవచ్చు. చాలావరకు మామూలే గడ్డలే అయ్యిండొచ్చు. అయినా కూడా వీటిని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. అది క్యాన్సర్‌ గడ్డనా? కాదా? అనేది నిర్ధరించుకోవాలి. ఎలాంటి మార్పులు కనబడినా బిడియపడకుండా, తాత్సారం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రతించాలి. డాక్టర్లు చేతితో తాకి పరిశీలించి చూస్తారు. రొమ్ముక్యాన్సర్‌గా అనుమానిస్తే స్కానింగ్‌, గడ్డ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు.

స్క్రీనింగ్‌తో ముందే పట్టుకోవచ్చు

రొమ్ముక్యాన్సర్‌ను ముందుగానే పట్టుకోవటానికి తేలికైన మామోగ్రామ్‌ పరీక్ష (స్క్రీనింగ్‌) బాగా ఉపయోగపడుతుంది. అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ మార్గదర్శకాల ప్రకారం 45-54 ఏళ్ల వయసు మహిళలు ఏటా ఒకసారి మామోగ్రామ్‌ చేయించుకోవాలి. 55 ఏళ్ల తర్వాత ప్రతి రెండేళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. కానీ మనదేశంలో పదేళ్ల ముందుగానే రొమ్ముక్యాన్సర్‌ దాడి చేస్తున్నందువల్ల ఈ ముందస్తు పరీక్షను కాస్త ముందుగానే.. అంటే 40 ఏళ్ల నుంచే ఆరంభించటం మంచిది. అయితే మనలాంటి పెద్దదేశాల్లో మహిళలందరికీ రొమ్ముక్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కుదరకపోవచ్చు. అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్ష సదుపాయాలు ఏర్పాటు చేయటం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల కనీసం మంచి అవగాహన ఉన్న వైద్యులు, వైద్యసిబ్బంది వంటివారు రొమ్ములను చేతితో తాకి (క్లినికల్‌) అయినా పరిశీలించటం మంచిది. ఇది మామోగ్రామ్‌కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు గానీ రొమ్ముక్యాన్సర్‌ను ముందుగానే పోల్చుకోవటానికి కొంతవరకైనా తోడ్పడుతుంది. మనదేశంలో 50-60% రొమ్ముక్యాన్సర్‌ కేసులు బాగా ముదిరిన తర్వాతే బయటపడుతున్న నేపథ్యంలో రొమ్ముక్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా గలవారు లేదా రొమ్ముక్యాన్సర్‌ జన్యుపరీక్ష పాజిటివ్‌గా ఉన్నవారు అవసరమైతే డాక్టర్‌ సలహాతో ఎంఆర్‌ఐ పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.

* రొమ్ముల పరీక్షకు మహిళలు ముందుకు రాకపోవటం మరో సమస్య. పేదలు, నిరక్షరాస్యులే కాదు.. సంపన్నులు, చదువుకున్నవారు కూడా దీనికి మినహాయింపు కాదు. ఇప్పటికీ మన సమాజంలో ఎంతోమంది మహిళలు తమ ఆరోగ్యం గురించి, ఆందోళనల గురించి కుటుంబసభ్యులతో, సన్నిహితులతో, డాక్టర్లతో చెప్పుకోవటానికి వెనకాడుతుంటారు. తమలోనే దాచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ధోరణని వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం సజావుగా నడవటానికి తాము ఎంతో కీలకమని, తాము ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. రొమ్ముల్లో ఏదో ఇబ్బందిగా ఉందనిపించినపుడు, అదేంటో అర్థం కావటం లేదనుకున్నప్పుడు ఏమాత్రం తాత్సారం చేయరాదు. కుటుంబసభ్యులకు దాని గురించి చెప్పాలి. ఎలాంటి మొహమాటం లేకుండా డాక్టర్‌ను సంప్రతించి అన్ని విషయాలను వివరించాలి.

భయపడి పోవాల్సిన పనిలేదు

రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఒకప్పుడు క్యాన్సర్‌ కణితి దశలను బట్టే చికిత్స చేసేవారు. దీంతో ఫలితాలు అందరిలో ఒకేలా కనిపించేవి కావు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికీ అనుగుణంగా ప్రత్యేకమైన (పర్సనలైజ్డ్‌) చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. టార్గెటెడ్‌ థెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకరకంగా దీన్ని లేజర్‌ చూపించే దారిలో దూసుకెళ్లే క్షిపణిలాంటిదనుకోవచ్చు. ఇది క్యాన్సర్‌ కణంలో ఆయా గ్రాహకాలపై నేరుగా దాడిచేసి వాటిని నిర్వీర్యం చేస్తుంది. ఇలాంటి చికిత్సల మూలంగా రొమ్ముక్యాన్సర్‌ కూడా ఇప్పుడు కొంతవరకు మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యగా మారిపోయిందనీ చెప్పుకోవచ్చు. అందువల్ల రొమ్ముక్యాన్సర్‌ అనగానే ఇప్పుడు వణికి పోవాల్సిన పనిలేదు. దీన్ని తొలిదశలోనే గుర్తించి సమర్థ చికిత్స తీసుకుంటే 90% వరకు నయమైపోతుంది. అలాగే చికిత్స తీసుకునే సమయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించటం కూడా అవసరమే. నాటు వైద్యం వంటి ఇతరత్రా చికిత్సల జోలికి వెళ్లకుండానూ చూసుకోవాలి.

బిడ్డలకు పాలివ్వటమే కాదు.. స్త్రీల అందం, ఆహార్యం విషయంలో రొమ్ములకు ప్రత్యేక స్థానం ఉంది. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా రొమ్ముల ఆకృతి కొంతవరకు మారొచ్చు. ఒకప్పుడు రొమ్ముక్యాన్సర్‌ వస్తే శస్త్రచికిత్స ద్వారా రొమ్ము మొత్తం తొలగించేవారు. అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావటంతో ఇది చాలావరకు తగ్గిపోయింది. కణితి భాగాన్ని మాత్రమే తొలగించటం, అలాగే రేడియోథెరపీ చేయటం ద్వారా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయినా కూడా కొందరికి రొమ్ము పూర్తిగా తొలగించాల్సిన అవసరముండొచ్చు. ఇలాంటి వారికి కూడా రకరకాల పద్ధతులతో రొమ్ముల ఆకృతి చక్కగా కనిపించేలా చూడొచ్చు. దీన్నే రీకన్‌స్ట్రక్షన్‌ అంటారు.

 

కుటుంబం తోడ్పాటు

క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు శరీరాన్నే కాదు, మనసునూ పట్టి పీడిస్తుంటాయి. మనసులో తీవ్రమైన భావోద్వేగాలు రేగుతుంటాయి. క్యాన్సర్‌ నయమవుతుందా, లేదా? మున్ముందు జీవితం ఎలా ఉంటుంది? అనే భయాలు ముసురుకుంటాయి. అందువల్ల రొమ్ముక్యాన్సర్‌ను ఎదుర్కోవటంలో కుటుంబం, బంధువులు, సమాజం తోడ్పాటు కూడా ఎంతో ముఖ్యం. అనవసర భయాలు, లేనిపోని అపోహలకు తావివ్వకుండా చూసుకోవాలి. సమస్యను గుర్తించటం, నిర్ధరించటం దగ్గర్నుంచి.. చికిత్సలు పూర్తయ్యేంతవరకు అండగా నిలవటం, భరోసా ఇవ్వటం కీలకం. అలాగే రొమ్ముక్యాన్సర్‌ నుంచి బయటపడ్డవారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవటం, బృందంగా ఏర్పడి ఇతరులకు వివరించి చెప్పటం కూడా మంచిది. దీంతో రొమ్ముక్యాన్సర్‌పై సమాజంలో అవగాహన పెరుగుతుంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన మనలాంటి దేశంలో ఇదెంతో ముఖ్యం. ఇలాంటివాళ్లే నిజమైన క్యాన్సర్‌ విజేతలుగా నిలుస్తారు.

తిరగబెడుతుందనే బెంగ వద్దు

పూర్తి చికిత్సతో క్యాన్సర్‌ తగ్గినా మళ్లీ ఎప్పుడైనా తిరగబెడుతుందా? అనే ప్రశ్న చాలామందిని తొలుస్తుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలన్నీ క్యాన్సర్‌ కణాలను ఒంట్లో నుంచి పూర్తిగా నిర్మూలించి, మున్ముందు మళ్లీ తలెత్తకుండా చూసేవే. తొలిదశలోనే గుర్తించి, సమర్థ చికిత్స చేస్తే చాలావరకు ఇది తిరిగి రాకపోవచ్చు. కానీ కొద్దిమందికి మాత్రం మళ్లీ వస్తుండొచ్చు. అంతమాత్రాన అదేపనిగా దాని గురించి ఆలోచిస్తూ.. జీవితాన్ని దుర్భరం చేసుకోవటం వల్ల ఒరిగేదేమీ ఉండదని గుర్తించాలి. సానుకూలంగా వ్యవహరించటం, జీవితాన్ని ఆనందంగా గడపటం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో క్రమం తప్పకుండా పరీక్షలు డాక్టర్ల కౌన్సెలింగ్‌ ఎంతగానో ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని